Share News

Deputy CM Pawan Kalyan : పళని-తిరుమల

ABN , Publish Date - Feb 15 , 2025 | 06:01 AM

శుక్రవారం షష్ఠ షణ్ముఖ క్షేత్రాల్లో ఒక్కటైన పళని మురుగన్‌ ఆలయాన్ని సందర్శించుకున్న అనంతరం పవన్‌ మీడియాతో మాట్లాడారు.

Deputy CM Pawan Kalyan : పళని-తిరుమల

  • రవాణా సదుపాయంపై దృష్టి పెడతా

  • ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌

  • పళని, తిరుప్పరంకుండ్రం మురుగన్‌, మదురై మీనాక్షి ఆలయాల సందర్శన

చెన్నై, ఫిబ్రవరి 14(ఆంధ్రజ్యోతి): ‘పళని సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రం నుంచి తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయానికి భక్తులు సులభంగా వచ్చేలా రవాణా సదుపాయం కల్పించడంపై దృష్టిపెడతాం. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలియజేసి, కేబినెట్‌ దృష్టికి తీసుకెళ్తా’ అని ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు. శుక్రవారం షష్ఠ షణ్ముఖ క్షేత్రాల్లో ఒక్కటైన పళని మురుగన్‌ ఆలయాన్ని సందర్శించుకున్న అనంతరం పవన్‌ మీడియాతో మాట్లాడారు. ‘ఇటీవల మహారాష్ట్రలో పర్యటించినప్పుడు కూడా అక్కడి నుంచి తిరుపతి వచ్చేందుకు ప్రత్యేక రైలు వేయాలని అక్కడి ప్రజలు, ప్రజాప్రతినిధులు కోరారు. దీనిపై ఇప్పటికే రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ దృష్టికి తీసుకెళ్లా. అలాగే పళని-తిరుమల మధ్య రవాణాపై కూడా దృష్టిపెడతా. తమిళనాడులోని ఆరు ప్రసిద్ధ సుబ్రహ్మణ్యస్వామి ఆలయాలను దర్శించుకోవాలన్న తలంపుతో ఇక్కడికి వచ్చా. రాజకీయ అంశాలపై మాట్లాడేందుకు ఇది తగిన సమయం కాదు’ అని పవన్‌ స్పష్టం చేశారు.


భక్తి పారవశ్యంలో పవన్‌ కల్యాణ్‌

దండాయుధపాణిగా, పళనిస్వామిగా, మురుగన్‌గా పిలుచుకునే సుబ్రహ్మణస్వామి సేవలో తరించిన పవన్‌ భక్తిపారవశ్యంలో ఓలలాడారు. దక్షిణ భారత ఆలయాల సందర్శనలో భాగంగా బుధవారం కేరళ వెళ్లిన పవన్‌.. గురువారం తమిళనాడులోని తంజావూరు, కుంభకోణం, తిరుచ్చెందూర్‌ ఆలయాలను సందర్శించిన విషయం తెలిసిందే. శుక్రవారం ఆర్ములిగు దండాయుధపాణి స్వామి వారి క్షేత్రంలో ఉచ్ఛకాల పూజలో పాల్గొన్నారు. రోప్‌ వే ద్వారా ఆలయానికి చేరుకున్న పవన్‌కు ఆలయ అధికారులు, అర్చకులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. పళనిలోని అత్యంత ముఖ్యమైన పండుగగా పరిగణించే తాయ్‌-పూసం, తమిళ్‌ తాయ్‌ నెల (జనవరి 15 - ఫిబ్రవరి 15) పౌర్ణమి రోజున జరుపుకుంటారు. ఈ కీలకమైన పండుగ పౌర్ణమి రోజుల్లో మురుగన్‌ను దర్శించుకున్న పవన్‌.. ఆధ్యాత్మికానందంలో తేలియాడారు. ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పవన్‌కు ఆలయ పండితులు దైవిక మిశ్రమంగా పిలిచే తేనె, ఖర్జూరం, అరటిపండు, ఎండుద్రాక్ష, బెల్లం కలిపిన పంచమిర్దం అందించారు. అనంతరం పవన్‌ అదే ఆవరణలో వున్న శివాలయంలోనూ పూజలు నిర్వహించారు.


తిరుప్పరంకుండ్రం మురుగన్‌ సేవలో...

శివుడు, విష్ణువు అభిముఖంగా శ్రీవల్లి దేవసేన సమేతంగా శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారు వెలసిన తిరుప్పరంకుండ్రం దివ్యక్షేత్రాన్ని కూడా పవన్‌కల్యాణ్‌ సందర్శించారు. శ్రీదుర్గా శక్తితో పాటు సోదరుడైన శ్రీసత్య గణపతి స్వామివారి చెంతనే ఈ క్షేత్రంలో వెలసిన సుబ్రహ్మణ్యుడు భక్తులను కటాక్షిస్తున్నారు. మదురై సమీపంలో వున్న ఆ ఆలయాన్ని పవన్‌.. శుక్రవారం సందర్శించుకున్నారు. అక్కడున్న శ్రీవల్లిదేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారికి పవన్‌ మోకరిల్లి మొక్కులు చెల్లించుకున్నారు. కాగా, ద్రవిడ వారస ప్రతీకగా, దక్షిణ భారదేశంలోని అత్యంత అపురూపమైన దేవాలయంగా పరిగణించే మదురై మీనాక్షి ఆలయాన్నిపవన్‌ కల్యాణ్‌ దర్శించుకున్నారు. మీనాక్షి సోమ సుందరేశ్వరన్‌లకు ప్రత్యేక పూజలు చేశారు. మొక్కులో భాగంగా అమ్మవారికి సారె, చీరను, పుష్పాలు, ఫలాలను సమర్పించారు.


ఎమ్మెల్సీ ఎన్నికలకు జనసేన సమన్వయకర్తలు

గ్రాడ్యుయేట్‌ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి జనసేన పార్టీ తరఫున పార్లమెంట్‌ నియోజకవర్గాల వారిగా సమన్వయకర్తలను నియమించారు. తొమ్మిది నియోజకవర్గాలకు సమన్వయకర్తలను నియమించినట్లు ఎమ్మెల్సీ పి.హరిప్రసాద్‌ తెలిపారు. కాకినాడకి తుమ్మల రామస్వామి, రాజమండ్రికి యర్నాగుల శ్రీనివాసరావు, అమలాపురంకి బండారు శ్రీనివాసరావు, నరసాపురంకి చన్నమల్ల చంద్రశేఖర్‌, ఏలూరుకి రెడ్డి అప్పలనాయుడు, విజయవాడకి వాసు, మచిలీపట్నంకి బండి రామకృష్ణ, గుంటూరుకి నయబ్‌కమల్‌, నరసరావుపేటకి మార్కండేయ బాబును నియమించారు.

Updated Date - Feb 15 , 2025 | 06:03 AM