Share News

వందేళ్ల గురువుకు ఘన సత్కారం

ABN , Publish Date - Feb 17 , 2025 | 12:07 AM

చీమకుర్తి పట్టణం కంచుకోటబజార్‌లో నివాసం ఉంటున్న రిటైర్డ్‌ ప్రభుత్వ ఉపాధ్యాయుడు వేమూరి రాఘవయ్య పంతులు వందేళ్లు పూర్తి చేసుకోగా.. ఈ ఏడాది జూన్‌లో 101వ జన్మదినోత్సవం జరుపుకోనున్నారు.

వందేళ్ల గురువుకు ఘన సత్కారం
రాఘవయ్యపంతులును సత్కరిస్తున్న శిష్యులు

శత వసంతంలోకి అడుగిడిన రాఘవయ్యపంతులు

జబ్బులను దరిచేరనీయకుండా ఆరోగ్యవంతమైన జీవనం

చీమకుర్తి, ఫిబ్రవరి16(ఆంధ్రజ్యోతి) : రోగాలతో సహజీవనం చేస్తున్న నేటి ఆధునిక యుగంలో మనుష్యులు వందేళ్లు జీవించటం అంటే గగనంగా మారింది. అంతకుమించి శతాధిక వయస్సులో జబ్బులను దరిచేరనీయకుండా తన పనులు తాను చేసుకుంటూ ఆరోగ్యకరమైన జీవనం సాగించటం అంటే నమ్మశక్యం కాని విషయం అనిపిస్తుంది.

చీమకుర్తి పట్టణం కంచుకోటబజార్‌లో నివాసం ఉంటున్న రిటైర్డ్‌ ప్రభుత్వ ఉపాధ్యాయుడు వేమూరి రాఘవయ్య పంతులు వందేళ్లు పూర్తి చేసుకోగా.. ఈ ఏడాది జూన్‌లో 101వ జన్మదినోత్సవం జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా ఆదివారం రాఘవయ్యపంతులు ఇంట వందేళ్ల వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువర్యుల పాదాలకు నమస్కరించిన శిష్యులు ఆయన ఆశీర్వచనం తీసుకున్నారు. వందేళ్ల వయసులోనూ తమ గురువు ఆరోగ్యంగా, చలాకీగా ఉండటాన్ని గొప్పగా చెప్పుకుంటూ ఉప్పొంగిపోయారు. తమ గురువుకు జరిపిన సత్కారాన్ని సోషల్‌మీడియాలో పోస్టుచేసి ఆయన ఔన్యత్యాన్ని, గొప్పతనాన్ని, జీవనశైలిని కొనియాడుకున్నారు. గురువుతో తాము గడిపిన గతస్మృతులను నెమరువేసుకున్నారు. రాఘవయ్యపంతులుకు సతీవియోగం జరిగింది. ఇద్దరు కుమారులు కాగా వారూ తమ ఉద్యోగాల్లో రిటైర్‌ కావటం విశేషం. తండ్రి కోసం కొన్ని నెలలు పెద్దకొడుకు కుటుంబం, కొన్ని నెలలు చిన్నకొడుకు కుటుంబం చీమకుర్తికి విచ్చేసి తండ్రితో ఉంటారు. రాఘవయ్య మాత్రం ఎవరున్నా లేకపోయినా తన పనులు తాను మాత్రం చేసుకుంటూ దైవధ్యానంలో నిమగ్నమై ప్రశాంతకరమైన జీవనాన్ని సాగిస్తుంటారు. కాగా రాఘవయ్యను ఘనంగా సత్కరించిన వారిలో కుటుంబసభ్యులు, శిష్యులు పరాంకుశం శ్రీనివాసమూర్తి, అవనిగడ్డ శేషారావు, పోకూరి సుబ్బారావు, కోదాటి శివనాగేశ్వరరావు, మద్ది జగన్‌మోహనరావు, ముద్దనూరు సుబ్బారావు, బొమ్మిశెట్టి శ్రీనివాసరావు, షేక్‌ ఖాదరవలి పాల్గొన్నారు.

Updated Date - Feb 17 , 2025 | 12:07 AM