మూడేళ్లుగా వదిలేశారు!
ABN , Publish Date - Jan 12 , 2025 | 12:55 AM
గత వైసీపీ పాలనలో పేదలకు వైద్యసేవల పేరుతో కోట్ల రూపాయల నిధులు వృథా చేశారు. అయితే ఆసుపత్రుల్లో మాత్రం కనీస సౌకర్యాలు కల్పించకపోవడంతో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. గొప్పలకుపోయి ఆస్పత్రులలో అనేక నిర్మాణాలు చేపట్టారు.

నిరుపయోగంగా ఫెసిలిటీ పోర్టబుల్ కొవిడ్ కేర్ యూనిట్
రూ.3.5 కోట్లతో ఒంగోలు జీజీహెచ్‌లో అప్పట్లో ఏర్పాటు
హెచ్‌ఎంపీవీ భయంతో ఇప్పుడు హడావుడిగా బోర్డులు
వినియోగంలోకి తెస్తే రోగులకు మరింత ప్రయోజనం
ఒంగోలు కార్పొరేషన్, జనవరి11 (ఆంధ్రజ్యోతి) : గత వైసీపీ పాలనలో పేదలకు వైద్యసేవల పేరుతో కోట్ల రూపాయల నిధులు వృథా చేశారు. అయితే ఆసుపత్రుల్లో మాత్రం కనీస సౌకర్యాలు కల్పించకపోవడంతో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. గొప్పలకుపోయి ఆస్పత్రులలో అనేక నిర్మాణాలు చేపట్టారు. తర్వాత వాటిని నిరుపయోగంగా వదిలేశారు. ఇందుకు ఎఫ్‌పీసీ కేర్ యూనిట్ ఉదాహరణ. నాడు కొవిడ్ తీవ్రంగా ఉండి ఆసుపత్రిలో పడకలు సరిపోకపోవడంతో అదనంగా ఏర్పాటు చేయాలని భావించారు. అమెరికన్, ఇండియన్ ఫౌండేషన్, యూఎస్‌ఏ మాస్టర్ కార్డ్ సౌజన్యంతో ఒంగోలు జీజీహెచ్‌లో కొవిడ్ సమయంలో రూ. 3.5 కోట్లతో 100 పడకల ఫెసిలిటీ పోర్టబుల్ కొవిడ్ కేర్ యూనిట్‌ను ఏర్పాటు చేశారు. అందులో అవసరమైన ఏసీలు, ఆక్సిజన్, ఇతర సౌకర్యాలు కల్పించారు. 2022 ఫిబ్రవరి 3న దాన్ని ప్రారంభించారు. అప్పట్లో తొలుత 65మంది మాత్రమే వాటిలో వైద్యం పొందగా మూడేళ్లుగా కొవిడ్ కేర్ యూనిట్ తలుపులు తెరుచుకోలేదు. దీంతో నిరుపయోగంగా మారింది.
హెచ్‌ఎంపీవీతో హడావుడిగా..
మూడేళ్లుగా పట్టించుకోకుండా వదిలేసిన జీజీహెచ్ అధికారులు హెచ్‌ఎంపీవీ ప్రభావంతో హడావుడిగా రెండు రూములు తెరిచి ఐసోలేషన్ బోర్డును పెట్టేశారు. కొవిడ్ కేర్ యూనిట్ చుట్టూ పిచ్చిమొక్కలు మొలిచి, అడవిని తలపించడమే కాకుండా పారిశుధ్యం పట్టించుకున్న వారే కరువయ్యారు. ఇప్పటికైనా అధికారులు వాటిని వినియోగంలోకి తీసుకొచ్చి స్పెషల్ రూంలుగా కేటాయిస్తే మరింత బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.