Home Minister Anitha: అమరావతి రైతుల త్యాగ ఫలాలను అనుభవిస్తున్నాం అనిత
ABN , Publish Date - Nov 05 , 2025 | 06:42 AM
అమరావతి రైతుల త్యాగ ఫలాలను అనుభవిస్తున్నామని హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. వెలగపూడిలో నిర్మించిన.....
వెలగపూడిలో డీఎస్పీ కార్యాలయాన్ని ప్రారంభించిన హోం మంత్రి, డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా, ఐజీ త్రిపాఠి
తుళ్లూరు, నవంబరు 4(ఆంధ్రజ్యోతి): అమరావతి రైతుల త్యాగ ఫలాలను అనుభవిస్తున్నామని హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. వెలగపూడిలో నిర్మించిన డీఎస్పీ కార్యాలయాన్ని మంగళవారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా హోంత్రి మాట్లాడారు. ‘2018లో టీడీపీ ప్రభుత్వం రాజధాని అమరావతిలో డీఎస్పీ కార్యాలయం ఏర్పాటుకు శంకుస్థాపన చేసింది. వైసీపీ హయాంలో నిర్మాణ పనులు నిలిచిపోయినప్పటికీ కూటమి ప్రభుత్వం రాగానే పూర్తి చేసింది. రాజధాని ప్రాంతంలో శాంతి భద్రతల పరిరక్షణ, బందోబస్తు దృష్ట్యా డీఎస్పీ కార్యాలయం అవసరం ఉంది. ప్రజల రక్షణ కోసం అహర్నిశలు శ్రమించే పోలీసులకు కూడా భద్రత కల్పించాలనే నిర్ణయంతో పలు పోలీసు స్టేషన్‌లకు శంకుస్థాపన చేశాం. పోలీసు వ్యవస్థ సమర్థంగా పని చేయడానికి తగిన వసతులు అవసరం. ఆ దిశగా డీజీపీ మార్గదర్శకంలో కృషి చేస్తున్నాం. పోలీసుల భద్రత, సంక్షేమం, ఆరోగ్యం, కుటుంబ భద్రతకు ప్రాధాన్యం ఇచ్చాం. ఇప్పటికే ప్రమాద భీమా సౌకర్యం కల్పించాం. ఈ పారంతంలో ఎస్పీ క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేయాలని డీజీపీ సూచించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఇప్పటి వరకు 6,100 కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ చేశాం’ అని మంత్రి పేర్కొన్నారు. ఈ సందర్భంగా డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా, ఐజీ త్రిపాఠి, గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీలు జీవీ రమణమూర్తి, హనుమంతరావు, తుళ్లూరు డీఎస్పీ మురళీకృష్ణ, ఇతర జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది, ప్రజా ప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.