Nara Bhuvaneshwari: డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్-2025 పురస్కారాన్ని అందుకున్న నారా భువనేశ్వరి
ABN , Publish Date - Nov 05 , 2025 | 07:29 AM
ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీగా సమాజ హితం కోసం పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు గాను నారా భువనేశ్వరి లండన్‌లో ప్రతిష్ఠాత్మక డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డును అందుకున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ప్రతిష్ఠాత్మక ‘డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్-2025’ అవార్డును అందుకున్నారు. లండన్‌లో మంగళవారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ సంస్థ ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఈ అవార్డును అందజేశారు. ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీగా చేస్తున్న ప్రజాసేవకు గుర్తింపుగా భువనేశ్వరికి ఈ అవార్డును అందజేశారు. ఇక కార్పొరేట్ గవర్నెన్స్ విభాగంలో హెరిటేజ్ ఫుడ్స్‌కు గోల్డెన్ పీకాక్ అవార్డు దక్కింది. సంస్థ వీసీఎండీ హోదాలో భువనేశ్వరి ఈ అవార్డును స్వీకరించారు (Nara Bhuvaneshwari Distinguished Fellowship Award).
ఈ సందర్భంగా నారా భువనేశ్వరి మాట్లాడుతూ ఎన్టీఆర్ ట్రస్టు నిర్వహిస్తున్న పలు సేవాకార్యక్రమాల గురించి వివరించారు. సంజీవని ఫ్రీ హెల్త్ క్లీనిక్స్, మొబైల్ హెల్త్ క్యాంప్స్, సురక్షితమైన తాగునీరు అందించే కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు వొకేషనల్ కోర్సుల్లో శిక్షణ ఇవ్వటంతో పాటు వారి సామర్ధ్యాలు పెంచేలా నైపుణ్య శిక్షణను అందిస్తూ మహిళా సాధికారత కోసం కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రకృతి విపత్తుల సమయంలోనూ బాధితులకు అండగా నిలుస్తున్నామని చెప్పారు. వారి జీవితం సాధారణ స్థాయికి వచ్చే వరకూ చేయూతను అందిస్తున్నామని అన్నారు.
ఏపీ, తెలంగాణ సహా వివిధ రాష్ట్రాల్లో ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా ఆపన్నులకు సాయం అందిస్తున్నామని భువనేశ్వరి ఈ సందర్భంగా తెలిపారు. సమాజంలో ప్రజలు సక్రమంగా పోషకాహారం తీసుకునేలా ట్రస్టు తరపున సేవలు అందిస్తున్నామని అన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పరిచేందుకు సంబంధిత అంశాల్లో సలహాలు అందిస్తున్నామని చెప్పారు. వ్యక్తిగత ఆరోగ్యం కాపాడుకునేలా వారికి ట్రస్టు తరపున విలువైన సూచనలు చేస్తున్నామని వివరించారు. సమాజంలో అందరికీ సమాన అవకాశాలు లభించాలన్నదే ఎన్టీఆర్ ట్రస్టు ఆశయమని అన్నారు. ఈ దిశగా అట్టడుగున ఉన్నవారు కూడా గౌరవంతో జీవించేలా అవసరమైన అంశాల్లో వారిని ప్రోత్సహిస్తున్నామని అన్నారు. సముద్రంలా అందరికీ వనరుల్ని, సూర్యుడిలా సమాజంలో అందరికీ సమానంగా సేవల్ని అందిస్తూ ఎన్టీఆర్ ట్రస్టు ముందుకు సాగుతోందని నారా భువనేశ్వరి వ్యాఖ్యానించారు.
ఇవీ చదవండి
అమరావతి రైతుల త్యాగ ఫలాలను అనుభవిస్తున్నాం: హోం మంత్రి అనిత
సత్యసాయి శత జయంతికి 200 ప్రత్యేక బస్సులు: ఆర్టీసీ ఎండీ
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి