AP CM Chandrababu: తుఫాన్ తర్వాత కూడా అప్రమత్తంగా ఉండాలి
ABN , Publish Date - Oct 29 , 2025 | 04:25 AM
మొంథా తుఫాన్ తీరం దాటిన తర్వాత కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.
సమస్య ఉన్న చోట్ల అధికారులు, ప్రజాప్రతినిధులు ఉండాలి: సీఎం
కలెక్టర్లు, ఎస్పీలతో టెలికాన్ఫరెన్స్
అర్ధరాత్రి వరకు సచివాలయంలోనే మకాం
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా హాజరు
మత్స్యకార కుటుంబాలకు 50 కిలోల బియ్యం
అమరావతి, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): ‘మొంథా’ తుఫాన్ తీరం దాటిన తర్వాత కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. సమస్య ఉందనుకున్న ప్రాంతాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు ఉండాలని స్పష్టం చేశారు. క్షేత్ర స్థాయిలో ప్రజాప్రతినిధులు ఉంటే.. ప్రజలకు భరోసా ఇచ్చినట్లవుతుందని చెప్పారు. మంగళవారం అర్ధరాత్రి వరకు ఆయన అమరావతి సచివాలయంలోనే ఉండి విరామం లేకుండా వరుస సమీక్షలు జరిపారు. ఆర్‌టీజీఎస్ నుంచి మూడు సార్లు సమీక్షలు చేసిన ఆయన.. రెండు సార్లు కలెక్టర్లు, అధికారులతో టెలికాన్ఫరెన్స్‌లు జరిపారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా పాల్గొన్నారు. తుఫాన్ కారణంగా ప్రాణ నష్టం లేకుండా, ఆస్తి నష్టం ఎక్కువ జరగకుండా అధికారులు అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలని సీఎం చెప్పారు.
ఆర్‌టీజీఎ్‌సకు వచ్చిన సమాచారాన్ని విశ్లేషించి, రియల్ టైమ్‌లో సమస్యల పరిష్కారానికి.. అంటే గాలికి పడిపోయిన చెట్ల తొలగింపు, సబ్‌స్టేషన్లలో సమస్యలను తక్షణం పరిష్కరించేలా ఆయన చర్యలు చేపట్టారు. వర్ష ప్రభావిత జిల్లాల్లో సహాయ చర్యలపై మంత్రులు, అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ సూచనలు చేశారు. పునరావాస కేంద్రాల్లో పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. జిల్లాలకు వెళ్లిన మంత్రులు, ప్రత్యేక అధికారులతో నిరంతరం చర్చిస్తూ వచ్చారు. ‘తుఫాన్ ప్రభావం వల్ల కరెంట్ కట్ చేయాల్సి రావచ్చు. ముందుగానే ప్రజలకు క్యాండిళ్లను సరఫరా జరిగేలా చూడాలి. పునరావాస శిబిరాల్లో ఉండే వారికి లోటు లేకుండా చూసుకోవాలి. తుఫాన్ ప్రభావం ఉండే ప్రాంతాల్లో పరిస్థితిని అంచనా వేసుకుని, జాతీయ రహదారులపై రాకపోకలను నిలిపివేయాలి. ఆ పరిస్థితి వస్తే ముందుగానే సమాచారాన్ని అందించాలి. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాలి’ అని ఆదేశించారు.
అధికారులు గ్రామాల్లో ఉంటే ప్రజలకు నమ్మకం: సీఎం
తుఫాన్ ప్రభావిత ప్రాంతాలకు ఐదారుగురు అధికారులతో ఓ బృందాన్ని పంపాలని సీఎం ఆదేశించారు. వారు గ్రామాల్లో ఉంటే ప్రజలకు నమ్మకం కలుగుతుందన్నారు. కాలువలు, చెరువులు, రోడ్లకు ఎక్కడైనా కోతలు, గండ్లు పడ్డాయా అనే అంశంపై రాత్రిపూట కూడా పూర్తి స్థాయిలో పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. తుఫాన్ తీరం దాటిన తర్వాత శాఖలవారీగా నష్టం అంచనా నివేదికలను సిద్ధం చేసుకోవాలని, ప్రాథమిక అంచనాలను కేంద్ర ప్రభుత్వానికి వీలైనంత త్వరగా పంపేలా చర్యలు తీసుకోవాలని కోరారు. తుఫాన్ ప్రభావం తగ్గగానే యుద్ధ ప్రాతిపదికన విద్యుత్‌ను పునరుద్ధరించాలని మంత్రి లోకేశ్ సూచించారు. ఏలేశ్వరం రిజర్వాయరు, బుడమేరు తదితర వాగుల్లో ప్రవాహాలపై సీఎం ఆరా తీశారు. వరద నిర్వహణకు ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని సీఎం సూచించారు.
మీరే ప్రభుత్వ ప్రతినిధులు..
తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో గ్రామ/, వార్డు సచివాలయాల సిబ్బందితోనూ ఆర్‌టీజీఎస్ నుంచి సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. గ్రామాల్లో ప్రభుత్వ ప్రతినిధులు గ్రామ/వార్డు సచివాలయాల సిబ్బందే. బాధితులకు తక్షణ సాయం అందేలా చూడాలి. విద్యుత్ సరఫరా నిలిచిపోయిన చోట వెంటనే పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలి’ అని ఆదేశించారు.
గత తుఫాన్ల నష్టాన్ని బేరీజు వేసుకుని చర్యలు
తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను నిరంతరం పర్యవేక్షించాలని చంద్రబాబు మంత్రులు, అధికారులకు స్పష్టంచేశారు. వర్ష ప్రభావంతో ఆకస్మికంగా వాగులు పొంగి ప్రవహించే అవకాశమున్న చోట్ల మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. తుఫాన్ తీరం దాటే అవకాశం ఉన్న కాకినాడ పరిసర ప్రాంతాలకు మరిన్ని సహాయ బృందాలను, ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలను పంపాలని ఆదేశించారు. గాలులు, వర్ష తీవ్రతను అంచనా వేస్తూ, అందుకు తగట్లుగా యంత్ర సామగ్రిని, సమాచార పరికరాలను, అత్యవసర యంత్రాలను, బృందాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. నిర్దేశిత గ్రామ/వార్డు సచివాలయాల నుంచి క్షేత్రస్థాయి సమాచారం తెప్పించుకుని విశ్లేషించుకోవాలన్నారు. గతంలో హుద్‌హుద్ తుఫాన్ సృష్టించిన విధ్వంసం నుంచి ప్రజలను నాలుగు రోజుల్లోనే తిరిగి బయటకు తెచ్చామని సీఎం గుర్తు చేశారు.
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో సోమవారం నుంచి భారీ వర్షాలు నమోదైనందున ఆ ప్రాంతంలోని ఎర్ర కాలువకు ఎగువ నుంచి అకస్మాత్తుగా ప్రవాహాలు వచ్చే అవకాశం ఉందని, లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేయడంతో పాటు అధికార యంత్రాంగం సన్నద్ధంగా ఉండాలని సూచించారు. గతంలో వచ్చిన తుఫాన్లతో జరిగిన నష్టాన్ని బేరీజు వేసుకుని, తగిన చర్యలు తీసుకోవాలన్నారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా ముంపు ప్రాంతాన్ని, చెట్లు, టవర్లు, హోర్డింగ్‌లు పడిపోయిన ప్రాంతాలను గుర్తించి, తక్షణం పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అత్యవసర సమయంలో కమ్యూనికేషన్ కోసం పోలీసు విభాగం 81 టవర్లతో వైర్‌లెస్ సిస్టమ్‌ను ఏర్పాటు చేసిందని, 2,703 జనరేటర్లను కూడా ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు. వర్షప్రభావంతో కోనసీమ, ప్రకాశం, నంద్యాల, కడప, తూర్పుగోదావరి జిల్లాల్లో ఇప్పటి వరకు 43 వేల హెక్టార్ల పంట నీట మునిగిందని వ్యవసాయ అధికారులు తెలిపారు. తుఫాను కారణంగా వేటకు వెళ్లలేకపోయిన మత్స్యకార కుటుంబాలకు 50 కిలోల చొప్పున బియ్యం ఇవ్వాలని సీఎం ఆదేశించారు.
సీఎంకు అశ్వినీ వైష్ణవ్ ఫోన్.. తుఫాన్ పరిస్థితిపై చంద్రబాబుకు కేంద్ర ఐటీ-ఎలకా్ట్రనిక్స్, రైల్వే శాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఫోన్ చేశారు. సహాయ చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆయనకు సీఎం ‘ఎక్స్’లో ధన్యవాదాలు తెలిపారు.
రాకపోకలకు ఇబ్బంది లేకుండా చూడాలి: పవన్
తుఫాన్ కారణంగా రోడ్ల ధ్వంసం జరిగితే, రోడ్లపై చెట్లు, విద్యుత్ స్తంభాలు పడితే వెంటనే తొలగించి.. రాకపోకలకు ఇబ్బంది లేకుండా చూడాలని డిప్యూటీ సీఎం సూచించారు. కలెక్టర్లు, ఎస్పీలు, క్షేత్ర స్థాయి యంత్రాంగంతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారని, అందరూ ఫీల్డ్‌లో ఉన్నారని లోకేశ్ ముఖ్యమంత్రికి వివరించారు. సమీక్షల్లో సీఎస్ విజయానంద్, మంత్రులు నారాయణ, అనిత, సత్యప్రసాద్, డీజీపీ గుప్తా పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
ఎంసీడీ వార్డుల్లో ఉపఎన్నికలను ప్రకటించిన ఈసీ
ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఎయిరిండియా బస్సు దగ్ధం