Healthcare Corruption: నేడూ మారని నాడు
ABN , Publish Date - Jul 11 , 2025 | 03:59 AM
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా ఆరోగ్యశాఖ అధికారుల్లో పాత వాసనలు పోవడంలేదు.
పీజీ సీట్ల బడ్జెట్ నుంచి రూ.కోట్లు మళ్లింపు
765 పీజీ సీట్లకు రూ.756 కోట్లు ఇచ్చిన కేంద్రం
తొలి విడతగా రూ.198 కోట్లు విడుదల
కడప ఆస్పత్రికి మాత్రమే ‘క్యాథ్‌ల్యాబ్’
జగన్ ప్రాపకం కోసం ఒక అధికారి పాకులాట
(అమరావతి - ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా ఆరోగ్యశాఖ అధికారుల్లో పాత వాసనలు పోవడంలేదు. వైసీపీ ప్రభుత్వం ‘నాడు-నేడు’ కింద చేపట్టిన పనులను కొనసాగిస్తూ... వాటికి దొడ్డిదారిన బిల్లులు చెల్లిస్తున్నారు. నేటి ప్రభుత్వం ‘నాడు-నాడు’ను నిలిపివేసిన సంగతి తెలిసీ... అదే పేరుతో ‘కొనుగోళ్లు’ కొనసాగిస్తున్నారు. రాష్ట్రంలో పీజీ సీట్ల పెంపు ప్రక్రియలో భాగంగా రాష్ట్రానికి కేంద్రం కేటాయించిన నిధులను ఇటు మళ్లించి.. ‘గుట్టు’ బయటపడకుండా జాగ్రత్త పడుతున్నారు. వైసీపీ ప్రభుత్వంలో 17 కొత్త మెడికల్ కాలేజీలు, 11 బోధనాస్పత్రుల్లో ‘నాడు - నేడు’ పనులంటూ అప్పట్లో జగన్ హడావుడి చేశారు. కానీ... ఆయన ఒక్క ప్రాజెక్టుకు కూడా పైసా విడుదల చేయకపోవడంతో రూ.కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. మరికొన్ని పనులు కూడా నిలిచిపోయాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పటి పనులను పూర్తిగా రద్దు చేసింది. అప్పుడు ఆరోగ్యశాఖ ఏమి చేయాలి? ప్రభుత్వ ఆదేశాలను పాటించాలి. కానీ, కొన్ని ‘నాడు-నేడు’ పెండింగ్ పనులను కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అధికారులు కొనసాగిస్తున్నారు. డీఎంఈ ఆస్పత్రులకు అవసరమైన రూ. 2 కోట్ల విలువైన అలా్ట్రసౌండ్ మిషన్ల దగ్గర నుంచి బోధనాస్పత్రుల కోసం రూ. మూడు కోట్ల విలువైన అనస్థీసియా వైద్య పరికరాల వరకు కూటమి ప్రభుత్వ వచ్చిన తర్వాతే కొనుగోలు చేశారు.
కేంద్రం నిధులు మళ్లించేశారు
అనంతపురం ప్రభుత్వాస్పత్రిలో ‘నాడు - నేడు’ కింద విలువైన వైద్య పరికరాల కోసం వైసీపీ ప్రభుత్వంలో టెండరు పిలిచి కాంట్రాక్టరును ఎంపిక చేశారు. ఆ తర్వాత ఆ ప్రక్రియ ముందుకు పోలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఆ వైద్య పరికరాల కోసం 2024 నవంబరు- డిసెంబరు నెలల్లో ఇండెంట్ ఇచ్చి సదరు కాంట్రాక్టరు నుంచి వాటిని రెండు విడతల్లో రూ. 8 కోట్ల చొప్పున కొనుగోలు చేశారు. ఆస్పత్రి సూపరిండెంటెండ్, ఏపీఎంఎ్‌సఐడీసీ ఈఈ, బయోమెడికల్ ఇంజనీర్లు ఒకసారి, ఆరోగ్యశాఖ అధికారులు మరోసారి ఇండెంట్ ఇచ్చి కొనుగోళ్లు జరిపారు. ప్రభుత్వ ఆదేశాలు బేఖాతరు చేసి మరీ ఈ వ్యవహారం నడిపించారు. మరి బిల్లులు ఎలా చెల్లించాలి? అప్పటి పనులన్నీ రద్దుచేయడంతో ప్రభుత్వం నుంచి రూపాయి కూడా మంజూరయ్యే అవకాశం లేదు. మరి ఏం చేయాలి? ఈ సమయంలో పీజీ సీట్ల నిధులు ఆరోగ్యశాఖ వరంలా కనిపించాయి. రాష్ట్రంలో దాదాపు 750 కొత్త సీట్ల కోసం కేంద్రం రూ.756 కోట్లు కేటాయించింది.
