Share News

MSME Financial Solutions: ఎంఎస్ఎంఈలకు ట్రెడ్స్‌లో చెల్లింపులు

ABN , Publish Date - May 06 , 2025 | 05:39 AM

సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు (ఎంఎస్ఎంఈ) చెల్లింపుల ఆలస్యం సమస్యను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్బీఐ ట్రెడ్స్‌ ప్లాట్‌ఫాంలో ప్రభుత్వ రంగ సంస్థలు, మున్సిపల్‌ కార్పొరేషన్లు, స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలను చేర్చే ఉత్తర్వులు జారీ చేసింది. దీని ద్వారా ఎంఎస్ఎంఈలకు సకాలంలో చెల్లింపులు జరగనుంది.

MSME Financial Solutions: ఎంఎస్ఎంఈలకు ట్రెడ్స్‌లో చెల్లింపులు

  • ఆర్బీఐ ప్లాట్‌ఫాంలోకి ప్రభుత్వరంగ సంస్థలు

అమరావతి, మే 5 (ఆంధ్రజ్యోతి): సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) ఉత్పత్తులు, సేవలకు ఆలస్యమవుతున్న చెల్లింపుల సమస్య పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ప్రభుత్వ రంగ సంస్థలు, మున్సిపల్‌ కార్పొరేషన్లు, స్వయం ప్రతిపత్తి కలిగిన రాష్ట్రస్థాయి సంస్థలు, సొసైటీలన్నింటినీ ఆర్బీఐ ఆన్‌లైన్‌ డిజిటల్‌ ప్లాట్‌ఫాం.. ట్రేడ్‌ రిసీవబుల్స్‌ డిస్కౌంటింగ్‌ సిస్టం (ట్రెడ్స్‌) పరిధిలోకి తీసుకువస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర పురోగతికి దోహదపడుతున్న ఎంఎస్ఎంఈలు ఎదుర్కొంటున్న సవాళ్లలో కొనుగోలుదారుల చెల్లింపుల్లో జాప్యం ప్రధానమైనది. నిధులు బ్లాక్‌ అయిపోతుండటంతో రాష్ట్రంలోని ఎంఎస్ఎంఈలు పూర్తి సామర్థ్యాన్ని ప్రదర్శించలేకపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఎంఎ్‌సఎంఈల సమస్య పరిష్కారం కోసం రాష్ట్ర పరిశ్రమలశాఖ, ఏపీ ఎంఎస్ఎంఈ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్లు ‘ట్రెడ్స్‌’ ప్లాట్‌ఫాంను ఉపయోగించుకోవడానికి గత ఏడాది జూన్‌లో ఒప్పందం కుదుర్చుకున్నాయి.


ఈ నేపథ్యంలో ఎంఎస్ఎంఈల వస్తు, సేవలకు సంబంధించిన బిల్లుల పరిష్కారం కోసం ట్రెడ్స్‌లో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని ప్రభుత్వ రంగ, అటానమస్‌ తదితర సంస్థలను ప్రభుత్వం ఆదేశించింది. ఆర్‌బీఐ మార్గదర్శకాల ప్రకారం రూ. 250 కోట్లు, అంతకంటే ఎక్కువ వార్షిక టర్నోవర్‌ ఉన్న అన్ని కంపెనీలు తప్పనిసరిగా ఈ ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫాంలో ఉండాలని నిర్దేశించింది. దీంతో ఎంఎస్ఎంఈలకు తక్షణ చెల్లింపులు జరుగుతాయి. ఈ ఆర్థిక లావాదేవీల ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంది. రాష్ట్రంలో ట్రెడ్స్‌ అమలు కోసం రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యశాఖ నోడల్‌ డిపార్ట్‌మెంట్‌గా పనిచేస్తుంది. సకాలంలో ట్రెడ్స్‌లో ఆన్‌బోర్డింగ్‌ అయ్యేలా శాఖలు తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

Updated Date - May 06 , 2025 | 05:40 AM