Nara Lokesh: ఏపీకి ఊపిరి అందించారు
ABN , Publish Date - Jan 09 , 2025 | 04:28 AM
గడిచిన ఐదేళ్లలో వైసీపీ అసమర్థ పాలనతో రాష్ట్రం వెంటిలేటర్‌పైకి వెళ్లిపోయిందని, అటువంటి రాష్ట్రానికి ప్రధానిమోదీ ఆక్సిజన్ అందించి మళ్లీ కోలుకునేలా చేశారని రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ కొనియాడారు.
అవసరమైన నిధులిచ్చి ప్రధాని ఆదుకుంటున్నారు
భారత్ వైపు ప్రపంచం చూసేలా చేసిన ఘనత మోదీదే
వికసిత్ భారత్ స్ఫూర్తితో స్వర్ణాంధ్ర-2047 హామీల అమలుకు చంద్రబాబు శ్రమిస్తున్నారు: మంత్రి నారా లోకేశ్
విశాఖపట్నం, జనవరి 8(ఆంధ్రజ్యోతి): గడిచిన ఐదేళ్లలో వైసీపీ అసమర్థ పాలనతో రాష్ట్రం వెంటిలేటర్‌పైకి వెళ్లిపోయిందని, అటువంటి రాష్ట్రానికి ప్రధానిమోదీ ఆక్సిజన్ అందించి మళ్లీ కోలుకునేలా చేశారని రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ కొనియాడారు. బుధవారం ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. ‘‘వైసీపీ అధ్వానపాలన వల్ల ప్రతి నెలా రాష్ట్రం రూ.4 వేల కోట్ల లోటు బడ్జెట్‌తో నడుస్తోంది. ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రానికి అవసరమైన నిధులను ప్రధాని అందించి ఆదుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక భోగాపురం ఎయిర్‌పోర్టు పనులు వేగంగా సాగుతున్నాయి. ఎన్ని ఇబ్బందులున్నా ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారు. త్వరలో మెగా డీఎస్సీకి నోటిఫికేషన్ విడుదల చేస్తాం. రాష్ట్రం దశ, దిశ మార్చే ప్రాజెక్టులకు శ్రీకారం చుడుతున్న ఈరోజు చరిత్రలో నిలిచిపోతుంది. రూ.2 లక్షల కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేయడం ఆనందంగా ఉంది. రాష్ట్ర ప్రజల తరఫున నమో (నరేంద్ర మోదీ)కు కృతజ్ఞతలు. మోదీ మూడోసారి ప్రధాని అవ్వడంతో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోంది. దేశాభివృద్ధిలో ఏపీ కీలకంగా మారుతోంది’ అన్నారు.
ప్రజా నాయకుడిగా నమో
గతంలో ప్రధానులంతా కేవలం ప్రధానులుగా ఉన్నారు. నమో మాత్రమే ప్రజా నాయకుడిగా ఎదిగారు. నమో విజన్ గ్లోబల్ అయితే, ఆయన గుండె (హార్ట్) మాత్రం భారత్‌లోనే ఉంటుంది. వికసిత్ భారత్-2047 పేరుతో ప్రధాని విజన్ డాక్యుమెంట్ విడుదల చేశారు. అదే స్ఫూర్తితో సీఎం చంద్రబాబు స్వర్ణాంధ్ర-2047 డాక్యుమెంట్ విడుదల చేశారు. వ్యవసాయం, పరిశ్రమలు, పోర్టు లు, ఎయిర్‌పోర్టులు ఇలా అన్ని రంగాల్లో లక్ష్యాలను పెట్టుకుని పనిచేయడమే విజన్-2047 ఉద్దేశమని లోకేశ్ అన్నారు.