కంభం చెరువులో 8 అడుగుల నీరు
ABN , Publish Date - Jan 08 , 2025 | 11:27 PM
ఆసియా ఖండంలోనే రెండో అతిపెద్ద చెరువుగా పేరుగాంచిన కంభం చెరువులో ప్రస్తుతం 8 అడుగులమేర నీరు మాత్రమే ఉన్నది. 5వేల హెక్టార్ల విస్తీర్ణంలో 21 అడుగుల లోతు గల కంభం చెరువుకు నీరు చేరాలంటే నల్లమల అడవుల్లో భారీ వర్షాలు కురిస్తే గుండ్లకమ్మ, జంపలేరు వాగుల ద్వారా నీరు చేరుతుంది. 2021లో కురిసిన భారీ వర్షాలకు కంభం చెరువుకు 18 అడుగులమేర నీరు చేరింది. 2023, 2024లో చెదురుమదురు వర్షాలతో చెరువుకు కొద్దిమేర మాత్రమే నీరు చేరింది. మొత్తం 36 అడుగుల లోతు కలిగిన కంభం చెరువులో ప్రస్తుతం 16 అడుగుల మేర పూడిక ఏర్పడింది.
కంభం, జనవరి 8 (ఆంధ్రజ్యోతి): ఆసియా ఖండంలోనే రెండో అతిపెద్ద చెరువుగా పేరుగాంచిన కంభం చెరువులో ప్రస్తుతం 8 అడుగులమేర నీరు మాత్రమే ఉన్నది. 5వేల హెక్టార్ల విస్తీర్ణంలో 21 అడుగుల లోతు గల కంభం చెరువుకు నీరు చేరాలంటే నల్లమల అడవుల్లో భారీ వర్షాలు కురిస్తే గుండ్లకమ్మ, జంపలేరు వాగుల ద్వారా నీరు చేరుతుంది. 2021లో కురిసిన భారీ వర్షాలకు కంభం చెరువుకు 18 అడుగులమేర నీరు చేరింది. 2023, 2024లో చెదురుమదురు వర్షాలతో చెరువుకు కొద్దిమేర మాత్రమే నీరు చేరింది. మొత్తం 36 అడుగుల లోతు కలిగిన కంభం చెరువులో ప్రస్తుతం 16 అడుగుల మేర పూడిక ఏర్పడింది. అదిపోను 21 అడుగుల పైన నీరు వస్తే చెరువు అలుగు పారుతుంది. ప్రస్తుతం ఉన్న 8 అడుగుల నీటిని తూముల నుంచి బయటకు వదలకుండా అలాగే ఉంచుతున్నట్లు ఇరిగేషన్ ఏఈ శ్రీనివాసనాయక్ తెలిపారు. చెరువులో నిల్వ ఉన్న నీటి వలన కంభం, బేస్తవారపేట, అర్థవీడు మండలాల్లో భూగర్భజలాలు పెరిగి బోర్లలో నీరు ఉంటుందన్నారు. చెరువులో 10 అడుగులపైన నీరు ఉంటేనే సాగునీటికి వదులుతామని తెలిపారు. ప్రస్తుతం రైతులు శనగపంటను వేసినందున నీటి అవసరం లేదని తెలిపారు.
వందేళ్లలో
నిండింది 11 సార్లే
కంభం చెరువు గత వందేళ్లలో నిండింది కేవలం 11 సార్లేనని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. 1917, 1948, 1949, 1950, 1956, 1963, 1966, 1975, 1983, 1996, 2022 సంవత్సరాలలో చెరువు నిండి అలుగు పారింది. 2009, 2021 సంవత్సరాలలో కురిసిన భారీ వర్షాలకు చెరువుకు 18 అడుగుల మేర మాత్రమే నీరు చేరింది. మొత్తం 20 అడుగుల లోతు కలిగిన చెరువుకు మరో 2 అడుగులమేర నీరు చేరి ఉంటే 13 సార్లు నిండి ఉండేది. చెరువు కింద 10వేల ఎకరాలు అధికారికంగా, 7వేల ఎకరాలు అనధికారికంగా సాగు చేస్తున్నారు.