Share News

పరిశ్రమల దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి

ABN , Publish Date - Feb 13 , 2025 | 11:52 PM

జిల్లాలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తల నుంచి సింగిల్‌ విండో ద్వారా అందిన దరఖాస్తులను నిర్దేశించిన సమయంలోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా ఆదేశించారు.

పరిశ్రమల దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ అన్సారియా

ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కమిటీ సమావేశంలో కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా

ఒంగోలు కలెక్టరేట్‌, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తల నుంచి సింగిల్‌ విండో ద్వారా అందిన దరఖాస్తులను నిర్దేశించిన సమయంలోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లోని కలెక్టర్‌ సమావేశపు హాలులో గురువారం జిల్లా పారిశ్రామిక ప్రోత్సాహక కమిటీ సమావేశానికి కలెక్టర్‌ అధ్యక్షత వహించి మాట్లాడారు. సీఎం చంద్రబాబు ఆశయాలకు అనుగుణంగా జిల్లాను పారిశ్రామికంగా రాష్ట్రంలో ముందుండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పరిశ్రమల స్థాపన ద్వారా యువతకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయని, ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పారు. సింగిల్‌ విండో పథకంలో భాగంగా జిల్లాలో 2024 డిసెంబరు నుంచి ఫిబ్రవరి వరకు పరిశ్రమల ఏర్పాటుకు 437 రాగా అందులో 421 దరఖాస్తులను ఆమోదించామన్నారు. 2024- 2025 ఆర్థిక సంవత్సరానికి పీఎంఈజీపీ లక్ష్యాల మేరకు మంజూరు, గ్రౌండింగ్‌కు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఆదేశించారు. ఈ పథకం కింద 577 దరఖాస్తులు రాగా 367 దరఖాస్తులను సంబంధింత బ్యాంకులకు పంపగా రూ.871.01 లక్షల మార్జిన్‌ మనీతో 263 దరఖాస్తులు బ్యాంకులు మంజూరు చేశాయని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను త్వరగా గ్రౌండింగ్‌ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఎల్‌డీఎంను కలెక్టర్‌ ఆదేశించారు. పీఎం విశ్వకర్మ యోజన ప్రోగ్రాం కింద జిల్లాలో 16,193 దరఖాస్తులు రాగా స్టేజ్‌-1లో 14,430 దరఖాస్తులను పరిష్కరించగా, స్టేజ్‌-2లో 9 పెండింగ్‌లో ఉన్నాయని కలెక్టర్‌ తెలిపారు. పరిశ్రమల ప్రోత్సాహలకు సంబంధించి 199 రాగా 193 దరఖాస్తులను సిఫార్సు చేస్తూ రూ.7,17,093 లక్షలను అందించాలని సమావేశంలో ఆమోదించారు. సమావేశంలో పరిశ్రమల కేంద్రం జిల్లా మేనేజర్‌ శ్రీనివాసరావు, ఏపీఎ్‌సఎ్‌ఫసీ బ్రాంచ్‌ మేనేజర్‌ కే నరసింహారెడ్డి, ఏపీఐఐసీ జోనల్‌ మేనేజర్‌ మదన్‌మోహన్‌, ఫ్యాక్టరీస్‌ అధికారి రాఘవరెడ్డి, విద్యుత్‌ శాఖ డీఈ కే కృష్ణకాంత్‌, ఎల్‌డీఎం రమేష్‌, వివిధ శాఖల అధికారులు గొట్టిపాటి వెంకటనాయుడు, జే రవికుమార్‌, ఎస్‌. శ్రీనివాసులు, దివాకర్‌, శ్రీనివాసులురెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Feb 13 , 2025 | 11:52 PM