నిర్లక్ష్యాన్ని సహించను
ABN , Publish Date - Jan 30 , 2025 | 01:55 AM
పనులు ప్రారంభించ కుండా నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ గంగవరపు జోసఫ్‌కుమార్ హెచ్చరించారు. బుధవారం ఆయన స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో మండలంలోని పలు గ్రామాల ఉపాధి హామీ పథకం సిబ్బందితో సమావేశమయ్యారు.

ఉపాధి సిబ్బందిపై డ్వామా పీడీ ఆగ్రహం
జిల్లాకు కొత్తగా 1,400 మినీ గోకులాలు మంజూరు
కొత్తపట్నం, జనవరి 29 (ఆంధ్రజ్యోతి): పనులు ప్రారంభించ కుండా నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ గంగవరపు జోసఫ్‌కుమార్ హెచ్చరించారు. బుధవారం ఆయన స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో మండలంలోని పలు గ్రామాల ఉపాధి హామీ పథకం సిబ్బందితో సమావేశమయ్యారు. పనులు చేపట్టడంలో సిబ్బంది నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతూ పద్ధతి మార్చుకోకపోతే దూరప్రాంతాలకు బదిలీ చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇప్పటివరకు కూలీలతో ఎన్ని గ్రూపులు ఏర్పాటు చేశారు.. రోజువారీ ఎంతమంది పేదలకు పని కల్పిస్తున్నారు? ఆయన ప్రశ్నించగా సిబ్బంది సమాధానం చెప్పలేక నీళ్లు నమిలారు. మండలంలో రెండు వేల మంది కూలీలు ప్రతిరోజూ పనులకు వచ్చేలా చూడకపోతే టెక్నికల్ అసిస్టెంట్లు, ఇతర సిబ్బందిపై చర్యలు తప్పవన్నారు. అమృత్ సరోవర్, పిష్ ఫాండ్స్, ట్రెంచింగ్ పనులు, హార్టికల్చర్, రైతువారీ కుంటలు వంటి పనులు ఉపాధి హామీ కింద గుర్తించాలన్నారు. ఉపాధి హామీ కింద చేపట్టే పనులు రైతులకు, గ్రామాలకు ఉపయోగకరంగా ఉండాలని ఆయన కోరారు. సమావేశంలో ఏపీడీ వెంకటస్వామి, ఏపీవో జ్యోస్న, ఈసీ చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీడీ జోసఫ్‌కుమార్ మాట్లాడుతూ జిల్లాలో ప్రస్తుతం 1,054 పశువుల షెడ్లు నిర్మాణంలో ఉన్నాయన్నారు. వీటిలో 700 షెడ్ల నిర్మాణం పూర్తయ్యిందన్నారు. ఇప్పడు కొత్తగా గ్రామానికి రెండు షెడ్ల వంతున జిల్లాకు 1,400 మినీగోకుల షెడ్లు మంజూర య్యాయని ఆయన తెలిపారు. త్వరలోనే లబ్ధిదారులు ఎంపిక పూర్తిచేసి పనులు ప్రారంభిస్తారని ఆయన పేర్కొన్నారు.