Share News

AP High Court: అనధికార వీధి వ్యాపారులకు షాక్‌

ABN , Publish Date - Jul 17 , 2025 | 04:19 AM

అనధికారిక వీధి వ్యాపారులకు హైకోర్టు గట్టి షాకిచ్చింది. లైసెన్స్‌ లేనివారిని ఆయా ప్రాంతాల్లో వ్యాపారం చేసేందుకు అనుమతించవద్దని అధికారులకు తేల్చిచెప్పింది

 AP High Court: అనధికార వీధి వ్యాపారులకు షాక్‌

  • లైసెన్స్‌ లేనివారిని అనుమతించొద్దు

  • కొత్తగా లైసెన్స్‌లు జారీ చేయొద్దు

  • ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

అమరావతి, జూలై 16(ఆంధ్రజ్యోతి): అనధికారిక వీధి వ్యాపారులకు హైకోర్టు గట్టి షాకిచ్చింది. లైసెన్స్‌ లేనివారిని ఆయా ప్రాంతాల్లో వ్యాపారం చేసేందుకు అనుమతించవద్దని అధికారులకు తేల్చిచెప్పింది. వీధి వ్యాపారుల జీవనోపాధి రక్షణ, విక్రయాల నియంత్రణ చట్టం-2014లోని నిబంధనల అమలుకు ప్రణాళిక సిద్ధం చేసేవరకు కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో వీధి వ్యాపారులకు కొత్తగా లైసెన్స్‌లు జారీ చేయొద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. నియంత్రణ లేకుండా వీధి వ్యాపారాలకు అనుమతిస్తూ పోతే నగరాలు మురికివాడలుగా మారతాయని వ్యాఖ్యానించింది. వీధి వ్యాపారుల జీవనోపాధి ముఖ్యమే అయినప్పటికీ అది ఆయా ప్రాంతాల్లో నివసించేవారికి ఇబ్బంది కలిగించేలా ఉండకూడదని పేర్కొంది. కొన్ని ప్రాంతాల్లో అత్యవసర సర్వీసులైన అంబులెన్స్‌, ఫైర్‌ సర్సీసులు వెళ్లలేని పరిస్థితి ఉందని తెలిపింది. వీధి వ్యాపారం చేసేవారికి వెనుక వ్యవస్థీకృత దళారుల పాత్రను కొట్టిపారేయలేమని, అలాంటి వారిని అధికారులు ఎందుకు నియంత్రించలేకపోతున్నారని ప్రశ్నించింది. వీధి వ్యాపారుల చట్టం అమలుకు తీసుకున్న చర్యలపై అఫిడవిట్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. విచారణను ఆగస్టు 13కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌, జస్టిస్‌ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు ఇచ్చింది. విజయవాడ బీసెంట్‌ రోడ్డు మధ్యలో, ఇరువైపులా ఆక్రమించి చట్టవిరుద్ధంగా వ్యాపారాలు నిర్వహిస్తున్న వీధి వ్యాపారులు, హాకర్లపై చర్యలు తీసుకొనేలా మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులను ఆదేశించాలని కోరుతూ బీసెంట్‌ రోడ్‌ బిల్డింగ్‌ ఓనర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ ఎం.వెంకట విజయప్రసాద్‌ పిల్‌ దాఖలు చేశారు. విశాఖపట్నం పాత జైలు రోడ్డులో జీవీఎంసీ అనుమతులు లేకుండా అనధికారికంగా నైట్‌ ఫుడ్‌ కోర్టును నిర్వహిస్తున్నా, జీవీఎంసీ కమిషనర్‌ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటూ జనసేన కార్పొరేటర్‌ పీవీఎల్‌ఎన్‌ మూర్తి యాదవ్‌ పిల్‌ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలు బుధవారం విచారణకు రాగా పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది కె.ఎస్‌. మూర్తి, న్యాయవాది డి. హర్షవర్ధన్‌ వాదనలు వినిపించారు. విజయవాడ కార్పొరేషన్‌ తరఫున స్టాండింగ్‌ కౌన్సిల్‌ శివరామ్‌ వాదనలు వినిపించారు.

Updated Date - Jul 17 , 2025 | 04:19 AM