Share News

ఉన్నాయో.. లేవో!

ABN , Publish Date - Feb 06 , 2025 | 02:03 AM

ఎట్టకేలకు యంత్రాంగంలో కదలిక మొదలైంది. జిల్లాలో వైసీపీ ప్రభుత్వ కాలంలో రైతులకు ఇచ్చిన యంత్ర పరికరాల స్థితిగతులపై వ్యవసాయ శాఖ దృష్టి సారించింది. వాటిపై పరిశీలన ప్రారంభించింది.

ఉన్నాయో.. లేవో!
గిద్దలూరులో వ్యవసాయ ఉపకరణాలను పరిశీలిస్తున్న అధికారులు

సాగు యంత్ర పరికరాల పరిస్థితేమిటి.?

తనిఖీలు చేపట్టిన వ్యవసాయశాఖ

సబ్‌ డివిజన్‌ అఽధికారులను మార్చి పరిశీలన

వైసీపీ ప్రభుత్వంలో ఇచ్చిన వాటిపై ఆరోపణలతో కదిలిన అధికారులు

ఎట్టకేలకు యంత్రాంగంలో కదలిక మొదలైంది. జిల్లాలో వైసీపీ ప్రభుత్వ కాలంలో రైతులకు ఇచ్చిన యంత్ర పరికరాల స్థితిగతులపై వ్యవసాయ శాఖ దృష్టి సారించింది. వాటిపై పరిశీలన ప్రారంభించింది. అప్పట్లో ఇచ్చిన ట్రాక్టర్లు, ఇతర వ్యవసాయ పరికరాలు ప్రస్తుతం అవే గ్రూపుల వద్ద ఉన్నాయా.. మార్పులు, చేర్పులు జరిగాయా? వారి వద్ద ఉన్నా పనిచేస్తున్నాయా? అనే అంశంపై సర్వే చేస్తోంది. వారంరోజుల నుంచి జిల్లావ్యాప్తంగా ఈ ప్రక్రియ కొనసాగుతోంది. స్థానిక అధికారులు కాకుండా పక్క సబ్‌ డివిజన్‌ల నుంచి ఏడీ స్థాయి అధికారులు తనిఖీలు చేస్తున్నారు.

ఒంగోలు, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వ కాలంలో పెద్దఎత్తున రైతులకు వ్యవసాయ యంత్ర పరికరాలను అందజేశారు. ఒక్కో రైతును ఒక యూనిట్‌గా తీసుకొని ఉమ్మడి జిల్లాలో దాదాపు 1,200 మందికి రూ.20కోట్ల విలువైన ట్రాక్టర్లను రైతురథం పేరుతో ఇచ్చారు. అలాగే మరో 29వేల మంది రైతులకు రూ.100 కోట్ల విలువైన ఇతర పరికరాలను అందజేశారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ తరహా పరికరాల ఊసే ఎత్తలేదు. రైతుల నుంచి విమర్శలు రావడంతో రెండేళ్ల తర్వాత 2021-22, 2022-23 సంవత్సరాలలో సుమారు రూ.59 కోట్ల విలువైన పరికరాలు ఇచ్చారు. అయితే టీడీపీ కాలంలో వలే వ్యక్తిగతంగా కాకుండా ఐదారుగురు రైతులను ఒక గ్రూపుగా ఏర్పాటు చేశారు. గ్రూపును ఒక యూనిట్‌గా తీసుకొని కొన్నింటికి ట్రాక్టర్లు, మరికొన్ని గ్రూపులకు సేద్యం, పంటకోతలు, నూర్పిడిలకు ఉపకరించే పలు రకాల యంత్ర పరికరాలను అందజేశారు. కొన్ని గ్రూపులకు ట్రాక్టర్లతోపాటు పరికరాలను కలిపి ఇచ్చారు. జిల్లాలో 616 రైతు భరోసా కేంద్రాలు(ఆర్బీ కేలు) ఉండగా 611 ఆర్బీకేల పరిధిలోని రైతులకు గత వైసీపీ ప్రభుత్వలో వ్యవసాయ పరికరాలను ఇచ్చారు. అధికార వర్గాల సమాచారం ప్రకారం జిల్లాలో మొత్తం 611 గ్రూపులకు రూ.59.53 కోట్ల విలువైన 5,098 పరికరాలు అందజేశారు. అందులో ట్రాక్టర్లు కేవలం 365 మాత్రమే కాగా మిగతావాటిలో నాగళ్లు, విత్తనాలు, ఎరువులు ఎదబెట్టే గొర్రులు, స్ర్పేయర్లు వంటివి ఉన్నాయి. మొత్తం విలువలో ప్రభుత్వ సబ్సిడీ రూ.20.77 కోట్లు (40శాతం) మాత్రమే కాగా మిగిలిన 50శాతం బ్యాంకు రుణాలుగా, మిగిలిన పదిశాతం లబ్ధిదారుని వాటాగా ఉంది. ఒక్కో ఆర్‌బీకే పరిధిలో ఒక్కో గ్రూపునకు ఇవ్వడంతో జిల్లాలో దాదాపు అన్ని గ్రామాల్లో ఇవి ఉన్నాయి.