అందులో రూ.198 కోట్లు తొలి విడత కింద విడుదల చేసింది. ఈ నిధులే కొందరు అధికారుల పాలిట వరంగా మారాయి. ‘నాడు - నేడు’ కింద కొనుగోలు చేసిన వైద్య పరికరాలకు, చేపట్టిన నిర్మాణాలకు, ఇతర వాటికి ఈ నిధుల నుంచి చెల్లింపులు చేసేస్తున్నారు. ఇలా...ఇప్పటి వరకూ దాదాపు రూ.50 కోట్లు పైనే చెల్లింపులు చేసినట్లు తెలుస్తోంది. అనంతపురం మెడికల్ కాలేజీ అధికారులు కూడా ఈ నిధుల్నే బిల్లుల చెల్లింపునకు మళ్లించారు.
ఫేక్ యుసీలు
మెడికల్ కాలేజీల్లో కొత్తగా పీజీ సీట్లు పెంచాలంటే కొన్ని సౌకర్యాలు కల్పించాలి. కొత్త భవనాలు, కొన్ని వైద్య పరికరాలు తప్పనిసరి. వీటి కోసం కేంద్ర ప్రభుత్వం కొన్ని నిధులు కేటాయిస్తుంది. ఈ నిధులు కేటాయించాలంటే, ఏ అవసరాలకు ఆ నిధులు ఖర్చు చేస్తారనేది కేంద్రానికి సవివర ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్) అందించాలి. డీపీఆర్ ప్రకారమే ఆ నిధులు ఖర్చు చేయాలి. ఖర్చు చేసిన నిధులకు సంబంధించిన యుటిలైజేషన్ సర్టిఫికెట్లను (యూసీలు) కేంద్రానికి పంపించాలి. యూసీలు కేంద్రానికి పంపించిన తర్వాతే రెండో విడత నిధులు కేంద్రం విడుదల చేస్తుంది. అయితే, ఆరోగ్యశాఖ తొలి విడతలో ఖర్చు చేసిన రూ.198 కోట్లకు ఇచ్చిన యూసీలు మొత్తం ఫేక్ అని తెలుస్తోంది.
అంతా ఇష్టారాజ్యం..
డిపార్ట్‌మెంట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) అధికారులు తాము ఏమీ చేసినా ప్రశ్నించేవారే లేరన్నట్లు వ్యవహరిస్తున్నారు. అనంతపురం బోధనాస్పత్రిలో రూ. ఎనిమిది కోట్ల విలువైన వైద్య పరికరాల కొనుగోలు వ్యవహారంలో పాత సూపరిండెంటెంట్, ఏపీఎంఎ్‌సఐడీసీ ఈఈ, బయోమెడికల్ ఇంజనీర్‌తో పాటు మరికొంత మంది అధికారుల పాత్ర ఉంది. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలి. అయితే, విచిత్రంగా డీఎంఈ అధికారులు వారికి పదోన్నతులు కల్పిస్తున్నారు. వైద్య పరికరాల కొనుగోలుకు ఇండెంట్ పెట్టిన బయోమెడికల్ ఇంజనీర్‌కు పదోన్నతి కల్పించి డీఎంఈ కార్యాలయంలో పోస్టింగ్ ఇచ్చారు. ప్రజాధనం వృథా అయిందని తెలిసినా సదరు బయో మెడికల్ ఇంజనీర్ కనీసం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురాలేదు, పైగా వైద్య పరికరాల కొనుగోలుకు ఆయనే ఇండెంట్ పెట్టారు. ఇలాంటి ఉద్యోగికి కీలకమైన డీఎంఈ కార్యాలయంలో పోస్టింగ్ ఇవ్వడంపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
జగన్ ప్రాపకం కోసం..
ఆరోగ్యశాఖలోని ఓ కీలకమైన అధికారి జగన్ ప్రాపకం కోసం ఏకంగా కేంద్రం నిధులు కూడా మళ్లించేందుకు సిద్ధమయ్యారు. రాష్ట్రంలో ఏ ఆస్పత్రిలో లేని వైద్య పరికరాలు జగన్ సొంత జిల్లా కడప ఆస్పత్రిలోనే ఉండాలనేది ఆయన కోరిక. శ్రీకాకుళం, ఒంగోలు, కడప ఆస్పత్రుల్లో క్యాథ్‌ల్యాబ్‌లు ఏర్పాటు చేయాలనేది నిర్ణయం. అయితే, మిగతా రెండు ప్రాంతాలను వదిలేసి.. ప్రత్యేకంగా కడపపైనే సదరు అధికారి ఫోకస్ పెట్టారు. కడపలో క్యాథ్‌ల్యాబ్ ఏర్పాటుకు ఎక్కడా అంతరాయం కలగకూడదని, దానికోసం పీజీ సీట్ల నిధుల నుంచి చెల్లింపులు చేయాలని ఆదేశించారు. ఫేక్ యూసీలు కేంద్రానికి పంపించి..పీజీ సీట్ల నిధులతో కడపలో క్యాథ్‌ల్యాబ్ ఏర్పాటుకు సిద్ధమయిపోయారు.