Share News

బాలల పండుగ.. ఉత్సాహం నిండగా!

ABN , Publish Date - Feb 17 , 2025 | 12:05 AM

ఒంగోలు పీవీఆర్‌ మునిసిపల్‌ బాలుర ఉన్నత పాఠశాలలో, పాఠశాల మైదానంలో ఆదివారం నిర్వహించిన ప్రకాశం బాలోత్సవం కార్యక్రమంలో జిల్లావ్యాప్తంగా సుమారు 5 వేల మంది విద్యార్థులు పాల్గొన్నారు.

బాలల పండుగ.. ఉత్సాహం నిండగా!
మాట్లాడుతున్న ఎమ్మెల్యే జనార్దన్‌, పక్కన లక్ష్మీనారాయణ, రమణారెడ్డి, శ్రీనివాసరావు, సుబ్రమణ్యం

ఒంగోలులో అలరించిన బాలోత్సవ్‌ ప్రదర్శనలు

జిల్లా వ్యాప్తంగా 5 వేల మంది విద్యార్థుల హాజరు

పాల్గొన్న ఎమ్మెల్యే, ఎస్పీ, మేయర్‌

ఒంగోలు కల్చరల్‌, ఫిబ్రవరి 16(ఆంధ్రజ్యోతి) : కొందరు నృత్యంలో అద్భుత అభినయాన్ని ప్రదర్శించారు.. మరికొందరు చిత్రలేఖనంలో తమ చాతుర్యాన్ని చాటుకున్నారు.. ఇంకొందరు మట్టితో వ్యవసాయ పరికరాలను తయారుచేసి ఔరా అనిపించారు.. అంతేగాక ఫ్యాన్సీ డ్రస్సులతో వయ్యారంగా నడుస్తూ చూపరులను కట్టిపడేశారు.. వక్తృత్వ పోటీలలో తమ భాషా కౌశల్యాన్ని చాటి చెప్పారు.. ఇలా ఒక్కొక్కరు ఒక్కో అంశంలో సృజనాత్మకతకు కాదేదీ అనర్హం అని ఆ చిన్నారులు నిరూపించారు.

ఎవరేం మాట్లాడారంటే...

శాసనసభ్యులు దామచర్ల జనార్దన్‌ బాలోత్సవాన్ని తిలకించి మాట్లాడుతూ విద్యార్థులకు విద్యతోపాటు పలు రంగాల్లో విజ్ఞానం అవసరం అన్నారు. ఆ విజ్ఞానాన్ని వెలికితీసేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని చెప్పారు. ఎస్పీ ఏఆర్‌ దామోదర్‌ మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే చెడు అలవాట్లకు ముఖ్యంగా మాదక ద్రవ్యాలకు బానిసలు కాకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు జాగ్రత్త వహించాలన్నారు. డీఈవో కిరణ్‌కుమార్‌ మాట్లాడుతూ విద్యాశాఖకు వన్నెతెచ్చే విధంగా బాలోత్సవం కార్యక్రమాలు నిర్వహించటం అభినందనీయమని చెప్పారు. నగర మేయర్‌ గంగాడ సుజాత మాట్లాడుతూ బాలోత్సవం విద్యా ప్రగతికి విద్యార్థులలోని ప్రతిభాపాటవాలను వెలికితీసేందుకు ఉపయోగపడుతుందన్నారు. డాక్టర్‌ సతీష్‌ మాట్లాడుతూ సమాజ ప్రగతికి విద్యార్థులే పునాదులని చెప్పారు.


మొత్తం 54 విభాగాల్లో 5 వేల మంది విద్యార్థులు

ఒంగోలు పీవీఆర్‌ మునిసిపల్‌ బాలుర ఉన్నత పాఠశాలలో, పాఠశాల మైదానంలో ఆదివారం నిర్వహించిన ప్రకాశం బాలోత్సవం కార్యక్రమంలో జిల్లావ్యాప్తంగా సుమారు 5 వేల మంది విద్యార్థులు పాల్గొన్నారు. సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శనకు మొత్తం 8 వేదికలను ఏర్పాటు చేయగా, వ్యాసరచన, వక్తృత్వం, వైజ్ఞానిక ప్రదర్శనలను పాఠశాల తరగతి గదులలో, ఆవరణలో నిర్వహించారు. విద్యార్థులు లఘునాటికలు, జానపద నృత్యాలు, ఏకపాత్రలు, కోలాటం ఇలా 54 విభాగాల్లో ప్రదర్శించారు. అదేవిధంగా పద్యం చెప్పటం, కథ చెప్పటం, మట్టితో వ్యవసాయ పరికరాలను తయారు చేయటం వంటివి ప్రదర్శించారు.

బాలోత్సవం ప్రారంభ సభకు ఉత్సవ కమిటీ అధ్యక్షులు బండారు లక్ష్మీనారాయణ అధ్యక్షత వహించగా కార్యక్రమంలో డీసీఈబీ సెక్రటరీ ఎం.శ్రీనివాసరావు, కమిటీ గౌరవాధ్యక్షుడు ఏవీ రమణారెడ్డి, అమరావతి బాలోత్సవం కార్యదర్శి రామరాజు, యూటీఎఫ్‌ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు కొమ్మోజు శ్రీనివాసరావు, ఎంఈవోలు కిషోర్‌బాబు, బాలాజీ, కమిటీ నిర్వాహకులు కే సుబ్రహ్మణ్యం, డీ వీరాంజనేయులు, ఎస్‌ రవి పాల్గొన్నారు.

Updated Date - Feb 17 , 2025 | 12:05 AM