Polavaram Project: జల సంఘం చేతిలో ‘వాల్’ భవిత
ABN , Publish Date - Jan 13 , 2025 | 03:06 AM
పోలవరం ప్రాజెక్టులో కీలకమైన డయాఫ్రం వాల్ నిర్మాణ పనులపై ఒకవైపు తొందరపెడుతూనే.. మరోవైపు లేనిపోని సందేహాలతో కేంద్ర జల సంఘం జాప్యం చేస్తోంది. ఇప్పుడు సదరు వాల్ నిర్మాణ భవితవ్యం దాని చేతుల్లోనే ఉంది.
ఒకట్రెండు రోజుల్లో నిర్ణయం!
అమరావతి, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టులో కీలకమైన డయాఫ్రం వాల్ నిర్మాణ పనులపై ఒకవైపు తొందరపెడుతూనే.. మరోవైపు లేనిపోని సందేహాలతో కేంద్ర జల సంఘం జాప్యం చేస్తోంది. ఇప్పుడు సదరు వాల్ నిర్మాణ భవితవ్యం దాని చేతుల్లోనే ఉంది. దాని నిర్మాణానికి టీ-16 ప్లాస్టిక్ కాంక్రీట్ మిశ్రమాన్ని వాడాలని సూచిస్తూ అంతర్జాతీయ నిపుణుల ప్యానెల్ శనివారం నివేదిక పంపింది. పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) ద్వారా అది జలసంఘానికి అందింది. ఇదే సమయంలో సెంట్రల్ సాయిల్-మెటీరియల్స్ రీసెర్చ్ స్టేషన్ (సీఎ్‌సఎంఆర్‌ఎస్) మాత్రం గతంలో డయాఫ్రం వాల్ నిర్మాణానికి వాడిన టీ-5 మిశ్రమాన్నే కొత్త వాల్‌కు కూడా వినియోగించాలని సిఫారసు చేసింది. దాని నివేదికనూ పీపీఏ జలసంఘానికి పంపింది. అటు దేశీయ నిపుణులు కూడా.. టీ-5 ప్లాస్టిక్ కాంక్రీట్ మిశ్రమమే మేలని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ రెండు నివేదికలను అంతర్గతంగా సమీక్షించుకుని ఒకట్రెండు రోజుల్లో జలసంఘం తన అభిప్రాయాన్ని వెల్లడించనుంది.