వినతులలో 6వ స్థానం
ABN , Publish Date - Feb 13 , 2025 | 02:08 AM
ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోరుతూ అధికార యంత్రాంగానికి వినతులు అందించడంలో జిల్లా రాష్ట్రంలో ఆరో స్థానంలో ఉంది. అలాగే సీఎం కార్యాలయానికి కూడా ఆయా జిల్లాల నుంచి అందుతున్న వినతుల్లోనూ అదేస్థానంలో నిలిచింది. ఆ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలో మంగళవారం అమరావతిలోని సచివాలయంలో నిర్వహించిన ప్రభుత్వ శాఖల కార్యదర్శుల సమావేశంలో ప్రకటించారు.

జిల్లాలో అందినవి 36,282.. సీఎంకు చేరినవి 764
కార్యదర్శుల భేటీలో ప్రకటించిన ప్రభుత్వం
నమ్మకం ఉన్నచోట అధికంగా వస్తాయన్న చంద్రబాబు
ఒంగోలు, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి) : ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోరుతూ అధికార యంత్రాంగానికి వినతులు అందించడంలో జిల్లా రాష్ట్రంలో ఆరో స్థానంలో ఉంది. అలాగే సీఎం కార్యాలయానికి కూడా ఆయా జిల్లాల నుంచి అందుతున్న వినతుల్లోనూ అదేస్థానంలో నిలిచింది. ఆ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలో మంగళవారం అమరావతిలోని సచివాలయంలో నిర్వహించిన ప్రభుత్వ శాఖల కార్యదర్శుల సమావేశంలో ప్రకటించారు. ప్రజా విజ్ఞప్తుల రిడ్రసెల్ సిస్టమ్ (పీజీఆర్‌ఎస్)పై ప్రత్యేక సమీక్ష జరిగింది. అత్యధికంగా వినతులు శ్రీకాకుళం నుంచి రాగా పల్నాడు జిల్లా నుంచి తక్కువగా ఉన్నాయి. అయితే ప్రభుత్వంపైనా, జిల్లాల్లో పనిచేసే యంత్రాంగంపైనా తమ సమస్యలు పరిష్కరిస్తారని ప్రజల్లో ఎక్కడ విశ్వాసం ఎక్కువగా ఉంటుందో అక్కడ అధికంగా వినతులు వస్తుంటాయని ఆ సమావేశంలో సీఎం చెప్పారు. వినతుల పరిష్కారానికి మరింత వేగంగా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక వారంవారం మన జిల్లాలో వివిధ స్థాయిల్లో నిర్వహించే గ్రీవెన్స్‌ల్లోనూ, అలాగే రెవెన్యూ సదస్సుల్లో మొత్తం 36,282 అర్జీలు అధికారులకు అందాయి. వాటిలో భూసంబంధ అంశాలే అధికంగా ఉన్నట్లు సమాచారం. అలాగే జిల్లా నుంచి ముఖ్యమంత్రి కార్యాలయానికి 764 వినతులు అందాయి. అందులోనూ జిల్లా ఆరవ స్థానంలోనే ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా జిల్లాలో వివిధ స్థాయిల్లో అందిన మొత్తం 36,284 వినతులలో ఒక కుటుంబం నుంచి ఒక అర్జీ మాత్రమే అందినవి 23,314 ఉన్నాయి. 4,108 కుటుంబాల నుంచి రెండు లేదా మూడు, 346 కుటుంబాల నుంచి నాలుగు లేదా ఐదు... 140 కుటుంబాల నుంచి 6 నుంచి 10 అర్జీలు అందినట్లు సమాచారం.