బీసీ కార్పొరేషన్ రుణాలకు 8 నుంచి దరఖాస్తుల స్వీకరణ
ABN , Publish Date - Jan 04 , 2025 | 12:59 AM
బీసీ కార్పొరేషన్ మళ్లీ కళకళలాడుతోంది. ఐదేళ్ల తర్వాత లబ్ధిదారులకు రుణాలు మంజూరు చేసేందుకు టీడీపీ ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. తొలుత బ్యాంకు లింకేజితో సబ్సిడీ రుణాలను వివిధ యూనిట్లు ఏర్పాటు చేసుకునేందుకు కార్పొరేషన్ అధికారులు చర్యలు చేపట్టారు.

మొత్తం 52 రకాల స్వయం ఉపాధి యూనిట్ల స్థాపనకు అవకాశం
ఐదేళ్ల తర్వాత మంజూరు కానున్న రుణాలు
ఒంగోలు నగరం, జనవరి 3(ఆంధ్రజ్యోతి): బీసీ కార్పొరేషన్ మళ్లీ కళకళలాడుతోంది. ఐదేళ్ల తర్వాత లబ్ధిదారులకు రుణాలు మంజూరు చేసేందుకు టీడీపీ ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. తొలుత బ్యాంకు లింకేజితో సబ్సిడీ రుణాలను వివిధ యూనిట్లు ఏర్పాటు చేసుకునేందుకు కార్పొరేషన్ అధికారులు చర్యలు చేపట్టారు. సబ్సిడీ రుణాల కోసం జిల్లాలోని బీసీలు ఈ నెల 8వ తేదీ నుంచే దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. మొత్తం 52 రకాల స్వయం ఉపాధి యూనిట్లను స్థాపించుకునేందుకు ఈ నెల 8వ తేదీ నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు. వీటితో పాటు రూ.8 లక్షల యూనిట్ విలువతో జనరిక్ మందుల దుకాణాలను ఏర్పాటు చేసుకునేందుకు కూడా అవకాశం కల్పించారు. 16వ తేదీ వరకు ఓబీఎంఎంఎస్ పోర్టల్ ద్వారా రుణాలు మంజూరు చేసేందుకు దరఖాస్తులను స్వీకరిస్తారు. గత ఐదేళ్లుగా రూపాయి కూడా వైసీపీ ప్రభుత్వం బీసీలకు రుణాలను మంజూరు చేయలేదు. పైగా గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మంజూరు చేసిన రుణాలను లబ్ధిదారుల మెడపై కత్తి పెట్టి మరీ వసూలు చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తిరిగి కార్పొరేషన్లకు పూర్వవైభవం రానుంది. జిల్లాలోని 1195 మందికి వివిధ రకాలైన స్వయం ఉపాధి యూనిట్లు, 24 మంది బీ ఫార్మసీ చేసిన నిరుద్యోగులకు జనరిక్ మందులు దుకాణాలను ఏర్పాటు చేసుకునేందుకు రుణాలు అందజేయనున్నారు. రుణాలను విడుదల చేసి ఫిబ్రవరిలో యూనిట్లను ఏర్పాటు చేసుకునే విధంగా అధికారులు కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు. గొర్రెల పెంపకం, మినీ డెయిరీ, మోడ్రన్ పవర్ లాండ్రీ, ఆటో, టాటా ఏస్, వెదురు బుట్టల తయారీ, సెల్ ఫోన్ రిపేర్ వంటి 52 రకాల స్వయం ఉపాధి యూనిట్ల ఏర్పాటుకు రుణాలను మంజూరు చేయనున్నారు.