Share News

Margadarsi Finance: మార్గదర్శిపై కేసు అవసరం లేదు

ABN , Publish Date - Aug 05 , 2025 | 05:40 AM

రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఆర్బీఐ చట్టానికి విరుద్ధంగా డిపాజిట్లు సేకరించారన్న ఆరోపణల కేసులో మార్గదర్శి

Margadarsi Finance: మార్గదర్శిపై కేసు అవసరం లేదు

  • రామోజీరావు మరణం నేపథ్యంలో కొనసాగించాల్సిన పనిలేదు

  • ఊరట కలిగించిన టీ హైకోర్టు.. క్వాష్‌ పిటిషన్లకు అనుమతి

  • మేజిస్ట్రేటు కోర్టులోని కేసు కొట్టివేత

హైదరాబాద్‌, ఆగస్టు 4(ఆంధ్రజ్యోతి): రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) చట్టానికి విరుద్ధంగా డిపాజిట్లు సేకరించారన్న ఆరోపణల కేసులో మార్గదర్శి ఫైనాన్షియర్స్‌కు సోమవారం హైకోర్టులో ఊరట లభించింది. ఆ సంస్థ యజమాని రామోజీరావు మరణం నేపథ్యంలో ఇక ఆ సంస్థపై కేసు అవసరం లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ సంస్థ దాఖలు చేసిన రెండు క్వాష్‌ పిటిషన్లను అనుమతించింది. ఆ కారణంగా మార్గదర్శిపై నాంపల్లి మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేటు కోర్టులో ఉన్న కేసును కొట్టివేస్తూ జస్టిస్‌ శ్యాంకోషీ, జస్టిస్‌ కే సుజనల ధర్మాసనం నిర్ణయాన్ని వెలువరించింది. దాదాపు 24 ఏళ్ల కింద అప్పటి ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో మార్గదర్శి అక్రమ డిపాజిట్ల ఆరోపణలపై క్రిమినల్‌ చర్యలను ప్రారంభించారు. 2008లో ట్రయల్‌ కోర్టులో కేసు విచారణ ప్రారంభమైంది. ఈ కేసును కొట్టివేయాలని మార్గదర్శి ఉమ్మడి ఏపీ హైకోర్టులో 2011లో పిటిషన్లు దాఖలు చేసింది. వాటిపై విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ టీ రజనీ ధర్మాసనం.. మార్గదర్శికి అనుకూలంగా 2018 డిసెంబర్‌ 31న తీర్పు ఇస్తూ కేసును కొట్టివేసింది. దీన్ని సవాల్‌ చేస్తూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. ఈ కేసును మళ్లీ సమగ్రంగా విచారించాలని తెలంగాణ హైకోర్టును ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే మార్గదర్శి దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్లపై జస్టిస్‌ శ్యాంకోషీ, జస్టిస్‌ కే సుజన ధర్మాసనం విచారించింది. ఈ క్రమంలోనే మార్గదర్శి సంస్థ యజమాని రామోజీరావు మరణించారు. మార్గదర్శి తరఫున అన్నీ తానై వ్యవహరించిన రామోజీరావు మరణించిన తర్వాత క్రిమినల్‌ కేసు కొనసాగడానికి అవకాశం లేదని, క్రిమినల్‌ కేసుల్లో వారసులపై చర్యలు తీసుకోవడం అనేది ఉండదని మార్గదర్శి సంస్థ మధ్యంతర అప్లికేషన్లు దాఖలు చేసింది. పిటిషనర్‌ అయిన మార్గదర్శి సంస్థ తరఫున సీనియర్‌ న్యాయవాదులు ఎస్‌ నాగముత్తు, ముకుల్‌ రోహత్గీ, సిద్దార్థ లూథ్రా, ఆర్బీఐ తరఫున సీనియర్‌ న్యాయవాది ఎల్‌ రవిచందర్‌, తెలంగాణ తరఫున పీపీ పల్లె నాగేశ్వర్‌రావు, ఏపీ తరఫున ఏపీ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది రాజేశ్వర్‌రెడ్డి వాదించారు. అన్ని పిటిషన్‌లపై విచారణ చేపట్టి ఈ ఏడాది మార్చి 7న ధర్మాసనం తీర్పు రిజర్వు చేసింది. తాజాగా సోమవారం తుది తీర్పు వెలువరించింది. అసలు ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు చనిపోయిన నేపథ్యంలో ఇక మార్గదర్శి సంస్థపై కేసు కొనసాగించలేమని స్పష్టం చేసింది.


ఈ వార్తలు కూడా చదవండి..

మందు బాబులకు గుడ్ న్యూస్

కవితకు షాక్ ఇచ్చిన కోర్టు

For More AP News and Telugu News

Updated Date - Aug 05 , 2025 | 05:40 AM