Share News

బాబు భరోసా

ABN , Publish Date - Mar 09 , 2025 | 01:21 AM

మార్కాపురంలో ఐదున్నర గంటలపాటు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్వహించిన కార్యక్రమం ఆద్యంతం ఉల్లాసంగా.. ఉత్సాహంగా సాగింది. మహిళా సదస్సులో తాను నవ్వుతూ.. మహిళలను నవ్విస్తూ ఉత్తేజంగా మాట్లాడటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇటు మహిళా సదస్సులోనూ, అటు పార్టీ కార్యకర్తల సమావేశంలోనూ వెలిగొండను తానే పూర్తిచేస్తానని పునరుద్ఘాటించారు.

బాబు భరోసా
మార్కాపురంలో ఏర్పాటు చేసిన మహిళా దినోత్సవ సదస్సులో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు

వెలిగొండను పూర్తిచేస్తాం.. గోదావరి జలాలూ ఇస్తాం

మార్కాపురంను జిల్లా చేస్తున్నా

ఉపన్యాసం కన్నా మహిళలకు శిక్షణకే ప్రాధాన్యమిచ్చిన చంద్రబాబు

నవ్వుతూ నవ్విస్తూ మాట్లాడిన సీఎం

కేడర్‌లో భరోసా కల్పించేలా ప్రసంగం

పనితీరు మెరుగుపడాలంటూ ఎమ్మెల్యే కందులకు చురకలు

మార్కాపురంలో ఐదున్నర గంటలపాటు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్వహించిన కార్యక్రమం ఆద్యంతం ఉల్లాసంగా.. ఉత్సాహంగా సాగింది. మహిళా సదస్సులో తాను నవ్వుతూ.. మహిళలను నవ్విస్తూ ఉత్తేజంగా మాట్లాడటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇటు మహిళా సదస్సులోనూ, అటు పార్టీ కార్యకర్తల సమావేశంలోనూ వెలిగొండను తానే పూర్తిచేస్తానని పునరుద్ఘాటించారు. ఆ ప్రాజెక్టు నిర్మాణ వ్యవహారానికి సంబంధించిన అనేక అంశాలను ప్రస్తావించారు. మార్కాపురం జిల్లాను చేస్తున్నానని నిర్దిష్టంగా ప్రకటించారు. కార్యకర్తలకు భరోసా కల్పిస్తూ వారికి కొన్ని సూచనలు చేశారు. ఎమ్మెల్యే పనితీరును కూడా ప్రధానంగా ప్రస్తావించారు. మొత్తంగా నారాయణరెడ్డి పనితీరు మెరుగుపడాలని చురకవేశారు. అవసరమైనప్పుడు అందరి చిట్టా విప్పుతానని హెచ్చరించారు.

ఆంధ్రజ్యోతి, ఒంగోలు

ప్రజా సమస్యలు, పశ్చిమప్రాంత అభివృద్ధిపై నిర్ధిష్టమై న హామీలు ఇవ్వడంతోపాటు కేడర్‌కు భరోసా కల్పిస్తూ.. మహిళలకు ఊకదంపుడు ఉపన్యాసం ఇవ్వకుండా పారి శ్రామిక ఎదుగుదల దిశగా వారిలో ఉత్తేజం నింపుతూ కార్యక్ర మం నిర్వహించ డంలో సీఎం చంద్రబాబు సఫలీకృతుల య్యారు. శనివారం మార్కాపురం వచ్చిన ఆయన అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో పాల్గొనటమే గాక టీడీపీ కేడర్‌తో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. డ్వాక్రా, మెప్మా మహిళలకు ఉపాధి అవకాశాలు పెంపొందించే అంశాలపై అనేక సంస్థలతో ప్రభుత్వపరంగా ఒప్పందాలు చేసుకున్నారు.

వెలిగొండకు గోదావరి జలాలు కూడా..

