Share News

Maoist Encounter: అల్లూరి జిల్లాలో ఎదురుకాల్పులు

ABN , Publish Date - Apr 30 , 2025 | 05:18 AM

అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరులో మావోయిస్టులు, పోలీసుల మధ్య రెండు దఫాలు ఎదురుకాల్పులు జరిగాయి. డీసీఎం అరుణ, జగన్, ఉదయ్‌తో పాటు 11 మంది మావోయిస్టులు తప్పించుకున్నారు.

Maoist Encounter: అల్లూరి జిల్లాలో ఎదురుకాల్పులు

  • త్రుటిలో తప్పించుకున్న అరుణ, జగన్‌, ఉదయ్‌

  • నక్సల్స్‌ కోసం ఉధృతంగా గ్రేహౌండ్స్‌ గాలింపు

కొయ్యూరు, ఏప్రిల్‌ 29 (ఆంధ్రజ్యోతి): కొంతకాలంగా నిశ్శబ్ధంగా ఉన్న అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు ప్రాంతం తుపాకుల మోతతో ఉలిక్కిపడింది. మఠంభీమవరం పంచాయతీ కాకులమామిడి, కంఠారం గ్రామాల సమీపంలోని అటవీ ప్రాంతంలో రెండు దఫాలు మావోయిస్టులకు, పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. కాల్పులు జరుపుతూనే మావోయిస్టులు అక్కడినుంచి తప్పించుకున్నారు. వీరిలో డీసీఎం అరుణ, ఉదయ్‌, జగన్‌లతో పాటు మరో 11 మంది సభ్యులు ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు. మఠంభీమవరం పంచాయతీ పరిధిలోని అటవీ ప్రాంతం (కాకినాడ జిల్లా సరిహద్దు)లో మావోయిస్టుల కదలికలు ఉన్నట్టు పోలీస్‌ ఉన్నతాధికారులకు సమాచారం అందింది. ఈ మేరకు సోమవారం ఉదయం కాకినాడ జిల్లాకు చెందిన ప్రత్యేక బలగాలు ఆ ప్రాంతానికి చేరుకున్నాయి.


ఉధృతంగా గాలింపు చేపట్టారు. ఈ క్రమంలోనే రెండు సార్లు ఎదురుకాల్పులు జరిగాయని పోలీసులు తెలిపారు. ఎస్‌ఎల్‌ఆర్‌ మ్యాగజైన్‌, 20 బుల్లెట్లతోపాటు కొన్ని మందులు, సిరంజులు, కిట్‌ బ్యాగ్‌లు, ఆహార పదార్థాలు అక్కడ స్వాధీనంచేసుకున్నారు. దాడి నుంచి తప్పించుకున్న మావోయిస్టుల కోసం గ్రేహౌండ్స్‌, ప్రత్యేక పోలీస్‌ పార్టీ కూంబింగ్‌ నిర్వహిస్తున్నాయి. జీకే వీధి నుంచి మందపల్లి, పుట్టకోట మీదుగా సరిహద్దు ప్రాంతాల వరకూ గాలింపు నిర్వహిస్తున్నాయి. కాగా, ఎదురుకాల్పులు చోటుచేసుకోవడం వాస్తవమేనని చింతపల్లి ఏఎస్పీ నవజ్యోతి మిశ్రా తెలిపారు. కాగా, కొయ్యూరు మండలం యు.చీడిపాలెం పంచాయతీ తీగలమెట్టలో 2021 జూన్‌ 15న ఎదురుకాల్పులు జరిగాయి. ఆ ఎన్‌కౌంటర్‌లో గాలికొండ దళానికి చెందిన ఐదుగురు మావోయిస్టులు మృతిచెందారు. నాటి నుంచి నేటి వరకూ ఈ ప్రాంతంలో ఏ విధమైన సంఘటనలూ జరగలేదు.

Updated Date - Apr 30 , 2025 | 05:18 AM