Share News

పధాని దార్శనిక నాయకత్వంతోనే..: డిప్యూటీ సీఎం పవన్‌

ABN , Publish Date - May 26 , 2025 | 04:04 AM

పదాని మోదీ దార్శనిక నాయకత్వంతో భారత్‌ నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని డిప్యూటీ సీఎం పవన్‌ అన్నారు. వికసిత భారత్‌-2047 సాధనకు ఇది కీలక అడుగని ట్వీట్‌ చేశారు.

పధాని దార్శనిక నాయకత్వంతోనే..: డిప్యూటీ సీఎం పవన్‌

  • వికసిత భారత్‌వైపు నడిపించడానికి కీలకమైన అడుగని ట్వీట్‌

  • ఇద్దరు మహారాష్ట్ర డిప్యూటీ సీఎంలతో కలసి మోదీతో భోజనం

అమరావతి/న్యూఢిల్లీ, మే 25(ఆంధ్రజ్యోతి): ప్రధాని మోదీ దూరదృష్టి నాయకత్వంలో భారత్‌ ప్రపంచంలోనే అతిపెద్ద నాలుగో ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ అన్నారు. ఢిల్లీలో ఆదివారం జరిగిన ఎన్డీయే సీఎంలు, ఉప ముఖ్యమంత్రుల సదస్సులో ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు. ఈ చారిత్రక విజయం ప్రధాని మోదీ దార్శనిక నాయకత్వం, 2014 నుంచి ఎన్డీయే ప్రభుత్వ ప్రగతిశీల పాలనకు నిదర్శనమని కొనియాడారు. ఎన్డీయే సుపరిపాలనతో భారత్‌ అనేక రంగాల్లో వృద్ధి సాధించిందన్నారు. ‘ఇది కేవలం ఆర్థిక విజయమే కాదు. ప్రపంచంలో నవ భారత్‌కు పెరుగుతున్న ప్రాముఖ్యతను ప్రతిబింబిస్తోంది. మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగడానికి, వికసిత భారత్‌-2047 వైపు నడిపించడానికి ముఖ్యమైన అడుగు’ అని ఎక్స్‌లో చేసిన ట్వీట్‌లో పవన్‌ పేర్కొన్నారు. అంతకుముందు ఎన్డీయే నేతలతో కలసి ‘మన్‌ కీ బాత్‌’ కార్యక్రమంలో పాల్గొన్నారు. మధ్యాహ్నం ప్రధాని ఏర్పాటు చేసిన విందు కార్యక్రమానికి హాజరయ్యారు. మోదీతో పాటు మహారాష్ట్ర డిప్యూటీ సీఎంలు ఏక్‌నాథ్‌ షిండే, అజిత్‌ పవార్‌తో కలిసి భోజనం చేశారు. ఈ సమావేశం అనంతరం పవన్‌ మీడియాతో మాట్లాడారు. ఆపరేషన్‌ సిందూర్‌ విజయం పట్ల భారత సైన్యానికి అభినందనలు తెలుపుతూ, జన గణనలో కులగణనకు కేంద్రం నిర్ణయం తీసుకున్నందుకు ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం చేసినట్లు వివరించారు.

Updated Date - May 26 , 2025 | 04:06 AM