సముద్రంలో గల్లంతైన యువకుడు మృతి
ABN , Publish Date - Jan 17 , 2025 | 11:30 PM
పాకల సముద్ర తీరంలో స్నేహితులతో కలిసి సరదాగా మునుగుతుండగా అలల ఉధృతికి గల్లంతైన సింగరాయకొండ శ్రీరాం నగర్‌కు చెందిన తమ్మిశెట్టి పవన్ (22) మృతిచెందాడు. యువకుడి మృతదేహం పాకల పరిధిలోని చెల్లమ్మగారి పట్టపుపాలెం తీరంలో శుక్రవారం లభ్యమైంది.

పాకల చెల్లమ్మగారి పట్టపుపాలెం తీరంలో మృతదేహం లభ్యం
సింగరాయకొండ, జనవరి 17 (ఆంధ్రజ్యోతి) : పాకల సముద్ర తీరంలో స్నేహితులతో కలిసి సరదాగా మునుగుతుండగా అలల ఉధృతికి గల్లంతైన సింగరాయకొండ శ్రీరాం నగర్‌కు చెందిన తమ్మిశెట్టి పవన్ (22) మృతిచెందాడు. యువకుడి మృతదేహం పాకల పరిధిలోని చెల్లమ్మగారి పట్టపుపాలెం తీరంలో శుక్రవారం లభ్యమైంది. మెరైన్, పోలీస్ సిబ్బంది మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చారు. తొలుత పవన్ ఆచూకీ కోసం గురువారం సాయంత్రం నుంచి రాత్రి 10 గంటల వరకు తహసీల్దార్ రవి ఆధ్వర్యంలో పోలీసులు, మెరైన్ సిబ్బంది, మత్స్యకారులు తీరంలో గాలింపు చర్యలు చేపట్టారు. రాత్రి సమయంలో కూడా మెరైన్ పోలీసులు మృతదేహం ఎప్పుడు ఎక్కడ బయటకోస్తుందోనని తీరం వెంబడి తిరుగుతూనే ఉన్నారు. ఆయన పవన్ ఆచూకీ లభ్యం కాలేదు. శుక్రవారం ఉదయం నుంచి బోట్లలో ముమ్మరంగా గాలింపు చర్యలను ప్రారంభించారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో చెలమ్మగారి పట్టపుపాలెం తీరంలో అలలపై తేలాడుతున్న పవన్ మృతదేహాన్ని గుర్తించి ఒడ్డుకు చేర్చారు. గల్లంతైన పవన్ కోసం నిన్న మధ్యాహ్నం నుంచి తీరంలో రోదిస్తున్న వారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఒక్కసారిగా మృతదేహాన్ని చూసి గుండెలవిసేలా విలపించారు. చేతికి అందొచ్చిన చెట్టంత కొడకును అకాల మృత్యువు రాకాసి అలల రూపంలో తీసుకెళ్లిందంటూ.. కన్నీటి పర్యంతమయ్యారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం పోలీసులు కందుకూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. తహసీల్దార్ రవి ఆధ్వర్యంలో నిర్వహించిన గాలింపు చర్యలలో సీఐ చావా హజరత్తయ్య, సింగరాయకొండ ఎస్సై బి. మహేంద్ర, జరుగుమల్లి ఎస్సై బత్తుల మహేంద్ర, మెరైన్ ఎస్సై మస్తాన్ షరీఫ్, ఆర్‌ఐ వి.ప్రసాద్, సర్పంచ్ సైకం చంద్రశేఖర్ పాల్గొన్నారు.