Share News

Phone tapping: చట్టంతో చెలగాటం

ABN , Publish Date - Jun 19 , 2025 | 04:33 AM

ఫోన్‌ ట్యాపింగ్‌... మాజీ సీఎం జగన్‌ హయాంలో జరిగిన ఎన్నో అరాచకాలకు ఇదే కీలకం. అప్పట్లో రాజకీయ ప్రత్యర్థుల నుంచి న్యాయమూర్తుల వరకూ ఎవరినీ వదల్లేదు. చివరకు సొంత పార్టీ నేతలు, మంత్రులు, అధికారులు, జర్నలిస్టుల ఫోన్‌ సంభాషణలపై కూడా దొంగచాటుగా ఓ చెవి వేశారు.

Phone tapping: చట్టంతో చెలగాటం

ఫోన్‌ ట్యాపింగ్‌తో జగన్‌ అరాచకం

రాజకీయ ప్రత్యర్థుల ఫోన్లపై గురి

  • జడ్జిల మాటలూ విన్నారని ఆరోపణలు

  • సుప్రీంకోర్టుకు ఓ కీలక న్యాయమూర్తి లేఖ

  • అనుకూల తీర్పులివ్వలేదనే అక్కసుతోనేనా..

  • బాధితుల్లో సొంత పార్టీ నేతలు, అధికారులు

  • చట్టబద్ధమైన అనుమతులు అవసరం లేకుండా అత్యాధునిక ట్యాపింగ్‌ సాంకేతికత వినియోగం

  • సొంత వ్యవస్థలా టెలీగ్రాఫ్‌ చట్టం వాడకం

  • చట్టం ఉల్లంఘనలకు కనీసం మూడేళ్ల శిక్ష

(అమరావతి-ఆంధ్రజ్యోతి) : ఫోన్‌ ట్యాపింగ్‌... మాజీ సీఎం జగన్‌ హయాంలో జరిగిన ఎన్నో అరాచకాలకు ఇదే కీలకం. అప్పట్లో రాజకీయ ప్రత్యర్థుల నుంచి న్యాయమూర్తుల వరకూ ఎవరినీ వదల్లేదు. చివరకు సొంత పార్టీ నేతలు, మంత్రులు, అధికారులు, జర్నలిస్టుల ఫోన్‌ సంభాషణలపై కూడా దొంగచాటుగా ఓ చెవి వేశారు. చట్ట విరుద్ధం అని తెలిసి కూడా లెక్కలేనితనంతో వ్యవహరించారు. అతి క్రూరమైన బ్రిటిష్‌ చట్టాల అమలుతో సహా ఐదేళ్ల పాలనలో జగన్‌ తీసుకున్న ఎన్నో అడ్డగోలు నిర్ణయాలను కోర్టులు అడ్డుకున్నాయి. న్యాయమూర్తులు తమకు అనుకూలమైన తీర్పులు ఎందుకివ్వడం లేదు? తనకు వ్యతిరేకంగా వారిని ఎవరైనా ప్రేరేపిస్తున్నారా? వారి అంతరంగం ఏమిటో తెలుసుకోవాలని జగన్‌ తహతహలాడారు. ఈ క్రమంలోనే అప్పట్లో ఓ కీలక న్యాయమూర్తి అంతర్గత సంభాషణల్లో చేసిన వ్యాఖ్యలు బయటకొచ్చాయన్న ప్రచారం న్యాయవాదవర్గాల్లో జరిగింది. ఇద్దరు, ముగ్గురు జడ్జిల సమక్షంలోనో, తోటి కొలీగ్స్‌తో ఫోన్‌లోనో మాట్లాడిన విషయాలు బయటకు ఎలా వచ్చాయన్న చర్చ సాగింది. తమ ఫోన్‌ సంభాషణలను చాటుగా వింటున్నారని పక్కా ఆధారాలతో నిర్ధారించుకొన్న న్యాయమూర్తి దీనిపై సుప్రీంకోర్టుకు లేఖ రాశారు. చివరకు ఆయన లేఖ రాసిన విషయం కూడా బయటకొచ్చింది. ఆయన ఫోన్‌ను స్ర్కీనింగ్‌ చేయడం ద్వారానే ఇదంతా సాధ్యమైందని వెల్లడైంది. ఫోన్‌ సంభాషణలపై నిఘా ద్వారానే జగన్‌కు అవన్నీ తెలిశాయని, వ్యక్తిగతగోప్యతకు, ప్రాథమిక హక్కులకు భంగం కలుగుతోందని హైకోర్టు న్యాయమూర్తి ఒకరు సుప్రీంకోర్టుకు మరో లేఖ రాశారు. ఏకంగా జడ్జీల ఫోన్‌ కాల్స్‌కే రక్షణ లేకుండా పోయిందనే ఆందోళన వ్యక్తమైంది. మరోవైపు జగన్‌ ప్రభుత్వంలో ఐఏఎస్‌, ఐపీఎ్‌సలు, ఇతర అధికారుల ఫోన్లను సైతం ట్యాపింగ్‌ చేశారన్న ఆరోపణలు వచ్చాయు. దీంతో ఫోన్‌లో మాట్లాడటం సంగతి అటుంచి వాట్సాప్‌ చాటింగ్‌, కాల్స్‌ చేసే సాహసం కూడా చేయకుండా మౌనంగా ఉండిపోయినవారు అనేకమంది ఉన్నారు. నాడు ప్రతిపక్ష టీడీపీతో పాటు జనసేన, మీడియా ప్రతినిధులపైనా నిఘా పెట్టారు. వారి ఫోన్‌లను నిరంతరం పరిశీలనలో ఉంచారని ఆరోపణలున్నాయి.


