Police Investigation Notice: ఢిల్లీ విమానాశ్రయంలో తోపుదుర్తి
ABN , Publish Date - May 07 , 2025 | 06:37 AM
శ్రీసత్యసాయి జిల్లా రామగిరి మండలంలో జరిగిన పర్యటన సమయంలో చోటు చేసుకున్న ఘటనపై దర్యాప్తు పెంచిన పోలీసులు, ప్రఖ్యాత నిందితుడు తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డికి ఢిల్లీ విమానాశ్రయంలో నోటీసులు పంపారు. హెలికాప్టర్ పైలట్ అనిల్‌కుమార్‌కు మూడో నోటీసు ఇచ్చి 12న విచారణకు హాజరుకావాలని సూచించారు
గుర్తించిన పోలీసులు.. వాట్సా్‌పలో నోటీసులు
14 రోజుల్లో విచారణకు రావాలని సూచన
హెలికాప్టర్ పైలట్‌కు మూడో నోటీసు
12న వ్యక్తిగతంగా హాజరు కావాలని స్పష్టీకరణ
ధర్మవరం/చెన్నేకొత్తపల్లి, మే 6(ఆంధ్రజ్యోతి): శ్రీసత్యసాయి జిల్లా రామగిరి మండలంలో గత నెల 8న జగన్ పర్యటన సమయంలో కుంటిమద్ది హెలిప్యాడ్ వద్ద చోటు చేసుకున్న ఘటన దర్యాప్తులో పోలీసులు దూకుడు పెంచారు. అజ్ఞాతంలో ఉన్న ప్రధాన నిందితుడు, వైసీపీ రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి మంగళవారం ఢిల్లీ విమానాశ్రయం లాంజ్‌లో ఉన్నట్లు గుర్తించారు. దీంతో బీఎన్‌ఎస్‌ఎస్ సెక్షన్ 35(3) కింద ఆయనకు వాట్సాప్ ద్వారా నోటీసులు పంపించారు. 14 రోజుల్లో రామగిరి సర్కిల్ కార్యాలయంలో విచారణకు రావాలని సూచించారు. బుధవారం అనంతపురంలోని ఆయన ఇంటికి వెళ్లి వ్యక్తిగతంగానూ నోటీసులిస్తామని పోలీసులు తెలిపారు. అరెస్టు భయంతో అజ్ఞాతంలోకి వెళ్లిన ఆయన.. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించగా.. ఆయనకు నోటీసులిచ్చి విచారించాలని పోలీసులను న్యాయస్థానం ఆదేశించింది.
అదే సమయంలో దర్యాప్తునకు సహకరించకపోతే చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చని కూడా స్పష్టంచేసింది. అయినా ఆయన పోలీసులకు అందుబాటులోకి రాలేదు. మరోవైపు.. ఆ రోజు హెలికాప్టర్ పైలట్ అనిల్‌కుమార్‌కు పోలీసులు మూడోసారి నోటీసు పంపారు. 12న రామగిరి సర్కిల్ కార్యాలయంలో వ్యక్తిగతంగా హాజరు కావాలని స్పష్టంచేశారు. అనిల్‌కుమార్ మొదటి రెండు నోటీసులకు స్పందించినా.. విచారణకు రాలేదు. వర్చువల్‌గా హాజరయ్యేందుకు అవకాశమివ్వాలని కోరగా.. పోలీసులు నిరాకరించారు.