Share News

కృష్ణారెడ్డిది తప్పుడు కేసు

ABN , Publish Date - Mar 14 , 2025 | 04:31 AM

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో తమకు అనుకూలంగా సాక్ష్యం చెప్పాలంటూ ఆయన కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్‌రెడ్డి, సీబీఐ అధికారి రామ్‌సింగ్‌ తనను బెదిరిస్తున్నారంటూ వివేకా పీఏ ఎం.వెంకటకృష్ణారెడ్డి దాఖలుచేసిన ప్రైవేటు కంప్లయింటులో నిజం లేదని పోలీసులు తేల్చారు.

కృష్ణారెడ్డిది తప్పుడు కేసు

  • ఆయన్ను సునీత, ఆమె భర్త, రామ్‌సింగ్‌ బెదిరించారనడంలో నిజం లేదు

  • పులివెందుల డీఎస్పీ మురళి నాయక్‌ స్పష్టీకరణ

  • కోర్టుకు తుది చార్జిషీటు సమర్పణ

పులివెందుల, మార్చి 13(ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో తమకు అనుకూలంగా సాక్ష్యం చెప్పాలంటూ ఆయన కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్‌రెడ్డి, సీబీఐ అధికారి రామ్‌సింగ్‌ తనను బెదిరిస్తున్నారంటూ వివేకా పీఏ ఎం.వెంకటకృష్ణారెడ్డి దాఖలుచేసిన ప్రైవేటు కంప్లయింటులో నిజం లేదని పోలీసులు తేల్చారు. ఆయన వేసింది తప్పుడు కేసు అని పులివెందుల డీఎస్పీ మురళి నాయక్‌ స్పష్టం చేశారు. ఈ మేరకు గురువారం కోర్టుకు తుది చార్జిషీటు సమర్పించారు. సునీత, రాజశేఖర్‌రెడ్డి, రామ్‌సింగ్‌పై 2023లో పులివెందుల కోర్టులో కృష్ణారెడ్డి ప్రైవేటు కంప్లయింటు దాఖలు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని కోర్టు పోలీసులకు ఆదేశాలిచ్చింది. దీంతో నాడు పులివెందులలో కేసు నమోదు చేసిన సీఐ రాజు.. ఆయన ప్రైవేటు కంప్లయింటు నిజమేనని, ఆ ముగ్గురూ కృష్ణారెడ్డిని బెదిరించారని కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. ఇంకోవైపు.. తమపై కేసు కొట్టివేయాలని సునీత, రాజశేఖర్‌రెడ్డి, రామ్‌సింగ్‌ హైకోర్టును ఆశ్రయించారు. కొట్టివేయడం సాధ్యం కాదని కోర్టు చెప్పడంతో సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఈ కేసు ప్రస్తుతం అక్కడ పెండింగ్‌లో ఉంది.


రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన అనంతరం కేసు పునఃపరిశీలనకు ఆదేశించింది. దీంతో పులివెందుల డీఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు కృష్ణారెడ్డిని, 23 మంది సాక్షులను విచారించారు. వైసీపీ నాయకుల ఒత్తిడి వల్లే కృష్ణారెడ్డి ఆ ముగ్గురిపై ప్రైవేటు కంప్లయింటు వేసినట్లు నిర్ధారణకు వచ్చారు. గత నెల 20వ తేదీన పులివెందుల కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. కోర్టు దానిని పరిశీలించి.. 27వ తేదీన కొన్ని సూచనలు చేసింది. వాటి ప్రకారం వారు తుది చార్జిషీటు రూపొందించారు. వివేకాను హత్య చేశారని తొలుత కేసు పెట్టింది కృష్ణారెడ్డే. రెండేళ్లపాటు సునీత, రాజశేఖర్‌రెడ్డిలకు అనుకూలంగానే ఉన్నారని.. కేవలం వైసీపీ నాయకుల బెదిరింపుల కారణంగానే సునీత, రాజశేఖర్‌రెడ్డితో పాటు రామ్‌సింగ్‌పై ప్రైవేటు కంప్లయింటు చేసినట్లు పేర్కొన్నారు. గురువారం పులివెందుల కోర్టు జడ్జి సెలవులో ఉండడంతో డీఎస్పీ స్వయంగా జమ్మలమడుగు వెళ్లి అక్కడి సివిల్‌ జడ్జి కోర్టులో తుది చార్జిషీటు దాఖలు చేశారు.

Updated Date - Mar 14 , 2025 | 04:31 AM