Share News

రైతులకు తీపిని పంచుతున్న నల్ల చెరకు

ABN , Publish Date - Feb 13 , 2025 | 11:47 PM

ఈ ఏడాది నల్ల చెరకు సాగు చేసిన రైతులు లాభాలబాటలో ఉన్నారు. పెట్టుబడులు పోను ఎకరాకు రెండు లక్షల వరకు ఆదాయం వస్తుంది. చెరకు సాగు చేసిన రైతుల్లో ఆనందరం వెల్లివిరుస్తోంది. వ్యాపారులు సైతం గ్రామాలకు వచ్చి చెరకు గెడలను కొనుగోలు చేసి వెళుతుండడంతో రైతులకు కూడా పెద్ద ఇబ్బంది లేదు. గత ఏడాది ధరలు కొంత వెనకంజ వేయగా ఈ ఏడాది మాత్రం మంచి డిమాండ్‌తో కొనుగోళ్లు జరుగుతున్నాయి.

రైతులకు తీపిని పంచుతున్న నల్ల చెరకు
చెరకు గడలకు ఉన్న ఆకును తొలగిస్తున్న కూలీలు

ఈ ఏడాది మంచి డిమాండ్‌

పెట్టుబడులు పోను ఎకరాకు రూ.2లక్షల పైనే ఆదాయం

బల్లికురవ మండలంలో 200 ఎకరాల్లో సాగు

ఇతర ప్రాంతాల నుంచి వ్యాపారులు వచ్చి కొనుగోలు

బల్లికురవ, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి) : ఈ ఏడాది నల్ల చెరకు సాగు చేసిన రైతులు లాభాలబాటలో ఉన్నారు. పెట్టుబడులు పోను ఎకరాకు రెండు లక్షల వరకు ఆదాయం వస్తుంది. చెరకు సాగు చేసిన రైతుల్లో ఆనందరం వెల్లివిరుస్తోంది. వ్యాపారులు సైతం గ్రామాలకు వచ్చి చెరకు గెడలను కొనుగోలు చేసి వెళుతుండడంతో రైతులకు కూడా పెద్ద ఇబ్బంది లేదు. గత ఏడాది ధరలు కొంత వెనకంజ వేయగా ఈ ఏడాది మాత్రం మంచి డిమాండ్‌తో కొనుగోళ్లు జరుగుతున్నాయి. తాము చెరకు పంటను నమ్ముకొని సాగు చేస్తున్నామని, ధరలు అశాజనకంగా ఉన్నాయని రైతులు అంటున్నారు.

బల్లికురవ మండలం అంటే జనవరి నుంచి నల్ల చెరకు పంటకు కేరా్‌ఫగా మారుతుంది. మండలంలోని కూకట్లపల్లి, గొర్రెపాడు గ్రామాలలో ఎన్నో ఏళ్ల నుంచి రైతులు నల్ల చెరకును సాగు చేస్తున్నారు. ఈ ఏడాది అ గ్రామాలను చూసి అంబడిపూడి, వైదన, కొత్తూరు, వెలమవారిపాలెం తదితర గ్రామాలలో కూడా రైతులు చెరకు పంట వైపు ఆసక్తిని చుపారు. మండలంలో మెత్తం 200 ఎకరాల్లో రైతులు గత ఏడాది ఏప్రిల్‌లో నల్ల చెరకు సాగు చేశారు. బోరు బావుల నీరు అందుబాటులో ఉన్న రైతులకు చెరకు పంట తీపిని పంచింది. రైతులు పండించిన నల్ల చెరకు కోతలు గత పదిహేను రోజుల నుంచి ఊపందుకున్నాయి. రైతుల వద్దకు వైజాగ్‌, విజయవాడు, కాకినాడ, భీమవరం, నంద్యాల, అత్మకూరు, కలిదిండి, ఏలూరు, కడప తదితర ప్రాంతాల నుంచి వ్యాపారులు వచ్చి నల్ల చెరకును కొనుగోలు చేస్తున్నారు. ఎకరా చెరకు పంటను రూ.4 లక్షల వరకు కొనుగోలు చేస్తున్నారు. ఎకరా చెరకు తోటలో 25వేల నుంచి 30వేల వరకు గెడల దిగుబడి వస్తున్నాయి. వ్యాపారులు గెడలను కొట్టించుకొని లారీలలో తరలిస్తున్నారు. రుచిగా, తీపిగా చెరకు గెడలు బహిరంగ మార్కెట్‌లో ఒకటి రూ.40కి వ్యాపారులు విక్రయిస్తున్నారు. ఎన్నో ఏళ్ల నుంచి నల్ల చెరకు సాగుకు బల్లికురవ మండలం ప్రసిద్ధి చెందడంతో వ్యాపారులు కూడా సీజన్‌ వస్తే నేరుగా వస్తున్నారని రైతులు తెలిపారు.

