Share News

AP Government: నేడే తల్లికి వందనం

ABN , Publish Date - Jun 12 , 2025 | 03:49 AM

సూపర్‌ సిక్స్‌ హామీల్లో మరో కీలక పథకం అమలుకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తయిన సందర్భంగా ‘తల్లికి వందనం’ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది.

AP Government: నేడే తల్లికి వందనం

  • 67.27 లక్షల మంది విద్యార్థులకు 8,745 కోట్లు

  • వారి తల్లుల ఖాతాల్లో జమ చేయనున్న ప్రభుత్వం

అమరావతి, జూన్‌ 11(ఆంధ్రజ్యోతి): సూపర్‌ సిక్స్‌ హామీల్లో మరో కీలక పథకం అమలుకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తయిన సందర్భంగా ‘తల్లికి వందనం’ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన ప్రకారం ప్రతి విద్యార్థికి రూ.15 వేలు చొప్పున నిధులు విడుదల చేయనుంది. మొత్తం 67,27,164 మంది విద్యార్థుల తల్లులకు రూ.8,745 కోట్లు ఈ నెల 12న జమ చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. కాగా, మరుగుదొడ్ల నిర్వహణ నిధికి రూ.1,000, పాఠశాల నిర్వహణ నిధి కోసం మరో రూ.1,000 చొప్పున మినహాయించి మిగిలిన రూ.13వేలు ఖాతాలో జమ చేయాలని నిర్ణయించారు. ఈ పథకంపై ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం సమీక్షించారు. అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నిధులు జమ చేయాలన్నారు. పథకానికి నిధుల ఇబ్బంది తలెత్తకుండా చూడాలని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ను సీఎం ఆదేశించారు. ఇప్పటికే గుర్తించిన విద్యార్థులతో పాటు ఒకటో తరగతిలో, ఇంటర్‌ ఫస్టియర్‌లో అడ్మిషన్‌ పొందిన విద్యార్థులకు కూడా పథకం అమలు చేయాలని స్పష్టం చేశారు. పథకం అమలులో ఇబ్బందులు లేకుండా సంబంధిత శాఖలు సమన్వయం చేసుకోవాలని సూచించారు. సాంకేతిక కారణాలతో ఎవరైనా విద్యార్థుల పేర్లు లేకపోతే దరఖాస్తుకు అవకాశం కల్పించి, నిధులు విడుదల చేస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. కాగా, గత వైసీపీ ప్రభుత్వం చివరిసారిగా 2023లో ‘అమ్మ ఒడి’ పథకం అమలు చేసింది. అప్పట్లో 83,15,341 మంది విద్యార్థులకు సంబంధించి 42,61,965 మంది తల్లులకు రూ.6,392.94 కోట్లు విడుదల చేసింది.


తల్లులకు లోకేశ్‌ అభినందనలు

విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న సందర్భంగా విద్యార్థుల తల్లులకు మంత్రి లోకేశ్‌ అభినందనలు తెలిపారు. ‘విద్యార్థులకు శుభాకాంక్షలు. అందరికీ గుడ్‌ న్యూస్‌. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుంటున్న శుభవేళ తల్లికి వందనం పథకం అమలుకు శ్రీకారం చుడుతున్నాం. చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే అందరికీ ఈ పథకం వర్తిస్తుంది’’ అని ‘ఎక్స్‌’లో చేసిన పోస్టులో లోకేశ్‌ పేర్కొన్నారు.

Updated Date - Jun 12 , 2025 | 08:40 AM