Share News

ఏఎంసీల రిజర్వేషన్లు కొలిక్కి..

ABN , Publish Date - Jan 21 , 2025 | 01:49 AM

వ్యవసాయ మార్కెట్‌ కమిటీ (ఏఎంసీ)ల పాలక మండళ్ల రిజర్వేషన్ల వ్యవహారం ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. ఈ విషయంలో అధికార టీడీపీ ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జిల అభ్యంతరాలపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సీరియస్‌గా స్పందించడంతో అడుగు ముందుకు పడింది.

ఏఎంసీల రిజర్వేషన్లు కొలిక్కి..
ఒంగోలులోని వ్యవసాయ మార్కెట్‌ కమిటీ కార్యాలయం

సీఎం హెచ్చరికతో సైలెంట్‌ అయిన ఎమ్మెల్యేలు

వారితో మంత్రులు ఆనం, డోలా చర్చలు

అటు మంత్రి గొట్టిపాటి, ఎమ్మెల్యే ఏలూరి జోక్యం

వ్యవసాయ మార్కెట్‌ కమిటీ (ఏఎంసీ)ల పాలక మండళ్ల రిజర్వేషన్ల వ్యవహారం ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. ఈ విషయంలో అధికార టీడీపీ ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జిల అభ్యంతరాలపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సీరియస్‌గా స్పందించడంతో అడుగు ముందుకు పడింది. ఆయా జిల్లాల వారీ ఉన్న ఏఎంసీ చైర్మన్ల పదవుల్లో సగం ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు.. అందులోనూ మహిళలకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. సంబంధిత ఎమ్మెల్యేలు, కూటమి పార్టీల ఇన్‌చార్జిలతో మాట్లాడి రిజర్వేషన్లు ఖరారు చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. ఆ మేరకు రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేసినట్లు సమాచారం.

(ఆంధ్రజ్యోతి, ఒంగోలు)

ఏఎంసీల రిజర్వేషన్ల ప్రక్రియ కొలిక్కివచ్చింది. అందుకు సంబంధించిన కసరత్తు పూర్తయ్యింది. వాటిని త్వరలో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. తొలుత అత్యధిక జిల్లాల కలెక్టర్ల ప్రతిపాదనలను ఎమ్మెల్యేలు వ్యతిరేకించారు. ఎక్కువ మంది తమ పరిధిలోని ఏఎంసీ చైర్మన్‌ పదవులను జనరల్‌ కేటగిరీలో ఉంచాలని పట్టుబట్టారు. దీంతో పరిస్థితిని చక్కదిద్దే బాధ్యతలను ఇన్‌చార్జి మంత్రులకు టీడీపీ అధిష్ఠానం అప్పగించింది. తదనుగుణంగా జిల్లాకు సంబంధించి ఇన్‌చార్జి మంత్రి ఆనం రామనారాయణరెడ్డి రంగంలోకి దిగారు. అయినప్పటికీ కొత్త జిల్లాతోపాటు ఉమ్మడి ప్రకాశంలో కూడా రిజర్వేషన్లపై స్పష్టత రాలేదు. అనేక మంది ఎమ్మెల్యేలు తమ ఏఎంసీని జనరల్‌ కేటగిరీలో ఉంచాలని పట్టుబట్టడంతో తిరిగి సమస్య ముఖ్యమంత్రి వద్దకు వెళ్లింది. అలా సీఎం దృష్టికి వెళ్లిన జిల్లాల్లో ఉమ్మడి ప్రకాశం కూడా ఉంది.

జనాభా ప్రాతిపదికనే..

మొత్తం పరిస్థితిని సమీక్షించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటు ఇన్‌చార్జి మంత్రులు, అటు కలెక్ట ర్లకు రిజర్వేషన్ల విధానాలను తూచా తప్పకుండా అమలు చేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఇన్‌చార్జి మంత్రులతో ఆయన ప్రత్యేకంగా టెలీకాన్ఫారెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘పల్నాడు జిల్లాలో ఇన్‌చార్జి మంత్రి రవికుమార్‌ ఎమ్మెల్యేలను తన ఇంటికి పిలిపించుకొని అందర్నీ సమావేశపర్చి ఏకాభిప్రాయంతో పదవుల రిజర్వేషన్లు పూర్తిచేశారు. అదే పద్ధతిలో మీరూ చేయాలి’ అని ఆదేశించారు. అప్పటికీ వినకపోతే తానే జోక్యం చేసుకొని ఆయా ఏఎంసీల పరిధిలో ఉన్న జనాభా ప్రాతిపదికన ఖరారు చేస్తానని స్పష్ట చేశారు. ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఇటు ప్రకాశం ఇన్‌చార్జి మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, జిల్లాకు చెందిన మంత్రి స్వామి.. అటు బాపట్ల జిల్లా ఇన్‌చార్జి మంత్రి పార్థసారథి, ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రి రవికుమార్‌కు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు తెలిసింది. దీంతో ఇన్‌చార్జి మంత్రులు గత ఐదు రోజుల నుంచి టీడీపీ ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జులతో సీఎం ఆదేశాలు చెప్పి అనేక ఏఎంసీల రిజర్వేషన్లపై ఒక అభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది.


మీరే అర్థం చేసుకోకపోతే ఎలా..?

దర్శి, కనిగిరి ఏఎంసీలను ఎస్సీలకు రిజర్వు చేశారు. కనిగిరి ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డి నియోజకవర్గ పరిస్ధితిని వివరించగా మీరు కూడా పరిస్ధితి అర్థం చేసుకోకపోతే ఎలా అని మంత్రులు ఆనం, స్వామిలు ఒత్తిడి చేసినట్లు తెలిసింది. కందుకూరు పదవిని బీసీలకే రిజర్వు చేయాలని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు సూచించినట్లు ప్రచారంలో ఉంది. అందుకు అనుగుణంగా ఆర్థికంగా బలవంతుడైన ఒక బీసీ నాయకుడికి చైర్మన్‌ పదవిపై హామీ కూడా ఇచ్చినట్లు నియోజకవర్గంలో ప్రచారం జరుగుతోంది. అద్దంకి నియోజకవర్గంలో రెండు ఏఎంసీలు ఉండగా మంత్రి రవికుమార్‌ సూచనలు పరిగణనలోకి తీసుకొని అద్దంకిని ఎస్సీకి, సంతమాగులూరు (మార్టూరు) ఏఎంసీని జనరల్‌ కేటగిరీకి రిజర్వు చేసినట్లు సమాచారం. పర్చూరు ఏఎంసీని జనరల్‌ కేటగిరీలో ఉంచాలని భావిస్తున్నప్పటికీ జిల్లా మొత్తంపై రిజర్వేషన్ల వ్యవహారం కొలిక్కి వచ్చిన తర్వాత ఖరారు కావచ్చని తెలిసింది. దాన్ని జనరల్‌ మహిళకు కేటాయిస్తున్నట్లు సమాచారం. చీరాల నియోజకవర్గం విషయంలో ఎమ్మెల్యే కొండయ్య బీసీ అయినందున వేరే వర్గంకు రిజర్వు చేయాలని కలెక్టర్‌ ప్రతిపాదించినట్లు తెలిసింది. చివరకు బీసీ మహిళకు కేటాయించనున్నట్లు సమాచారం. రానున్న మూడు, నాలుగురోజుల్లో ఈ రిజర్వేషన్లపై అధికారికంగా తుది నిర్ణయం తీసుకొని ప్రకటించే అవకాశం ఉంది.

Updated Date - Jan 21 , 2025 | 01:49 AM