వైసీపీ నేతలదే పెత్తనం

నిబంధనల ప్రకారం గ్రూపు సభ్యులందరికీ వ్యవసాయ యంత్ర పరికరాలను వినియోగిం చుకునే హక్కు ఉంది. అలాగే అద్దెలకు కూడా ఇవ్వాలి. వాటిని ఆర్బీకేల వద్ద ఉంచాలి. కానీ.. అలా నిబంధనల ప్రకారం జరగలేదు. గ్రూపుల పేరుతో వైసీపీ నేతలు వాటిని తీసుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వీటిపై చర్చ జరిగింది. జిల్లాలో అవకతవకలు చోటుచేసుకున్నాయని, వాటిని పరిశీలించాలని మంత్రి డాక్టర్‌ డీఎస్‌బీవీ స్వామి వ్యవసాయశాఖ అధికారులను ఆదేశించారు. పలువురు ఎమ్మెల్యేలు కూడా వివిధ సమావేశాల్లో ఈ అంశాన్ని ప్రస్తావిం చారు. దీంతో జిల్లావ్యాప్తంగా ఆ పరికరాల స్థితిగతులపై వ్యవసాయశాఖ దృష్టి సారించింది. జిల్లా వ్యవసాయశాఖ అధికారి సీహెచ్‌ శ్రీనివాసరావు అందుకోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.


మార్కాపురం సబ్‌డివిజన్‌లో అధికం

స్థానిక అధికారులతో కాకుండా ఒక సబ్‌ డివిజన్‌ అధికారిని మరొక సబ్‌ డివిజన్‌లో పరిశీలనకు నియమించారు. అంటే ఒంగోలు సబ్‌ డివిజనల్‌ అధికారిగా ఉండే వ్యవసాయశాఖ ఏడీ సింగరాయకొండ సబ్‌ డివిజన్‌ పరిధిలో, అక్కడి ఏడీ మరో సబ్‌ డివిజన్‌లో ఈ పరిశీలన చేస్తారు. మార్కాపురం సబ్‌ డివిజన్‌లో ఆరోపణలు అధికంగా ఉండటంతో డిప్యూటీ డైరెక్టర్‌ సుబ్రమణేశ్వరరావును నియమించారు. ఇటీవల కంభం ప్రాంతంలో స్వయంగా డీఏవో శ్రీనివాసరావు పరిశీలించారు. ప్రధానంగా గతంలో ఇచ్చిన వ్యవసాయ యంత్ర పరికరాలు వినియోగంలో ఉన్నాయా లేక పనికిరాకుండా పోయాయా? ఎవ్వరైనా అమ్ముకున్నారా? అన్న అంశాలను పరిశీలిస్తున్నారు. దీనిపై డీఏవో శ్రీనివాసరావు మాట్లాడుతూ.. మరో వారం రోజుల్లో ఈ సర్వే పూర్తవుతుందన్నారు. ఎక్కడైనా అవకతవకలు జరిగినట్లు తేలితే చర్యలు తీసుకుంటామన్నారు.

Updated Date - Feb 06 , 2025 | 02:03 AM