Share News

Deputy CM Pawan Kalyan: యోగాతో ఒత్తిడిపై విజయం

ABN , Publish Date - Jun 22 , 2025 | 06:17 AM

యోగా సాధన చేస్తే ఒత్తిడిని జయించి, ద్రుఢంగా మారి అనుకున్న లక్ష్యాలను సాధించగలుగుతారని దానికి నిలువెత్తు నిదర్శనం ప్రధాని నరేంద్ర మోదీ అని ఉప ముఖ్యమంత్రి కె.పవన్‌ కల్యాణ్‌ అన్నారు.

Deputy CM Pawan Kalyan: యోగాతో ఒత్తిడిపై విజయం

  • అనుకున్న లక్ష్యాలు సాధించవచ్చు: పవన్‌

విశాఖపట్నం, జూన్‌ 21(ఆంధ్రజ్యోతి): యోగా సాధన చేస్తే ఒత్తిడిని జయించి, ద్రుఢంగా మారి అనుకున్న లక్ష్యాలను సాధించగలుగుతారని దానికి నిలువెత్తు నిదర్శనం ప్రధాని నరేంద్ర మోదీ అని ఉప ముఖ్యమంత్రి కె.పవన్‌ కల్యాణ్‌ అన్నారు. విశాఖ ఆర్కే బీచ్‌రోడ్డులో శనివారం ఉదయం జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవ సభలో ఆయన ప్రసంగించారు. ఆదియోగి పరమశివుడు యోగా సాధన చేసేవారని, దానిని పతంజలి శాస్త్రంగా మార్చి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారని వివరించారు. యోగా విశిష్టతను, గొప్పతనాన్ని రుగ్వేదం వివరిస్తే దానిని ప్రపంచవ్యాప్తం చేసిన దార్శనికులు ప్రధాని మోదీ అన్నారు. భారతీయ సనాతన ధర్మం యోగా ద్వారా విశ్వ వ్యాప్తమైందని చెప్పారు.


అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించాలని ప్రధానిగా మోదీ 2014లో ఐక్యరాజ్య సమితిలో ప్రతిపాదిస్తే ఆ మరుసటి ఏడాదే అనేక దేశాలు దీనిని ఆచరణలో చూపించాయని తెలిపారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి విశాఖ వేదిక కావడం గొప్ప విషయం అన్నారు. సీఎం చంద్రబాబు పట్టుదలతో దీనిని ఒక రికార్డుగా చేయాలని సంకల్పించి మోదీ సమక్షంలోనే నిర్వహించడం గర్వకారణమన్నారు. ఇదే వేదిక నుంచి ‘ఒక భూమి... ఒక ఆరోగ్యం’ నినాదాన్ని ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకువెళ్లాలని పవన్‌ కోరారు.

Updated Date - Jun 22 , 2025 | 06:17 AM