Central Water Commission: పోలవరం ఓకే గుడ్
ABN , Publish Date - May 11 , 2025 | 05:20 AM
పోలవరం ప్రధాన డ్యామ్ పనులపై అంతర్జాతీయ నిపుణులు సంతృప్తి వ్యక్తం చేశారు. డయాఫ్రమ్‌వాల్ నిర్మాణంలో సాంకేతిక లోపాలు లేవని స్పష్టత ఇచ్చారు.
ప్రాజెక్టు ప్రధాన డ్యామ్‌పై అంతర్జాతీయ నిపుణుల సంతృప్తి
డయాఫ్రమ్‌వాల్ నిర్మాణంలో సాంకేతిక లోపాల్లేవని వెల్లడి
వర్టికల్ డ్రిల్లింగ్ వీడియో క్లిప్‌లను పంపించండి
ఎర్త్ కమ్ రాక్‌ఫిల్ డ్యామ్‌కు గ్రీన్ సిగ్నల్
ముందస్తుగా రాళ్లు, మట్టి సేకరించాలని సూచన
అమరావతి, మే 10 (ఆంధ్రజ్యోతి): పోలవరం సాగునీటి ప్రాజెక్టు నిర్మాణానికి అడ్డంకులు పూర్తిగా తొలగిపోయాయి. డయాఫ్రమ్‌వాల్ నిర్మాణంలో ప్లాస్టిక్ కాంక్రీట్ మిక్చర్‌పైనా, నిర్మాణ పనులపైనా.. అమెరికా, కెనడాకు చెందిన అంతర్జాతీయ నిపుణుల ప్యానెల్ సభ్యులు నలుగురూ ఎలాంటి అభ్యంతరాలు చెబుతారోనన్న ఆందోళనకు తెరపడింది. డయాఫ్రమ్‌వాల్ నిర్మాణ పనులపై అంతర్జాతీయ నిపుణుల ప్యానెల్ పూర్తి సంతృప్తిని వ్యక్తం చేసింది. డయాఫ్రమ్‌వాల్ నిర్మాణంలో సాంకేతిక లోపాలు లేవని స్పష్టం చేసింది. ఈ నెల 5 నుంచి 8వ తేదీ దాకా అమెరికా, కెనడాకు చెందిన నిపుణుల ప్యానెల్ సందర్శించింది. ఈ ప్యానెల్ పోలవరం ప్రాజెక్టు పనులను క్షుణ్ణంగా పరిశీలించింది. డయాఫ్రమ్‌వాల్ ప్లాస్టిక్ కాంక్రీట్ మిక్చర్‌ను కలుపడంలోనూ, మిషనరీని ఉపయోగించడంలోనూ సహేతుకమైన సాంకేతిక విధానాలే అమలు చేస్తున్నారని సంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నెల 8వ తేదీన స్వదేశానికి నిపుణుల ప్యానెల్ బృందం ప్రయాణమైంది. ఈ సమయంలో పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో నిర్వహించిన సుదీర్ఘ సమీక్షలో ప్రధాన డ్యామ్ పనులు సాగుతున్న తీరుపై సంతృప్తి వ్యక్తం చేస్తూనే, భవిష్యత్తులో తమతో ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటూ సమాచారాన్ని పంపుతుండాలని కేంద్ర జల సంఘం, పోలవరం ప్రాజెక్టు అథారిటీ, పోలవరం ప్రాజెక్టు క్షేత్రస్థాయి ఇంజనీర్లకు ప్యానెల్ బృందం సూచించింది.
ఇప్పటిదాకా డయాఫ్రమ్‌వాల్ నిర్మాణ పనులు సక్రమంగానే సాగుతున్నాయని చెబుతునే.. వెర్టికల్ డ్రిల్లింగ్ (దాదాపు 90 మీటర్ల లోతులో జరిగిపే డ్రిల్లింగ్) వీడియో క్లిప్‌లను.. తాము తమ దేశాలకు చేరుకున్న తర్వాత పంపించాలని స్పష్టం చేసింది. ఈ వెర్టికల్ డ్రిల్లింగ్ సమయంలో ప్లాస్టిక్ కాంక్రీట్ మిక్చర్ మిశ్రమం ఎలా ఉందో?, అది ఎలా గట్టిపడుతుందో?, దాని రసాయన ప్రక్రియలేమిటో శాస్త్రీయంగా తేలుతుందని నిపుణుల ప్యానెల్ వెల్లడించింది. గ్యాప్ -2, గ్యాప్-3 ప్రాంతంలో బంకమట్టిని గట్టిపరిచే ప్రక్రియను వేగవంతం చేసేందుకు నిపుణుల కమిటీ ఆమోదం తెలిపింది.
తరచూ వీడియో కాన్ఫరెన్సులు...
ఎర్త్ కమ్ రాక్‌ఫిల్ డ్యామ్‌కు నిపుణుల కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈసీఆర్‌ఎఫ్ డ్యామ్ నిర్మాణం కోసం ఇప్పటి నుంచే ముడి సరుకైన రాళ్లూ మట్టిని సేకరించాలని, దీనివల్ల లక్ష్యాల మేరకు ప్రధాన డామ్ పనులు పూర్తి చేసేందుకు వీలవుతుందని నిపుణుల ప్యానెల్ అభిప్రాయం వ్యక్తం చేసింది. తాము పరిశీలించిన ప్రాంతాలు, ప్రధాన డ్యామ్ నిర్మాణాలపై తరచూ వీడియో కాన్ఫరెన్సులుంటాయని వెల్లడించింది. డయాఫ్రమ్‌వాల్, ఈసీఆర్‌ఎఫ్ డ్యామ్ డిజైన్లకు సూత్రప్రాయంగా నిపుణుల ప్యానెల్ ఆమోద ముద్ర వేసింది. ఇప్పటికే డిజైన్లను ఆఫ్రీ సంస్థ రూపొందించగా, దీనిని కేంద్ర జల సంఘం ఆమోదించాల్సి ఉంది. మొత్తం మీద పోలవరం ప్రాజెక్టు ప్రధాన డ్యామ్‌పై అంతర్జాతీయ నిపుణుల ప్యానెల్ సంతృప్తి వ్యక్తం చేయడంతో ఇక పనుల్లో వేగాన్ని మరింత పెంచేలా ప్రాజెక్టు ఇంజనీరింగ్ అధికారులు కార్యాచరణను సిద్ధం చేస్తున్నారు.