మహిళా సదస్సులో ఒక మహిళా రైతు సాగునీటి సమస్యను ప్రస్తావిస్తూ వెలిగొండ ప్రాజెక్టును పూర్తిచేయాలని సీఎంను కోరారు. వెంటనే చంద్రబాబు.. పూర్తికాలేదా! నీళ్లు రావడం లేదా!? మరి మొన్న ఆయన (జగన్‌) ప్రాజెక్టును జాతికి అంకితం చేశానని ప్రకటించారు కదా! అంటూ వెలిగొండ ప్రాజెక్టు విషయంలో వైసీపీ ప్రభుత్వం ఆడిన డ్రామాను మహిళలతోనే చెప్పించే ప్రయత్నం చేశారు. అనంతరం ఆయన వెలిగొండను తాను పూర్తిచేయటమే గాక నీటి సమస్య ఎదురుకాకుండా గోదావరి జలాలను కూడా ఈ ప్రాజెక్టుకు మళ్లిస్తానని వివరించారు. పోలవరం నుంచి బనకచర్ల రిజర్వాయరుకు నీటి మళ్లింపు కార్యక్రమం చేపడుతున్నందున అక్కడి నుంచి గోదావరి నీటిని కూడా తరలించి వెలిగొండ ప్రాజెక్టు ద్వారా మీ జిల్లాకు అందిస్తామన్నారు. అందుకు అవసరమైన భూసేకరణ పూర్తిచేస్తానని, పెండింగ్‌లో ఉన్ననష్టపరిహారం చెల్లించడంతో పాటు పనులన్నీ పూర్తిచేసి సంతృప్తిగా జలాలను విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత కార్యకర్తల సమావేశంలోనూ ఈ విషయంపై మరోసారి స్పష్టతనిచ్చారు.

మార్కాపురం కేంద్రంగా జిల్లా చేస్తా

మహిళా సదస్సులో ఒక విద్యార్థిని మాట్లాడుతూ మార్కాపురం జిల్లా విషయాన్ని ప్రస్తావించారు. అనంతరం పార్టీ కార్యకర్తల సమావేశంలో కేడర్‌ అడగకుండానే సీఎం చంద్రబాబు జిల్లా విషయాన్ని ప్రస్తావించారు. ‘మార్కాపురం కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేస్తా. అందులో ఎలాంటి భేషజాలు లేవు. ఎన్నికల సమయంలోనే నేను హామీ ఇచ్చా. తప్పకుండా చేస్తా. తద్వారా అన్నిరంగాలలో ఈ కొత్త జిల్లాకు రావాల్సిన సౌకర్యాలన్నీ కల్పిస్తా’ అని స్పష్టంగా వెల్లడించారు.

సదస్సులో నవ్వుతూ.. నవ్విస్తూ

తొలుత రెండు గంటలపాటు మహిళా సదస్సులో పాల్గొన్న చంద్రబాబు ఊకదంపుడు ఉపన్యాసాలకు పోకుండా వారికి భరోసా కల్పించే విధంగా సదస్సును నిర్వహించారు. ఒకవైపు యాంకర్‌, మరోవైపు మహిళలు అడిగిన ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానాలిచ్చారు. మధ్యమధ్యలో చలోక్తులతో మహిళలను నవ్వించారు. డ్వాక్రా, మెప్మా మహిళలకు మరింత రుణసౌకర్యం కల్పించి వారు తయారుచేసే వస్తువులకు మార్కెటింగ్‌ సౌకర్యం కల్పించే సంస్థలతో ఒప్పందాలు చేసుకోవడమే కాకుండా వాటి ప్రతినిధుల ద్వారా ఆయా అంశాలపై మహిళలకు సమాచారాన్ని ఇప్పించారు. తొలుత రమారమి గంటసేపు స్టాల్స్‌ను సందర్శించి ఆయా కంపెనీలతో ఒప్పందాలు చేసుకునే కార్యక్రమాలు నిర్వహించిన ఆయన ఆ వెంటనే రెండుగంటల పాటు సదస్సులో పాల్గొన్నారు. మహిళలు కొన్ని ప్రశ్నలు సూటిగా వేసినా.. జీతాలు పెంచాలంటూ వెలుగు ఉద్యోగినులు, ఆరోగ్యశాఖ ఉద్యోగులు అర్జీలు ఇచ్చినా వినమ్రతతో సమాధానం చెప్పడం విశేషం..


పదవుల విషయంలో కేడర్‌కు స్పష్టత

పార్టీ కార్యకర్తల సమావేశంలో గంటసేపు పాల్గొన్న చంద్రబాబు.. కేడర్‌కు పూర్తిస్థాయిలో భరోసా కల్పించారు. పార్టీ నిర్మాణ వ్యవహారాల్లో చేస్తున్న మార్పులను వివరిస్తూ టీడీపీ కోసం పనిచేసిన వారికే నామినేటెడ్‌ పోస్టులు అన్న సంకేతాలు ఇచ్చేశారు. ఎమ్మెల్యేలు చెప్పారని కార్యకర్తలను పక్కనపెట్టే ప్రశ్నే లేదని సూటిగా స్పష్టం చేశారు. రానున్న మూడు నెలల్లో వాట్సాప్‌ యాప్‌ ద్వారా కేడర్‌తో అప్పటికప్పుడు ముచ్చటిస్తానని చెప్పడంతో కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. పార్టీ, నామినేటెడ్‌ పదవుల భర్తీ విషయంలో కార్యకర్తలకు అన్యాయం జరగదన్న స్పష్టత ఇవ్వగలిగారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతోపాటు పదవులు పొందినవారు ఎవరైనా పనిలో విఫలమైతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.

