మద్యం ప్రియులపై బెల్టు బాదుడు
ABN , Publish Date - Jan 18 , 2025 | 12:12 AM
: మండలంలో మద్యం పరవళ్లు తొక్కుతోంది. గ్రామగ్రామాన బెల్టుదుకాణాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి.

కొనకనమిట్ల, జనవరి 17 (ఆంధ్రజ్యోతి) : మండలంలో మద్యం పరవళ్లు తొక్కుతోంది. గ్రామగ్రామాన బెల్టుదుకాణాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. ఎక్సైజ్ అధికారుల కనుసన్నలోనే మద్యం దుకాణదారులు బెల్టుషాపులను నిర్వహిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తు తున్నాయి.
గ్రామాల్లో మద్యం అమ్మకాలు మూడు బ్రాందీలు, ఆరు విస్కీలుగా అన్న చందంగా జోరుగా సాగుతున్నాయి. దీంతో గ్రామాలలో అశాంతి అలజడులు నెలకొంటున్నాయి. బెల్టుషాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సాక్షత్తు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హెచ్చరిస్తున్నప్పటికీ స్థానిక అధికారులు బేఖాతరు చేస్తున్నారు. మందుబాబులు మద్యంతో తూగుతుంటే అధికారులు లంచాల మత్తులో జోగుతున్నారు.
మండలంలో పెద్ద గ్రామాలైన కొనకనమిట్ల, పెదారికట్ల, గొట్లగట్టు గ్రామాల్లో లైసెన్స్‌డ్ మద్యం దుకాణాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే మద్యం దుకాణదారులు సిండికేట్‌గా ఏర్పడ్డారు. అన్ని గ్రామా ల్లో యథేచ్ఛగా బెల్ట్‌షాపులను ఏర్పాటు చేశారు. మండలంలో మొత్తం 45 వరకు బెల్ట్‌షాపులు ఉన్నట్లు సమాచారం. బెల్టు దుకాణాలకు అక్రమంగా ఆటోలలో మద్యం తరలిస్తున్నారు. బెల్టు దుకాణాలకు వేసే మద్యంసీసాలపై ప్రత్యేకంగా ఎస్‌పీ అని ముద్ర వేసి విక్రయించడం గమనార్హం. అయితే అధికారులు ముద్ర వేయవద్దని లైసెన్స్ దారులకు చెప్పారు. దీంతో ఇటీవల ముద్రలేకుండా మద్యాన్ని బెల్టు దుకాణాలకు సప్లయ్ చేస్తున్నారు. ఇలా బెల్ట్‌షాపులకు వచ్చి మద్యానికి క్వార్టర్‌కు రూ.20 అదనంగా బెల్టుదుకాణదారుల వద్ద ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. ఇక డిమాండ్‌ను బట్టి మరి కొంత అదనంగా బెల్ట్‌దుకాణం దారుడు విక్రయిస్తు న్నాడు. ఇలా వచ్చే అక్రమార్జనలో తిలపాపం తాపిడికెడు అన్నచందంగా స్థానిక అధికారులకు ముట్టచెప్తున్నారు. దీంతో గ్రామాల వైపు అధికారులు కన్నెత్తి చూసిన దాఖలాలు లేవు. విచ్చలవిడిగా మద్యం దొరుకుతుండడంతో రాత్రిబవళ్ళు మందుబాబులు గ్రామాల్లో తాగితూలుతూ అలజడులను సృష్టిస్తున్నారు. అధికారులు బెల్టు దుకాణాలను కట్డడి చేయకపోతే శాంతిభద్రతలకు విఘాతం కలిగే ప్రమాదం ఉంది.
సమాచారం ఇస్తే దాడి చేయిస్తారు!
ఇటీవల ఒక గ్రామంలో బెల్టుషాపుకు ఆటోలో మద్యం చేస్తున్నారు. దీన్ని ఓ వ్యక్తి విడియో చిత్రీకరించి అధికారులకు అందించారు. దీంతో అతనిపై బెల్టుదుకాణదారుడు దౌర్జన్యానికి పాల్పడ్డారు. అధికా రులే ఉద్దేశ్యపూర్వకంగా దాడి చేయించినట్లు పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయం పోలీసుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ వారు కూడా నిమ్మకునిరెత్తినట్లు వ్యహరించారు. దీంతో బెల్టుదుకాణదారుల ఆగడాలు మితిమీరి పోయాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి గ్రామాలలో బెల్టుషాపులు తొలగించాలని ప్రజలు కోరుతున్నారు.