చట్టంతో సంబంధం లేకుండా..

ఫోన్‌ స్ర్కీనింగ్‌, ట్యాపింగ్‌ చేయడానికి జగన్‌ ప్రభుత్వం ఎలాంటి మార్గదర్శకాలు పాటించింది? ఏ చట్టాలను అనుసరించిందంటే సమాధానం లేదు. ఇవన్నీ చట్టపరిధిలో సాధ్యమయ్యేవి కాదు. అందుకే చట్టంతో సంబంధం లేకుండానే కీలక వ్యవస్థలను గుప్పిటపట్టి వాటిని దుర్వినియోగం చేశారన్న ఆరోపణలున్నాయి. వాస్తవానికి టెలీగ్రాఫ్‌ చట్టంలోని సెక్షన్‌ 5(2), సెక్షన్‌ 7(2)(బి) ప్రకారం వ్యక్తుల ఫోన్లు ట్యాప్‌ చేయాలంటే వారు దేశ అంతర్గత భద్రత, శాంతిభద్రతలకు ముప్పు కలిగించేవారు అయిఉండాలి. వారిని ఓ కంట కనిపెట్టాలని కోర్టు లు ఆదేశించాలి. కానీ జగన్‌కు ఇవేవీ అవసరంలేదు. అందుకే మూడో కంటికి తెలియని టెక్నాలజీని వాడారని నాటి సీనియర్‌ అధికారులు చెబుతున్నారు.


పెగాస్‌సతో ఫోన్లపై దాడి

గత ప్రభుత్వంలో ఎక్కువగా జీరో క్లిక్‌ స్పైవేర్‌ను వాడారన్న ఆరోపణలున్నాయి. అందులో ఇజ్రాయెల్‌కు చెందిన సాంకేతికత పెగాసస్‌ ఒకటి. ఫోన్‌కు స్పైవేర్‌ను పంపి, పూర్తిగా నియంత్రణలోకి తెచ్చుకోవడం దీని ప్రత్యేకత. ఒక్కసారి ఈ దాడి మొదలయ్యాక సదరు ఫోన్‌లో ఉన్న ఫొటోలు, కాంటాక్ట్‌లు, కాల్‌డేటా, వీడియో, ఆడియో కాల్స్‌, తదితర కీలక సమాచారం హ్యాక్‌ చేసినవారి చేతికి వెళ్తుంది. ఎవరెవరు వాట్సాప్‌ కాల్‌ చేసుకుంటున్నారో, చాటింగ్‌లో ఏమేం మాట్లాడుతున్నారో సులువుగా తెలుసుకోగలిగారు. ప్రిడేటర్‌ (ఇంటెలెక్సా అలయన్స్‌), రెయిన్‌ (క్వాడ్రీమ్‌) వంటి సాఫ్ట్‌వేర్లతో ఐఫోన్‌, అండ్రాయిడ్‌ ఫోన్లలోకి చొరబడి నిఘా పెట్టారన్న ఆరోపణలున్నాయి. ఈ స్పైవేర్‌ దాడి అనేది ఇంకా చట్ట పరిధిలోకి రాలేదు. అందుకే నాటి ప్రభుత్వం పౌరులపై ఈ తరహా నిఘా, నియంత్రణ చేయడానికి ఏ చట్టాల నుంచి అనుమతి తీసుకోలేదు.