కందుల పనితీరు మెరుగుపడాలి

కార్యకర్తల సమావేశంలో మార్కా పురం ఎమ్మెల్యే కందులనారాయణరెడ్డి పనితీరు మెరుగుపడాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. కొన్ని అంశాలలో బాగోలేదు, కొన్ని అంశాలలో బాగుంది అంటూ తదనుగుణ వివరాలను కార్యకర్తలకు వెల్లడించారు. ఒక్క నారాయణరెడ్డి గురించే కాదు.. అందరు ఎమ్మె ల్యేల గురించి చెబుతున్నానంటూ కొన్ని అంశాలను ఆయన ప్రస్తావించారు. చివర్లో మార్కాపురం విషయా నికొస్తే అంటూ ‘గత ఎన్నికల్లో 7.2శాతం మెజారిటీతో గెలిచాం. కానీ ఇక్కడ శాశ్వతంగా గెలవాలంటే మెజారిటీ 15శాతానికి పెరగాలి. అందుకు తగ్గట్లు అటు ఎమ్మెల్యే, ఇటు కార్యకర్తలు కలిసి పనిచేయాలి. కానీ తన వద్ద ఉన్న సమాచారాన్ని బట్టి చూస్తే పనితీరు అందుకు తగ్గట్లు లేదు’ అని వ్యాఖ్యానించారు. పార్టీ సభ్యత్వంలో నియోజకవర్గం 104వ స్థానంలో ఉందన్నారు. ప్రభుత్వం వివిధ రకాలుగా పేదలకు సేవాకార్యక్రమాలు చేస్తుంటే మూడింటిలో మాత్రమే ఎమ్మెల్యే పాల్గొన్నారని తెలిపారు. దీంతో కందుల జోక్యం చేసుకుని కాలి ఆపరేషన్‌ కారణంగా ఇబ్బంది వచ్చిందని చెప్పగా, వెరీ హ్యాపీ.. ఆపరేషన్‌ సక్సెస్‌ అయింది, ఇక వేగంగా పనిచేయండన్నారు. ఎమ్మెల్యేగా ఎన్నో ర్యాంకులో ఉన్నారో చెప్పనని, పనితీరు మాత్రం మెరుగుపర్చుకోవాలని సూచించారు.

సతీమణి కోసం రూ.25వేల చీర కొనుగోలు

స్టాల్స్‌ సందర్శన సందర్భంగా రూ.25వేల ఖరీదైన చీరను తన సతీమణి కోసం చంద్రబాబు కొనుగోలు చేశారు. స్టాల్స్‌ను సందర్శించే క్రమంలో మొబైల్‌ చేనేత వస్త్రాల విక్రయా లను ఆయన పరిశీలించారు. ఆ సందర్భంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోని చేనేత సొసైటీల నుంచి 36 రకాల వస్త్రాలను తెచ్చి మొబైల్‌ వాహ నంతో అన్ని ప్రాంతాల్లో వ్యాపారం చేస్తున్నట్లు అందులోని మహిళలు వివ రించారు. చీరలు, పంచెలు, ఇతర పలు వస్త్రాలను చూపించగా చీరను ఆయన ఆసక్తిగా చూశారు. పక్కన ఉన్న మహిళా అధికారులను వీటిలో ఏ చీర బాగుం టుందో చూడమని కోరిన చంద్రబాబు.. వారు సూచిం చిన చీరను తీసుకున్నారు. ఖరీదు ఎంత అని నిర్వాహ కులను సీఎం అడగ్గా రూ.26,140 అని చెప్పడంతో రూ.25వేలు ఇవ్వాలని తన సిబ్బందికి సూచించడం తోపాటు వ్యాపారం బాగా చేస్తున్నారని మొబైల్‌ వాహనంలోని మహిళలను నవ్వుతూ అభినందిం చారు. స్టాల్స్‌ సందర్శన సందర్భంగా ఒక చోట గుర్రపు డెక్కతో తయారు చేసిన పలు వస్తువులను చూసిన సీఎం అక్కడ టోపీ పెట్టుకొని ఉత్సాహపడ్డారు

Updated Date - Mar 09 , 2025 | 01:22 AM