అత్యవసర పనులకు రూ.26.14 కోట్లు
ABN , Publish Date - Jan 30 , 2025 | 01:59 AM
వచ్చే ఏడాది సాగునీటి సరఫరాపై కూటమి ప్రభుత్వం ఇప్పటి నుంచే దృష్టి సారించింది. అధ్వానంగా ఉన్న కాలువలు, ఇతర వనరులకు అత్యంత అవసరంగా చేయాల్సిన పనులపై యంత్రాంగం నుంచి ప్రతిపాదనలు కోరింది. వైసీపీ పాలనలో సాగునీటి వనరుల నిర్వహణ దారుణంగా మారింది. కనీసం కాలువల్లో చిల్లచెట్ల తొలగింపు, పూడికతీత, అక్కడక్కడ దెబ్బతిన్న షట్టర్లు, డ్రాపుల మరమ్మ తులు వంటి చిన్నచిన్న పనులకు కూడా నిధులు ఇవ్వలేదు.

జలవనరులశాఖ అధికారుల ప్రతిపాదన
నీటి సంఘాలకు అప్పగించే అవకాశం
ఒంగోలు, జనవరి 29 (ఆంధ్రజ్యోతి): వచ్చే ఏడాది సాగునీటి సరఫరాపై కూటమి ప్రభుత్వం ఇప్పటి నుంచే దృష్టి సారించింది. అధ్వానంగా ఉన్న కాలువలు, ఇతర వనరులకు అత్యంత అవసరంగా చేయాల్సిన పనులపై యంత్రాంగం నుంచి ప్రతిపాదనలు కోరింది. వైసీపీ పాలనలో సాగునీటి వనరుల నిర్వహణ దారుణంగా మారింది. కనీసం కాలువల్లో చిల్లచెట్ల తొలగింపు, పూడికతీత, అక్కడక్కడ దెబ్బతిన్న షట్టర్లు, డ్రాపుల మరమ్మ తులు వంటి చిన్నచిన్న పనులకు కూడా నిధులు ఇవ్వలేదు. దాని వల్ల పొలాలకు నీరు చేరే క్రమంలో సగం వృథాగా పోయేది. జిల్లాలోని సాగర్ కాలువల్లో ఈ పరిస్థితి స్పష్టంగా కనిపించింది. ఈక్రమంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం తక్షణం చేయాల్సిన పనులపై మూడు మాసాల క్రితమే దృష్టి సారించింది. ప్రస్తుత సీజన్‌లో నీటి సరఫరాకు ఉన్న ఆటంకాలను తొలగించింది. అలా ఉమ్మడి జిల్లాలో రూ.12 కోట్లతో పనులు చేశారు. జిల్లాలో అనేకచోట్ల మేజర్, మైనర్ కాలువలు అధ్వానంగా ఉన్నాయి. ఎన్‌ఎస్‌పీ పరిఽధిలోని ప్రధాన కాలువలతోపాటు మేజర్లు, మైనర్లు చిల్లచెట్లతో నిండిపోవడం, పూడిక పేరుకుపోయి గుర్రపుడెక్క వంటివి పెరిగాయి. దీంతో నీటి సరఫరాకు ఆటంకం ఏర్పడటంతోపాటు షట్టర్లు, డ్రాపులు దెబ్బతిని వృథాగా నీరు పోతోంది. అలాగే మీడియం వనరుల కాలువల్లోనూ ఇలాంటి పరిస్థితే ఉంది. రాష్ట్రవ్యాప్తంగా ఇదే తరహా ఉండటాన్ని గుర్తించిన ప్రభుత్వం ఆ పనులు చేపట్టి వచ్చే ఏడాది (2025-26) పంటలకు నీటి సరఫరా సజావుగా సాగేందుకు చర్యలు తీసుకుంటోంది. ఆ తరహా పనులపై అధికారులను ప్రతిపాదనలను కోరింది. పక్షంరోజులుగా జలవనరులశాఖ అధికారులు ఈ ప్రతిపాదనలపై కసరత్తు చేసి ఒంగోలు సర్కిల్‌తో ఉన్న ఉమ్మడి జిల్లాలో ఎన్‌ఎస్‌పీ అలాగే మీడియం ఇరిగేషన్ పరిధిలో మొత్తం రూ.26.14 కోట్లతో అత్యవసర పనులు చేపట్టాలని ప్రతిపాదించారు.
సాగునీటి సంఘాలకు పనులు!
భారీ నీటివనరుల విభాగంలో ఉండే ఎన్‌ఎస్‌పీ కింద రూ.12.93కోట్లు ప్రతిపాదించగా చీమకుర్తి డివిజన్‌లో రూ.7.68 కోట్లు, అద్దంకి డివిజన్‌లో రూ.3.20 కోట్లు, దర్శి డివిజన్‌లో రూ.2.05 కోట్లు అవసరంగా నివేదించారు. మీడియం ఇరిగేషన్ విభాగంలో రూ.13.21 కోట్లకు ప్రతిపాదించగా అందులో ఒంగోలు డివిజన్ పరిధిలో రూ.8.26 కోట్లు, రాళ్లపాడు ప్రాజెక్టు పరిధిలో రూ.3.95కోట్లు, మార్కాపురం డివిజన్‌కు రూ.కోటి అవసరంగా పేర్కొన్నారు. ఆమేరకు ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపించారు. కాగా ఈ పనులను సాగునీటి సంఘాల ద్వారా చేయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో కూడా టీడీపీ ప్రభుత్వంలో ఈ తరహా పనులను నీటిసంఘాల ద్వారా చేయిచారు. అదేతరహాలో ఈసారి కూడా సంఘాలకే వాటిని ఇవ్వనున్నట్లు సమాచారం. గతంలో రూ.5లక్షల వరకు ఉండే పనిని టెండర్లు లేకుండా నామినేషన్ పద్ధతిపై ఇవ్వగా, ఈసారి ఆ మొత్తాన్ని రూ.10 లక్షలకు పెంచారు. ఇటీవలే సాగునీటి సంఘాల ఎన్నికలు జరిగి కొత్త కమిటీలు రాగా త్వరలో వాటిని ఈ పనులు దక్కనున్నాయి.