అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
ABN , Publish Date - Jan 31 , 2025 | 11:09 PM
అనుమానాస్పదస్థితిలో వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలోని సంగాపురం సమీపంలోని రోడ్డుపక్కన శుక్రవారం జరిగింది.

దొనకొండ, జనవరి 31(ఆంధ్రజ్యోతి): అనుమానాస్పదస్థితిలో వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలోని సంగాపురం సమీపంలోని రోడ్డుపక్కన శుక్రవారం జరిగింది. అందిన వివరాల మేరకు... మండలంలోని కలివెలపల్లికి చెందిన శ్రీరాం చిన్నవెంకటయ్య(52) తన టీవీఎస్ ఎక్స్‌ఎల్ వాహనంపై దొనకొండ నుంచి కలివెలపల్లికి వెళ్తూ సంగాపురం సమీపంలో తన ద్విచక్రవాహనంతో సహ రోడ్డు పక్కన రక్తపుమడుగులో పడి ఉన్నాడు. అటువైపు వెళ్లేవారు గుర్తించి సమాచారం అందించటంతో భార్య, బంధువులు హుటాహుటిన సంఘటన ప్రదేశానికి చేరుకున్నారు. అపస్మారకస్థితిలో ఉన్న చిన్నవెంకటయ్యను ఆటోలో దొనకొండ వైద్యశాలకు తరలించగా వైద్యులు పరీక్షించి అప్పటికే మృతిచెందినట్లు తెలిపారు. మృతుడికి కుడివైపు గొంతు కింద బలమైన గాయం ఉండటంతో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సమాచారం మేరకు హెడ్ కానిస్టేబుల్ రంగనాయకులు, కానిస్టేబుల్ చెన్నకేశవులు మృతదేహాన్ని పరిశీలించారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని దర్శి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.