PM Surya Ghar Yojana: పీఎం సూర్య ఘర్.. మారిన నిబంధనలు ఇవే..
ABN , Publish Date - Sep 19 , 2025 | 12:24 PM
థకం ప్రారంభంలో ఏడాదికి రూ.15 లక్షల లోపు ఆదాయం ఉన్న వారికి మాత్రమే రాయితీ లభిస్తుందని ప్రకటించారు. ఆ తరువాత ఈ పరిమితి ఎత్తేశారు. సొంత ఇల్లు ఉన్న వారు ఇంటి పైకప్పుపై దీనిని ఏర్పాటు చేయాలి.
విశాఖపట్నం, సెప్టెంబర్ 19: ప్రధాన మంత్రి సూర్య ఘర్ పథకం కింద రూఫ్ టాప్ సోలార్‌ను ఏర్పాటు చేసుకోవడానికి విద్యుత్ పంపిణీ సంస్థలు నిబంధనలు సడలిస్తున్నాయి. తాజాగా డిస్కమ్ పరిధిలో ఎక్కడైనా ఏర్పాటు చేసుకుని ప్రయోజనం పొందేలా అవకాశం కల్పించారు. దీనిద్వారా వీలైనంత ఎక్కువ మందికి పథకం అందించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.
పథకం ప్రారంభంలో ఏడాదికి రూ.15 లక్షల లోపు ఆదాయం ఉన్న వారికి మాత్రమే రాయితీ లభిస్తుందని ప్రకటించారు. ఆ తరువాత ఈ పరిమితి ఎత్తేశారు. సొంత ఇల్లు ఉన్న వారు ఇంటి పైకప్పుపై దీనిని ఏర్పాటు చేయాలి. అయితే విశాఖ లాంటి నగరాల్లో ఎక్కువ సంఖ్యలో ప్లాటు, అపార్ట్‌మెంట్లపై వ్యక్తిగతంగా సోలార్ ప్లేట్లు ఏర్పాటుకు అసోసియేషన్లు అనుమతి ఇవ్వకపోవడంతో అధికారులు ప్రత్యామ్నాయ ఆలోచన చేశారు. ప్లాట్లో నివసించే వినియోగదారులకు జిల్లాలో ఎక్కడైనా సొంత ఇల్లు, స్థలం ఉంటే.. అక్కడ ఏర్పాటు చేసుకుని, దాని ద్వారా లభించే సోలార్ విద్యుత్‌ను ఫ్లాట్‌లో వాడుకునే వీలు కల్పించారు. దీనివల్ల కూడా పెద్దగా ప్రయోజనం కనిపించలేదు. ఎక్కడెక్కడి నుంచో ఉద్యోగ, ఉపాధి రీత్యా వచ్చి నగరంలో స్థిర పడిన వారికి లబ్ధి కలగాలంటే పరిధి విస్తృతం చేయాలని భావించారు. ఇందులో భాగంగా ఏపీ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఈపీడీసీఎల్) పరిధిలో అంటే శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నుంచి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు వరకు ఎక్కడైనా సరే రూఫ్ టాప్ సోలార్ పెట్టుకుంటే, దానిని విశాఖలో నివాసం ఉండే ఫ్లాట్‌కు లింక్ చేసుకునే అవకాశం కల్పించారు. ఉదాహరణకు సీతమ్మ దారలోని అపార్ట్‌మెంట్‌లో ఉండే వినియోగదారునికి శ్రీకాకుళం జిల్లా కవిటిలో సొంత స్థలం లేదా పొలం ఉండి, అక్కడ రూఫ్ టాప్ సోలార్ పెట్టుకుంటే.. అక్కడ ఉత్పత్తి అయ్యే సోలార్ పవర్‌ని విశాఖలో ప్లాట్‌కు లింక్ చేసి ఉపయోగించుకునే అవకాశం కల్పించారు. రెండు చోట్ల యజమాని ఒక్కరే కావడంతో దీని అమలుకు ఇబ్బందులు ఉండవని అధికారులు చెబుతున్నారు. దీనివల్ల రూప్ టాప్ ఏర్పాటు చేసుకునే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుందని భావిస్తున్నారు.
ఎంత ప్రయోజనం అంటే...?
ఒక్కో వినియోగదారుడు మూడు కిలోవాట్ల సామర్థ్యం కలిగిన రూప్ టాప్ సోలార్ ఏర్పాటు చేసుకునే వీలుంది. ఒక కిలోవాట్ ద్వారా రోజుకు నాలుగు యూనిట్ల చొప్పున నెలకు 120 యూనిట్లు విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. దీనికి అయ్యే వ్యయం రూ.60వేలు. అందులో ప్రభుత్వం రూ.30వేలు రాయితీ ఇస్తుంది. రెండు కిలోవాట్లకు నెలకు 240 యూనిట్లు ఉత్పత్తి అవుతుంది. రూ.60వేలు రాయితీ వస్తుంది. మూడు కిలోవాట్లు పెట్టుకుంటే రూ.78వేలు రాయితీ లభిస్తుంది. నెలకు 360 యూనిట్ల సోలార్ విద్యుత్ వస్తుంది. సగటు వినియోగ దారులకు ఈ పథకం సరిపోతుంది. ఇందుకు ఆయ్యే మొత్తం రుణంగా ఇచ్చేందుకు బ్యాంకులు కూడా ముందుకు వస్తున్నాయి. కేవలం రూ. వెయ్యి డౌన్ పేమెంట్‌తో మూడు కిలోవాట్ల పథకం పెట్టుకోవచ్చు. నెల నెలా కట్టే విద్యుత్ బిల్లును ఐదేళ్లు ఈఎంఐల కింద బ్యాంకుకు చెల్లిస్తే రుణం తీరిపోతుంది. రూఫ్ టాప్ సోలార్ జీవిత కాలం 25 ఏళ్లు. ఐదేళ్లకు ఈఎంఐలు కడితే మిగిలిన 20 ఏళ్లకు వచ్చే విద్యుత్ ఉచితమే.
విస్తృత ప్రచారం చేస్తున్నాం..
రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో పదివేల మందికి పీఎం సూర్య ఘర్ పథకం అందించాలని లక్ష్యంగా నిర్దేశించింది. దీనిపై విస్తృత ప్రచారం చేస్తున్నాం. డిస్కమ్ పరిధిలో 1,16,364 మంది పేర్లు నమోదు చేసుకున్నారు. ఇప్పటి వరకు 23,362 మందికి ఏర్పాటు చేశాం. మరో 574 గ్రౌండింగ్ దశలో ఉన్నాయి. 4,084 ఇనస్టాలేషన్‌కు వెయిటింగ్‌లో ఉన్నాయి. జిల్లాలో 11,897 మంది పేర్లు నమోదు చేసుకోగా 2910 మందికి అమర్చాం. వీటి సంఖ్య పెంచడానికి విస్తృత ప్రచారం చేస్తున్నాం.
- పృథ్వీతేజ్, సీఎండీ, ఈపీడీసీఎల్