Share News

బాబోయ్‌.. దోమలు

ABN , Publish Date - Jan 25 , 2025 | 02:18 AM

పట్టణాల్లో దోమలు దడపుట్టిస్తున్నాయి. పగలు, రాత్రి తేడా లేకుండా కుట్టేస్తున్నాయి. దీంతో జనం వ్యాధుల భయంతో వణికిపోతున్నారు. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా జలుబు, జ్వరాలతో జనం అల్లాడుతున్నారు. పారిశుధ్యం అధ్వానంతో దోమల వ్యాప్తికి అనుకూలమైన వాతావరణం ఏర్పడింది.

బాబోయ్‌.. దోమలు
ఒంగోలు నుంచి అగ్రహారం వెళ్లే దారిలో రైల్వే గేటు వద్ద పేరుకుపోయిన మురుగు

పట్టణాల్లో ప్రజలపై దండయాత్ర

వ్యాధుల భయంలో ప్రజానీకం

నియంత్రణ చర్యల గురించి పట్టించుకోని యంత్రాంగం

పూర్తిస్థాయిలో చిత్తశుద్ధి కరువు

నిధుల పరిస్థితి అంతంతమాత్రమే

పట్టణాల్లో దోమలు దడపుట్టిస్తున్నాయి. పగలు, రాత్రి తేడా లేకుండా కుట్టేస్తున్నాయి. దీంతో జనం వ్యాధుల భయంతో వణికిపోతున్నారు. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా జలుబు, జ్వరాలతో జనం అల్లాడుతున్నారు. పారిశుధ్యం అధ్వానంతో దోమల వ్యాప్తికి అనుకూలమైన వాతావరణం ఏర్పడింది. అధికారులు వార్డులు, డివిజన్లలో పర్యటించి నీటి నిల్వలు.. ఇళ్ల మధ్య మురుగు, చెత్తాచెదారం లేకుండా చూడాల్సి ఉంది. అయితే పట్టణ ప్రాంతాల్లో పారిశుధ్యం మెరుగునకు ప్రత్యేక చర్యలు మృగ్యమయ్యాయి. ఫాగింగ్‌, ఆయిల్‌బాల్స్‌ వంటి నియంత్రణ పనులు చేపట్టడం లేదు. అన్నిచోట్లా పాలకవర్గాలు ఉన్నా దోమల నివారణపై మాట్లాడే వారు కరువయ్యారు. ఒకపక్క దోమల నిర్మూలనకు, పారిశుధ్యం మెరుగునకు ఉపక్రమించాలని ప్రభుత్వం ఆదేశించినా ఆ స్థాయిలో మునిసిపాలిటీలలో కదలిక కరువైంది.

ఒంగోలు, కార్పొరేషన్‌, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): బోబోయ్‌ దోమలు.. ఇదీ ప్రస్తుతం జిల్లాలోని పట్టణాల్లో జనం ఆందోళన. పారిశుధ్యం అధ్వానంతో అందరికీ నిద్రలేకుండా చేస్తున్నాయి. అలాగే వ్యాధుల భయం వెంటాడుతోంది. దోమకాటు నుంచి తప్పించుకొనేందుకు ప్రజలు లక్షలు ఖర్చు చేస్తున్నారు. ఒంగోలు నగరంలో లక్షకుపైగా గృహాల్లో 3లక్షలపైనే జనాభా ఉన్నారు. ఇకపోతే ఫుట్‌పాత్‌లపై జీవించేవారు, ఇతర ప్రాంతాల నుంచి రోజువారీ పనుల కోసం నగరానికి వచ్చేవారు వేలల్లోనే ఉంటారు. ఇంతవరకు బాగానే ఉన్నా వారి రోజువారీ ఖర్చులతోపాటు కచ్చితంగా దోమల నియంత్ర ణకు రోజుకు సగటున రూ.20 నుంచి రూ.30 వరకూ ఖర్చు చేస్తున్నారు. మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి, చీమకుర్తి పట్టణాల్లో 1.43లక్షల మంది వరకు నివసి స్తున్నారు. ఇటీవల పగలు, రేయి తేడా లేకుండా దోమలు దాడి చేస్తున్నాయి. వాటి నియంత్రణ టార్టాయిస్‌, జెట్‌, స్లీప్‌వెల్‌, గుడ్‌నైట్‌, మస్కిటో బ్యాట్‌లు ఇలా రకరకాలు ఆయుధాలను ఉపయోగిస్తున్నారు. దీంతో ఒక్కో ఇంటికి తెలియకుండానే నెలకు రూ.500 నుంచి రూ.800ల వరకు ఖర్చు చేస్తున్నారనడంలో సందేహం లేదు. ప్రజారోగ్యం మెరుగు కోసం మునిసిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు లక్షలు ఖర్చుచేస్తున్నామని చెబుతున్నా నగరవాసులకు ఎటువంటి ప్రయోజనం కలగడం లేదు.

