AP River Linking: బనకచర్లకు నిధులివ్వండి
ABN , Publish Date - Jun 03 , 2025 | 04:30 AM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పోలవరం-బనకచర్ల నదుల అనుసంధాన ప్రాజెక్టుకు కేంద్రానికి సహకారం కోరింది. వరద జలాలను సద్వినియోగం చేసి రాయలసీమకు సాగు నీటి సమకూర్చే ఈ ప్రాజెక్టుకు రూ.80 వేల కోట్ల వ్యయం అవుతుంది.
కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం వినతి
ఢిల్లీలో కేంద్ర ఆర్థిక శాఖతో పీయూష్ బృందం భేటీ
పోలవరం-బనకచర్ల అనుసంధానంపై ప్రజెంటేషన్
ఏటా జూలై 1 నుంచి అక్టోబరు దాకా గోదారికి వరద
3 వేల టీఎంసీలు కడలిపాలు.. ఇందులో 200 టీఎంసీలను వంద రోజుల్లో ఎత్తిపోస్తాం
వరద జలాల ఆధారంగా దేశంలో ఇదే తొలి నదుల అనుసంధాన పథకం
పోలవరం కంటే బనకచర్ల పెద్ద ప్రాజెక్టు
ఏడేళ్లు దీర్ఘకాలిక సాయం అందించండి: పీయూష్
సమగ్ర రిపోర్టు ఇస్తే నిధుల విడుదలపై కార్యాచరణ
కేంద్ర అధికారుల హామీ.. నెలాఖరుకల్లా ఇస్తాం: రాష్ట్రం
అమరావతి, జూన్ 2 (ఆంధ్రజ్యోతి): కరువు ప్రాంతం రాయలసీమను సస్యశ్యామలం చేయడానికి, పల్నాడు ప్రాంతాన్ని దుర్భిక్షానికి దూరం చేసేందుకు తలపెట్టిన పోలవరం-బనకచర్ల అనుసంధాన పథకానికి సహకరించాలని రాష్ట్రప్రభుత్వం కేంద్రాన్ని అభ్యర్థించింది. దీనికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను సమర్పించాలని కేంద్ర ఆర్థిక శాఖ సూచించింది. అది అందితే నిధుల విడుదలపై కార్యాచరణ సిద్ధంచేస్తామని హామీ ఇచ్చింది. దాదాపు రూ.80 వేల కోట్ల అంచనా వ్యయంతో రూపుదిద్దుకుంటున్న ఈ ప్రాజెక్టుపై సోమవారం ఢిల్లీలో రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూ్‌షకుమార్.. కేంద్ర ఆర్థిక శాఖ (వ్యయం) కార్యదర్శి నాగరాజును కలిసి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కార్యక్రమంలో జల వనరుల శాఖ సలహాదారు ఎం.వెంకటేశ్వరరావు, ఈఎన్‌సీ నరసింహమూర్తి, ఎస్‌ఈ రాంబాబు, కేంద్ర ఆర్థిక శాఖ అండర్ సెక్రటరీ అనిల్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. దేశంలో మొదటిసారిగా వరద జలాలను ఎత్తిపోయడం ద్వారా కృష్ణా, గోదావరి నదుల అనుసంధానం తలపెట్టామని పీయూష్ తెలిపారు. ‘జలహారతి’ పేరిట ప్రతిష్ఠాత్మకంగా చేపట్టదలచిన ఈ పథకానికి ప్రాథమికంగా రూ.80,000 కోట్ల మేర వ్యయమవుతుందని అంచనా వేసినట్లు చెప్పారు. దీనికి నదుల అనుసంధాన కార్యక్రమంలో భాగంగా కేంద్రం ప్రత్యేకంగా ఇచ్చే నిధులతోపాటు విదేశీ ఆర్థిక సంస్థల నుంచి కూడా రుణాలు ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు.
ఇది పోలవరం ప్రాజెక్టు కంటే చాలా పెద్దదైనందున స్వల్పకాలికంగా కాకుండా దీర్ఘకాలం.. ఏడేళ్లపాటు ఆర్థిక సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. దీని ప్రాథమిక సాధ్యాసాధ్యాల నివేదికను ఇప్పటికే కేంద్ర జల సంఘానికి పంపామన్నారు. దీంతో సమగ్ర ప్రాజెక్టు నివేదికను సమర్పించాలని అనిల్ యాదవ్ సూచించారు. ఈ నెలాఖరునాటికి రిపోర్టును సిద్ధం చేసి సమర్పిస్తామని పీయూష్ తెలిపారు.
వరద జలాల సద్వినియోగానికి..
బనకచర్ల పథకం రూపకల్పనపై పీయూష్ చెప్పిన సమాచారాన్ని ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు సావధానంగా విన్నారు. ‘ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గోదావరి జలాలను సద్వినియోగం చేసుకునేలా తెలంగాణ భూభాగంలో ప్రాజెక్టుల నిర్మాణం జరిగింది. విభజిత ఆంధ్రప్రదేశ్ కూడా గోదావరి జలాలను సంపూర్ణంగా సద్వినియోగం చేసుకోవాలంటే పోలవరం-బనకచర్ల అనుసంధాన పథకాన్ని చేపట్టాల్సిన అవసరం ఉంది. ఏటా 2,800 నుంచి 3,200 టీఎంసీల గోదావరి జలాలు వరదల సమయంలో వృధాగా కడలిపాలవుతున్నాయి. ఈ వరదనీటి సద్వినియోగానికే బనకచర్ల పథకం చేపట్టాలని నిర్ణయించాం. వరద జలాలను సద్వినియోగం చేసుకునే నదుల అనుసంధాన పథకం దేశంలో ఇదే మొట్టమొదటిది. దిగువ రాష్ట్రంగా సముద్రంలో కలసిపోతున్న వరద జలాలను వాడుకునే స్వేచ్ఛ ఆంధ్రప్రదేశ్‌కు ఉంది. ఈ పథకం కింద వరద జలాలనే తరలిస్తాం’ అని స్పష్టంచేశారు. మరింత సవివరంగా చెప్పాలని అనిల్ యాదవ్ కోరారు. గోదావరి నదికి జూలై 1 తేదీ నుంచి అక్టోబరు మధ్యదాకా వరద ఉధృతంగా ఉంటుందని పీయూష్ వెల్లడించారు. ఈ వరద నీటిలో 200 టీఎంసీలను 100 రోజుల్లో ఎత్తిపోస్తామని తెలిపారు. ఈ వివరాలు ఆలకించాక కేంద్ర ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు సానుకూలంగా స్పందించారు. డీపీఆర్‌ను సమర్పిస్తే.. నిధుల విడుదలపై కార్యాచరణ వెల్లడిస్తామని హామీ ఇచ్చారు.