Share News

మహిళలపై వ్యాఖ్యలు చేసిన వారిని వదలం

ABN , Publish Date - Jun 19 , 2025 | 06:35 AM

అమరావతి రాజధాని ప్రాంతంలో ఉన్న మహిళలపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన వారిని వదిలే ప్రసక్తి లేదని జాతీయ మహిళా కమిషన్‌ సభ్యురాలు అర్చనా మజుందార్‌ తెలిపారు.

మహిళలపై వ్యాఖ్యలు చేసిన వారిని వదలం

  • జాతీయ మహిళా కమిషన్‌ సభ్యురాలు అర్చనా మజుందార్‌

గుంటూరు సిటీ, జూన్‌ 18(ఆంధ్రజ్యోతి): అమరావతి రాజధాని ప్రాంతంలో ఉన్న మహిళలపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన వారిని వదిలే ప్రసక్తి లేదని జాతీయ మహిళా కమిషన్‌ సభ్యురాలు అర్చనా మజుందార్‌ తెలిపారు. ఇక్కడ జరిగిన పరిణామాలను జాతీయ కమిషన్‌ చైర్‌పర్సన్‌తో పాటు, సంబంధిత శాఖల దృష్టికి తీసుకువెళ్లి తగిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. కొమ్మినేని శ్రీనివాసరావు, కృష్ణంరాజు, సజ్జల రామకృష్ణా రెడ్డి, సాక్షి మీడియాపై ఆమెకు అమరావతి మహిళలు, రైతులు రాతపూర్వకంగా ఫిర్యాదు అందజేశారు. అమరావతి మహిళలను రాక్షసులు.. పిశాచులు.. సంకరజాతికి చెందిన వారుగా సజ్జల అభివర్ణించారని తెలిపారు.


రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన తమను జగన్‌ ఎన్నో విధాలుగా ఇబ్బందులు పెట్టారని కొందరు కమిషన్‌ ఎదుట కన్నీళ్లు పెట్టుకున్నారు. అమరావతి రాజధాని మహిళలను చూసిన వెంటనే... ‘మిమ్మల్ని చూడటం ఆనందంగా ఉంద’ని అర్చనా మజుందార్‌ అన్నారు. ‘ఇక్కడకు రాక ముందు మీ గురించి విన్నాను. ఇప్పుడు ప్రత్యక్షంగా చూడటం మరింత ఆనందాన్ని కలిగించింది’ అని ఆమె అన్నారు. రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ రాయపాటి శైలజ యాక్టివ్‌.. ప్రతి విషయాన్ని చక్కగా అర్థం చేసుకుని.. వివరించగలరని అభినందించారు.

Updated Date - Jun 19 , 2025 | 06:35 AM