పట్టణాలు కంపుకొడుతున్నాయ్‌!

పట్టణాల్లో ప్రతిరోజూ పారిశుధ్య పనులు నిర్వహించడంతోపాటు వ్యాధులు అఽధికంగా వ్యాప్తి చెందే ప్రాంతాలను గుర్తించిపరిశుభ్రతపై జనానికి అవగాహన కల్పించాలి. కాలువల్లో మురుగు తొలగించాలి. తడి చెత్త నిల్వ లేకుండా చూడాలి. ఖాళీ ప్రదేశాలలో, కాలువల్లో మురుగునీటిపై ఉండే దోమలను లార్వా దశలోనే అంతం చేసేందుకు తగు చర్యలు తీసుకోవాల్సి ఉంది. అలాగే నీరు నిల్వ ఉండే ప్రాంతాల్లో గంభూషియా చేపలను వదలాలి. దోమలను నియంత్రించేందుకు అబెట్‌, పైరిత్రిమ్‌, మలాథియన్‌తో స్ర్పే, మలాథియన్‌ ద్రావణంతో ఫాగింగ్‌ చేయాలి. వాటితోపాటు ప్రతి వీధిలోనూ చెత్తను తొలగించిన అనంతరం బ్లీచింగ్‌ చల్లి పరిశుభ్రమైన వాతావరణం కనిపించేలా చూడాలి. కానీ ఇలాంటి పరిస్థితి జిల్లాలోని ఏ పట్టణంలోనూ కనిపించడం లేదు. మురుగునీటి కుంటలలో గంభూషియా చేపలు, ఆయిల్‌ బాల్స్‌ వదలడం, డీడీటీ స్ర్పేయింగ్‌ చేయడం మచ్చుకైనా కనిపించకపోవడం విమర్శలకు తావిస్తోంది.


ముందస్తు చర్యలేవి?

ఖాళీ ప్రదేశాల్లో ఎక్కువగా మురికినీరు నిల్వ ఉండటంతో దోమలు వ్యాప్తి చెందుతున్నాయి. కొన్ని ప్రభుత్వ, ప్రైవేటు స్థలాల్లో పారిశుధ్యం లోపించింది. ఆ స్థలాల్లోని మురికినీరు గురించి పట్టించుకుంటే కొంతవరకు సమస్యను అధిగమించవచ్చు. గతంలో ప్రైవేటు స్థలాల యజమానులకు నోటీసులు జారీచేయడం, ఎంతకీ స్పందించకపోతే జరిమానా విధించడం వంటివి చేపట్టేవారు. అయితే ప్రస్తుతం వాటి గురించి పట్టించుకోకపోవడంతోయజమానులు సైతం వాటిపై నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఫాగింగ్‌ ద్వారా దోమలు అదుపునకు కృషిచేస్తున్నామని అధికారుల చెబుతున్నా దోమలు మాత్రం అదుపులోకి రావడం లేదంటూ ప్రజలు పెదవి విరుస్తున్నారు.ప్రజారోగ్య విభాగం పనితీరు రోడ్డు మీద సున్నం లాగానే ఉందని వాఖ్యానిస్తున్నారు. దోమలు వ్యాప్తి చెందకుండా శాశ్వత పరిష్కారంచూపాలని పట్టణవాసులు కోరుతున్నారు.

Updated Date - Jan 25 , 2025 | 02:18 AM