ప్రసవాలు ప్రభుత్వాసుపత్రిలో చేయించాలి
ABN , Publish Date - Jan 31 , 2025 | 11:12 PM
ప్రసవాలు ప్రభుత్వాసుపత్రిలో చేయించేలా ఆశా కార్యకర్తలు చొరవచూపాలని ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి చెప్పారు. స్థానిక అమరావతి గ్రౌండ్స్‌లో నియోజకవర్గ పరిధిలోని ఆశా కార్యకర్తలతో ఎమ్మెల్యే శుక్రవారం సమావేశం నిర్వహించారు.

ఆశా కార్యకర్తలతో ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి
కనిగిరి, జనవరి 30 (ఆంధ్రజ్యోతి) : ప్రసవాలు ప్రభుత్వాసుపత్రిలో చేయించేలా ఆశా కార్యకర్తలు చొరవచూపాలని ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి చెప్పారు. స్థానిక అమరావతి గ్రౌండ్స్‌లో నియోజకవర్గ పరిధిలోని ఆశా కార్యకర్తలతో ఎమ్మెల్యే శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికలకు ముందు తాను ప్రచార కార్యక్రమంలో ఉండగా ఏ గ్రామం వెళ్లినా చాలామంది ప్రసవం ఖర్చులు భరించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేసిన ఘటనలెన్నో ఉన్నాయన్నారు. అందుకే తాను ప్రధానంగా కనిగిరి ప్రభుత్వాసుపత్రి అభివృద్ధిపై దృష్టి సారించినట్లు చెప్పారు. ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టాలంటే ఓ ప్రణాళిక ప్రకారం ముందుకుపోవాలన్నారు. అందుకే దాతల సహకారంతో ప్రభుత్వాసుపత్రిలో అధునాతన హంగులతో, వైద్య పరికరాలతో వైద్య సేవలు అందించేలా తీర్చిదిద్దినట్లు తెలిపారు. రాష్ట్రంలోనే కనిగిరిలో ‘కంగారు కేర్’ సెంటర్‌ను ప్రారంభించామన్నారు. మత్తుడాక్టర్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అందుకు మీ సహకారం తోడైతేనే మంచి ఫలితాలు సాధించవచ్చని ఆశా కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. గర్భం దాల్చిన రోజు నుంచి ప్రత్యేక రిజిస్టరులో నమోదై 9నెలల పాటు వైద్యం పొంది ప్రభుత్వాసుత్రిలో ప్రసవం చేయించిన ఆశా కార్యకర్తలకు ప్రోత్సహక బహుమతి కింద రూ.1000 ఇస్తానన్నారు. ఈ సమావేశంలో డీఎంహెచ్‌వో సృజన, వైద్యాధికారులు ప్రియార్షానంద, స్వప్న, మంజుల, హైమావతి, జీవిఫణి, ఎంవీజయకుమార్, సందీప్, ఫిరోజ్, మహేష్, తులసీదాసులు పాల్గొన్నారు.
ప్రైవేటు ఆసుపత్రి కంటే బాగుంది
సమావేశం అనంతరం ఆశా కార్యకర్తలను ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర స్థానిక ప్రభుత్వాసుపత్రి సందర్శనకు తీసుకెళ్లారు. ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన సౌ కర్యాలు, తల్లీ, బిడ్డ సంరక్షణ కేంద్రాలు, ప్రసవ గదులు, ప్రత్యేక మిషనరీ, కంగారుకేర్ కేంద్రం, లాబోరేటరీలను ఆశా కార్యకర్తలు పరిశీలించారు.