Tadimarri Mandal: తాడిమర్రి మండలంలో మిషన్ అన్వేషణ్
ABN , Publish Date - Jun 28 , 2025 | 02:39 AM
శ్రీ సత్యసాయి జిల్లా తాడిమర్రి మండలంలో గ్యాస్ నిక్షేపాల కోసం ఓఎన్‌జీసీ అధికారులు ‘మిషన్ అన్వేషణ్’ చేపట్టారు.
శ్రీ సత్యసాయి జిల్లాలో గ్యాస్ నిక్షేపాల కోసం ఓఎన్‌జీసీ సర్వే
తాడిమర్రి, జూన్ 27(ఆంధ్రజ్యోతి): శ్రీ సత్యసాయి జిల్లా తాడిమర్రి మండలంలో గ్యాస్ నిక్షేపాల కోసం ఓఎన్‌జీసీ అధికారులు ‘మిషన్ అన్వేషణ్’ చేపట్టారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి జూన్ వరకు సర్వే నిర్వహించేందుకు అనుమతి తీసుకున్నామని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఇందులో భాగంగా తాడిమర్రి మండలంలోని రైతులకు సంబంధించిన బీడు భూముల్లో 250 అడుగుల లోతు వరకు బోర్లు వేస్తారు. అందులో నీరు పడితే రైతుకే ఉచితంగా బోరు బావిని వదిలేస్తారు. నీరు పడనప్పుడు ఆ బోరు బావిలో 60 నుంచి 160 అడుగుల లోతులో 4 నుంచి 7.5 కిలోల డైనమైట్స్ పేలుస్తారు.
తద్వారా వచ్చే వాయివును ఒడిసిపట్టుకుని పరీక్షలు నిర్వహిస్తారు. అందులో ఓఎన్‌జీసీకి అనుకూల ఫలితాలు వస్తే, ఆ బోరుబావిని స్వాధీనం చేసుకుంటామని చెబుతున్నారు. ఈ విషయమై తాడిమర్రి తహసీల్దారు భాస్కర్ రెడ్డిని వివరణ కోరగా.. పంట ఉన్న భూములలో సర్వే కోసం బోర్లు వేసే ప్రయత్నం చేస్తే రైతులు తమ దృష్టికి తీసుకురావాలని, నష్ట పరిహారం ఇప్పిస్తామని చెప్పారు.