చెరకు సాగుకు పెట్టుబడులు ఇలా

ఎకరంలో నల్ల చెరకు సాగు చేయాలంటే రైతులు ముందుగా ఎకరాకు విత్తనపు చెరకు ముక్కలు 12 వందలు నాటుతారు. ఒక గెడ రూ.10 వెచ్చించి తెస్తారు. పెట్టుబడులు పోయి గెడలు కొట్టుడుకు వచ్చే సమాయానికి రూ.2లక్షల వరకు రైతులకు ఖర్చులు అవుతాయి. ఎకరం చెరకు సాగుకు కౌలు కూడా రూ.40వేల వరకు పలుకుతుంది. రైతులు ఎకరా రూ.4లక్షలకు వ్యాపారులకు అమ్మకాలు చేస్తున్నారు. ఏడాది కాలంలో చెరకు సాగు పూర్తి అయి అమ్మకాలు పూర్తి అవుతాయి. రిటైల్‌గా అయితే రైతులు తోటల వద్ద ఒక గెడ రూ.30కి అమ్మకాలు చేస్తున్నారు. అదే వ్యాపారులు అయితే ఒక గెడ రూ.40కి అమ్మకాలు చేస్తున్నారు.

రెండు గ్రామాల్లో అధికం

బల్లికురవ మండలంలోని కూకట్లపల్లి, గొర్రెపాడు గ్రామాలలోనే గత రెండు దశాబ్దాల నుంచి రైతులు నల్ల చెరకు సాగు చేస్తున్నారు. నష్టాలు వచ్చిన లాభాలు వచ్చినా రైతులు చెరకును పండిస్తుంటారు. మెదట్లో వ్యాపారులు వచ్చి కొనుగోలు చేయని సమయంలో రైతులే నేరుగా తిరునాళ్లకు తీసుకెళ్లి అమ్మేవారు. అయితే మంచి రుచి, నాణ్యమైన చెరకు దిగుబడి అవుతుండడంతో వ్యాపారులే నేరుగా వచ్చి కొంటున్నారని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ రెండు గ్రామాలలో సాగును చూసిన పక్కపక్క గ్రామాల్లో కూడా అడపాదడపా సాగు చేస్తున్నారు.

ఈ ఏడాది లాభాలు పంచింది

తాను ఒకటిన్నర ఎకరంలో నల్ల చెరకును సాగు చేశాను. ఎకరా కౌలు రూ.40వేలు చెల్లించి సాగు చేశాను. రూ.2 లక్షల వరకు పెట్టుబడులు పెట్టాను. రూ.4లక్షలకు ఎకరం చెరకు అమ్మాను. ఎకరాకు రెండు లక్షల ఆదా యం వచ్చింది. ఇతర ప్రాంతాల నుంచి వ్యాపారులు వచి కొనుగోలు చేస్తున్నారు.

- పులి దావీదు, రైతు కూకట్లపల్లి

ఎకరానికి కౌలు రూ.40వేలు చెల్లిస్తున్నాం

నల్ల చెరకు సాగు చేసే భూములకు ఎకరాకు రూ.40వేలు కౌలు చెల్లిస్తున్నాం. ఎకరాకు 12 వందల నుంచి 2వేల చెరకు మొక్కలను నాటతాం. ఏడాది సమయంలో చెరుకు సాగు, అమ్మకాలు పూర్తి అవుతాయి. గత ఏడాది కంటే ఈ ఏడాది అమ్మకాలకు డిమాండ్‌ ఉంది.

- బొంతు సౌల్‌, ఎస్సీ రైతు, కూకట్లపల్లి

ఐదు ఎకరాల చెరకును కొనుగోలు చేశాను

తానే కూకట్లపల్లి గ్రామంలో రైతుల వద్ద ఐదు ఎకరాల నల్ల చెరకును కొనుగోలు చేశాను. ఎకరాకు రూ.4లక్షలు చెల్లించాను. తానే చెరకు గెడలను కొట్టించి రిటైల్‌గా అమ్మకాలు చేస్తాం. ఒక గెడ రూ.40 వంతున అమ్మకాలు చేస్తాం, ఎన్నో ఏళ్ల నుంచి చెరకును కొనుగోలు చేస్తున్నాను.

- కె.మురళి, చెరకు వ్యాపారి, విశాఖపట్నం

Updated Date - Feb 13 , 2025 | 11:47 PM