గుప్పిట్లో నెట్‌వర్కింగ్‌ వ్యవస్థ

ఫోన్‌ ట్యాపింగ్‌, స్ర్కీనింగ్‌లో రెండో రకం ఫోన్‌ నెట్‌వర్కింగ్‌ వ్యవస్థను వాడుకోవడం. టెలీకామ్‌ ఆపరేటర్లను బెదిరించి, అదిరించి ఈ పని చేయించుకోవాలి. అయితే, 2019లో ఇజ్రాయెల్‌ ఓ కొత్త టెక్నాలజీ తీసుకొచ్చింది. టెలీకామ్‌ ఆపరేటర్‌తో సంబంధం లేకుండా నెట్‌వర్క్‌ను గుప్పిట్లోకి తీసుకొని కావాల్సిన ఫోన్‌ను ట్యాపింగ్‌ చేయడం. ఇందుకోసం ఐఎంఎస్‌ఐ క్యాచర్స్‌, స్ట్రింగ్‌రేస్‌ వంటి సాంకేతికతలను వాడారన్న విమర్శలున్నాయి. ఐఎంఎ్‌సఐ క్యాచర్‌ ఓ పెద్ద సూటకేసులో ఇమిడిపోయేంత ఉంటుంది. ఎవరి ఫోన్‌ను ట్యాప్‌ చేయాలంటే వారున్న ప్రాంతానికి ఆ పరికరం ఉన్న సూట్‌కేసును తీసుకెళ్లి, సెల్‌టవర్‌ సిగ్నల్‌ను జామ్‌చేసి తమ పరిధిలోకి తీసుకుంటే చాలు. ఎవరెవరు, ఏం మాట్లాడుకుంటున్నారో వినడంతో పాటు రికార్డింగ్‌ చేసే అవకాశం ఉంది. ఈ టెక్నాలజీ వినియోగంపై చట్టబద్ధ నియంత్రణ లేకపోవడంతో ప్రభుత్వాలు, ప్రైవేటు సంస్థలు దీన్ని యథేచ్ఛగా ఉపయోగిస్తున్నాయి. జగన్‌ హయాంలో పెగాసస్‌ తర్వాత అత్యధికంగా ఐఎంఎస్‌ఐ క్యాచర్స్‌ను వాడారన్న ఆరోపణలున్నాయి. ఇప్పుడు కొత్తగా దేశీయంగా క్లియర్‌ ట్రెయిల్‌ సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. ఏఐ ఆధారంగా సెల్‌టవర్‌ నెట్‌వర్క్‌ను జామ్‌ చేయడంతో పాటు వ్యక్తుల సంభాషణను మూడోకంటికి తెలియకుండా వినొచ్చు, రికార్డు చేయవచ్చు. ఇవేవీ ఇప్పుడున్న టెలీగ్రాఫ్‌, ఐటీ చట్టాల పరిధిలో లేవు. కాబట్టి, వీటిని ఉపయోగించి నాడు ప్రతిపక్షం, మీడియా, పౌరహక్కులు, సామాజిక కార్యకర్తల ఫోన్‌లను గుట్టుగా పరిశీలించారని, అనేక మందిపై అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురిచేశారని జగన్‌ ప్రభుత్వంపై ఆరోపణలున్నాయి. టెలీగ్రాఫ్‌ చట్టంలోని సెక్షన్‌ 5(2), సెక్షన్‌ 7(2)(బి)ని ఉల్లంఘించినా, అధికార దుర్వినియోగానికి పాల్పడి ప్రజల వ్యక్తిగత గోప్యత హక్కుపై దాడిచేసినా కనీసం మూడేళ్ల జైలు వంటి కఠిన శిక్షలు ఉన్నాయి. అయితే, ఇవన్నీ చట్టపరిధిలో తప్పు చేశారని నిరూపితమైయితేనే. ఇప్పుడున్న టెక్నాలజీల్లో ఏదీ టెలీగ్రాఫ్‌, ఐటీ చట్టం పరిధిలో లేవు. కాబట్టి వాటిని సొంత ప్రయోజనాలకు వాడుకుంటున్నారు. మారుతున్న టెక్నాలజీ దుర్వినియోగంపై కఠిన చర్యలు ఉండేలా చట్టసవరణలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.


సుప్రీం చీవాట్లు పెట్టినా...

భారత పౌరుల గోప్యత హక్కుకు రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 21 భరోసా ఇస్తోంది. దాన్ని కాలరాసే విధంగా వ్యక్తుల వ్యక్తిగత జీవితాల్లోకి తొంగిచూడకుండా, వారి గోప్యతకు భంగం వాటిల్లనీయకుండా కఠినమైన ఆంక్షలు విధించింది. దేశ భద్రత, సమగ్రత, ప్రజారక్షణ కోసం కరడుగట్టిన నేరస్థులు, అనుమానితులపై చట్టబద్ధమైన అనుమతి తీసుకొని నిఘా పెట్టడానికి టెలీగ్రాఫ్‌ చట్టంలోని సెక్షన్‌ 5(2) వీలుకల్పిస్తోంది. ఉగ్రవాదులు, నక్సలైట్ల కుట్రలు, వ్యూహాలను ముందుగా పసిగట్టి అడ్డుకోవాలన్న సంకల్పంతోనే ఈ క్లాజు ప్రత్యేకమైన సందర్భంలో ట్యాపింగ్‌కు వీలు కల్పిస్తుంది. అయితే, పాలకులు మాత్రం దీన్ని అడ్డంపెట్టుకొని తమ రాజకీయ, వ్యక్తిగత ప్రత్యర్థుల ఫోన్‌ సంభాషణలను గుట్టుగా వింటున్నారు. ఈ చర్య నేరమని 1996లోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు చివాట్లుపెట్టినా, గట్టి హెచ్చరికలు చేసినా ఖాతరు చేయడం లేదు.

Updated Date - Jun 19 , 2025 | 04:33 AM