PM Modi: ఇది యోగా 2.0
ABN , Publish Date - Jun 22 , 2025 | 06:24 AM
ప్రపంచాన్ని ఏకం చేసే శక్తి యోగాకు ఉంది. అందుకే ఈరోజు 175కు పైగా దేశాల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
ప్రపంచాన్నే ఏకం చేసే శక్తి యోగాకు ఉంది
ఇది వికసిత్ భారత్‌కు స్ఫూర్తి: ప్రధాని మోదీ
విశాఖపట్నం, జూన్ 21(ఆంధ్రజ్యోతి): ప్రపంచాన్ని ఏకం చేసే శక్తి యోగాకు ఉంది. అందుకే ఈరోజు 175కు పైగా దేశాల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ యోగా దినోత్సవం మానవాళికి యోగా 2.0 ప్రారంభాన్ని సూచిస్తుందని తెలిపారు. విశాఖపట్నంలో శనివారం నిర్వహించిన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి (యోగాంధ్ర) ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని ప్రసంగిస్తూ ‘అంతర్జాతీయ యోగా దినోత్సవం’ నిర్వహించాలని పదేళ్ల క్రితం తాను ఐక్యరాజ్య సమితిలో ప్రతిపాదిస్తే అనేక దేశాలు మద్దతు ఇచ్చాయని గుర్తుచేసుకున్నారు. యోగా అంటే వ్యాయామం ఒక్కటే కాదని, అందరినీ ఏకం చేస్తే శక్తి అని అభివర్ణించారు. కోట్లాది మంది జీవనశైలిలో యోగా అంతర్భాగంగా మారిందని చెప్పారు. అంధులు బ్రెయిలీలో యోగా గ్రంథాలు చదువుతున్నారని, సైంటిస్టులు అంతరిక్షంలో కూడా యోగా సాధన చేస్తున్నారని, ఇవన్నీ యోగా ఫలితాలేనని గర్వంగా ప్రకటించారు.
యోగా ఒలింపింయాడ్లలో గ్రామీణులు కూడా పాల్గొంటున్నారంటే అది ఎంతవరకు విస్తరించిందో అర్థం చేసుకోవచ్చనని పేర్కొన్నారు. యోగా ఆచరణకు సరిహద్దులు, నేపథ్యాలు లేవని, వయసు తారతమ్యం లేదని, సామర్థ్యాల అవసరం కూడా లేదని, ఎవరైనా చేయవచ్చని వివరించారు. విశాఖపట్నం ప్రకృతి, ప్రగతి కలగలిపిన నగరమని ప్రధాని ప్రశంసించారు. ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారంటూ సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్‌ను వేదికపై నుంచే అభినందించారు. యోగా నిజమైన సామాజిక వేడుక అని, దీనిని సమాజంలో ప్రతి ఒక్కరికీ ఎలా చేర్చవచ్చో చేతల్లో నిరూపించారని ప్రశంసించారు. యోగాతో ప్రశాంతత వస్తుందని, అది ప్రపంచ విధానంగా మారుతుందని, శాంతిని కోరుకుంటుందని అభిలషించారు.
ఈరోజు 2కోట్ల మందికి పైగా ప్రజలు యోగాంధ్రలో భాగస్వాములయ్యారని, ఇది వికసిత్ భారత్‌కు స్ఫూర్తిగా నిలుస్తుందని అన్నారు. ప్రజలు దేనినైనా మనస్ఫూర్తిగా కోరుకుంటే ఆ లక్ష్యాన్ని సాధించడం ఆసాధ్యం కాదని యోగాంధ్ర నిరూపించిందన్నారు. విశాఖ నగరమంతటా యోగాంధ్రలో పాల్గొనాలనే ప్రజల ఉత్సాహం, వారి ప్రోత్సాహం ప్రస్ఫుటంగా కనిపించిదని ప్రధాని పేర్కొన్నారు. ఈ 11వ యోగా దినోత్సవానికి ‘ఒక భూమి...ఒక ఆరోగ్యం కోసం యోగా’ అనే నినాదం తీసుకున్నామని, ఇది లోతైన సత్యాన్ని ప్రబోధిస్తుందని తెలిపారు. ఎవరూ ఒంటరి వ్యక్తులు కారని, ప్రకృతిలో అంతర్భాగమని విశ్లేషించారు. యోగా ప్రారంభ దశలో సొంత ఆరోగ్యం, శ్రేయస్సు చూసుకుంటారని, ఆ తరువాత పర్యావరణం, సమాజం గురించి ఆలోచిస్తారని అదే అందులో గొప్పతనమని వివరించారు. యోగా క్రమశిక్షణ అలవాటు చేయడంతో పాటు వ్యక్తులను నా అనే భావన నుంచి మనం అనే వైపు నడిపిస్తుందని వెల్లడించారు. ప్రజలకు ప్రధాని యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.