AP High Court : ఫలించిన 15 ఏళ్ల న్యాయపోరాటం
ABN , Publish Date - Feb 12 , 2025 | 05:36 AM
ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రకాశం జిల్లాకు చెందిన సురేష్ కుమార్ అనే వ్యక్తి 15 ఏళ్లుగా చేసిన సుదీర్ఘ న్యాయం పోరాటం ఎట్టకేలకు ఫలించింది.

ఎట్టకేలకు సురేష్ కుమార్‌కు ప్రభుత్వ ఉద్యోగం
సీనియారిటీ, ఇతర ప్రయోజనాలు కల్పించండి.. ప్రభుత్వం, ఏపీపీఎస్సీకి హైకోర్టు ఆదేశాలు
అమరావతి, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రకాశం జిల్లాకు చెందిన సురేష్ కుమార్ అనే వ్యక్తి 15 ఏళ్లుగా చేసిన సుదీర్ఘ న్యాయం పోరాటం ఎట్టకేలకు ఫలించింది. ఆయన్ను అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ పోస్టులో నియమించాలని హైకోర్టు తాజాగా రాష్ట్ర ప్రభుత్వం, ఏపీపీఎస్సీకి ఆదేశాలు జారీచేసింది. సురేష్ మిగిలిన అభ్యర్థుల కన్నా మెరిట్ సాధించినప్పటికీ రిజర్వేషన్ అమలు విషయంలో ప్రభుత్వం, పబ్లిక్ సర్వీస్ కమిషన్ తీరుతో అతనికి నష్టం జరిగిందని అభిప్రాయపడింది. 2010 ఏపీ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ ఉత్తర్వులు మేరకు పిటిషనర్‌కు ఉద్యోగం ఇవ్వాలని ఆదేశించింది. జనరల్ కేటగిరీ కింద పోస్టు ఖాళీ లేకుంటే సూపర్ న్యూమరీ పోస్టును సృష్టించాలని స్పష్టం చేసింది. పిటిషనర్‌కు 2007 డిసెంబరులో ఇచ్చిన నోటిఫికేషన్‌కి అనుగుణంగా నియమితులైన వారితో సమానంగా సీనియారిటీ, ఇతర ప్రయోజనాలు కల్పించాలని తెలిపింది. నెల రోజుల్లో కోర్టు ఆదేశాలు అమలు చేయాలని పేర్కొంది. ప్రభుత్వం, ఏపీపీఎస్సీ వైఖరిని తప్పుబడుతూ రూ.లక్ష చొప్పున ఖర్చులు విధించింది. ఈ మేరకు అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ ప్రభుత్వం, ఏపీపీఎస్సీ 2012లో దాఖలు చేసిన పిటిషన్లను కొట్టివేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రవినాథ్ తిల్హరి, జస్టిస్ మండవ కిరణ్మయి ధర్మాసనం ఈ తీర్పు ఇచ్చింది. అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ పోస్టుల భర్తీ కోసం ఏపీపీఎస్సీ 2007 డిసెంబర్‌లో నోటిఫికేషన్ ఇచ్చింది. అందులో 6 ఓసీ జనరల్, 4 ఓసీ మహిళలకు రిజర్వ్ చేసింది. ప్రకాశం జిల్లా కంభం మండలం లక్ష్మీకోట గ్రామానికి చెందిన సురేష్ కుమార్ దరఖాస్తు చేశారు. అయితే పరీక్షలో మెరిట్ సాధించిన తనను పక్కనపెట్టి, మెరిట్ తక్కువ ఉన్న మహిళా అభ్యర్థులతో పోస్టులను భర్తీ చేయడంపై ఆయన 2010లో అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించారు.