తిరుమలలో క్యూలైన్లను పరిశీలించిన ఏకసభ్య కమిషన్
ABN , Publish Date - Mar 16 , 2025 | 05:26 AM
తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీ సమయంలో జరిగిన తొక్కిసలాట ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఏకసభ్య న్యాయ విచారణ కమిషన్...

భక్తులు క్యూలైన్లలో ప్రవేశించే విధానంపై ఆరా
తిరుమల, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీ సమయంలో జరిగిన తొక్కిసలాట ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఏకసభ్య న్యాయ విచారణ కమిషన్ శనివారం తిరుమలలోని క్యూలైన్ల నిర్వహణను పరిశీలించింది. శుక్రవారం తిరుమలకు చేరుకున్న కమిషన్ చైర్మన్ సత్యనారాయణమూర్తి, డిప్యూటీ కలెక్టర్ సుధారాణి, లైజన్ ఆఫీసర్ రూప్‌చంద్, కమిషన్ సభ్యులతో కలిసి శనివారం ఉదయం ఔటర్ రింగ్‌రోడ్డులోని సర్వదర్శన భక్తుల క్యూలైన్‌లోకి ప్రవేశించి పరిశీలించారు. అక్కడ భక్తులు క్యూలైన్‌లోకి ప్రవేశించే విధానంపై కమిషన్‌కు వైకుంఠం క్యూకాంప్లెక్స్ ఏఈవో శ్రీహరి, విజిలెన్స్ ఏవీఎస్వో విశ్వనాథం వివరించారు. అనంతరం నారాయణగిరి షెడ్ల వద్దకు చేరుకుని క్యూలైన్లను పరిశీలించారు. తర్వాత వైకుంఠం క్యూకాంప్లెక్స్-2లో సీసీటీవీ రూమ్‌ను, తర్వాత వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని 13, 14, 15, 16, 17 నంబర్ల కంపార్లుమెంట్లను పరిశీలించారు. భక్తులు కంపార్టుమెంట్‌లోకి ప్రవేశం, నిష్క్రమణ, దర్శనం కోసం నిరీక్షించే విధానాన్ని చూశారు. దర్శనానికి భక్తులను విడిచిపెట్టే క్రమంలో తోపులాటలు జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారనే అధికారులను అడిగారు. భవిష్యత్తులో తిరుమలలోని క్యూలైన్లలో తొక్కిసలాటల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నివేదికను ప్రభుత్వానికి సమర్పించనున్నారు.