SIT: మిథున్ రెడ్డి అరెస్టు
ABN , Publish Date - Jul 20 , 2025 | 03:20 AM
మద్యం కుంభకోణంలో మాస్టర్ మైండ్... అంతిమ లబ్ధిదారు తర్వాతి స్థానంలో ఉన్న వ్యక్తిగా భావిస్తున్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని ఎట్టకేలకు సిట్ అధికారులు అరెస్టు చేశారు.
మద్యం స్కామ్‌లో ఆయనే మాస్టర్ మైండ్
సిట్ ముందు విచారణకు హాజరు.. ఐదుగంటలపాటు ప్రశ్నల వర్షం
గతంలో మాదిరే సహాయ నిరాకరణ.. రాత్రి 8 గంటలకు అరెస్టు చేసిన ‘సిట్’
వైసీపీ ఎంపీని నేడు కోర్టులో హాజరుపరచనున్న అధికారులు
ఇవీ సెక్షన్లు...
మిథున్ రెడ్డిని క్రైమ్ నంబర్ 21/2024లో అరెస్టు చేసినట్లు పోలీసులు సమాచారం ఇచ్చారు. ఐపీసీ 420, 409, 384, 120(బి), 201 రెడ్ విత్ 34, 37... అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 7, 7ఏ, 8, 12, 13(1) (బీ), 13(2) కింద మంగళగిరి పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైనట్లు వెల్లడించారు.
ఇలా మొదలైంది...
లిక్కర్ స్కామ్‌పై 2024 సెప్టెంబరు
23న కేసు నమోదైంది.
ఈ ఏడాది ఫిబ్రవరి 5వ తేదీన విజయవాడ నగర పోలీసు కమిషనర్ రాజశేఖర్ బాబు నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పడింది.
ఏ1 రాజ్ కసిరెడ్డిని ఏప్రిల్ 22న శంషాబాద్‌లో అరెస్టు చేశారు. ఈ కేసులో ఇదే తొలి అరెస్టు.
శనివారం మిథున్ రెడ్డి అరెస్టుతో... ఇప్పటిదాకా అరెస్టయిన వారి సంఖ్య 12కు చేరింది.
రాజ్ కసిరెడ్డిని అరెస్టు చేసిన 88 రోజులకు సిట్ ప్రాథమిక చార్జిషీటును దాఖలు చేసింది.
అమరావతి, జూలై 19 (ఆంధ్రజ్యోతి): మద్యం కుంభకోణంలో ‘మాస్టర్ మైండ్’... ‘అంతిమ లబ్ధిదారు’ తర్వాతి స్థానంలో ఉన్న వ్యక్తిగా భావిస్తున్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని ఎట్టకేలకు ‘సిట్’ అధికారులు అరెస్టు చేశారు. జగన్ హయాంలో జరిగిన వేలకోట్ల మద్యం కుంభకోణంలో మిథున్ రెడ్డి నాలుగో నిందితుడు (ఏ4)గా ఉన్నారు. అరెస్టు నుంచి రక్షణ పొందేందుకు విజయవాడ ఏసీబీ కోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో... ఆయన అరెస్టు శుక్రవారమే ఖరారైంది. ‘సిట్’ ఇచ్చిన నోటీసు మేరకు శనివారం మధ్యాహ్నం 12.40 గంటలకు మిథున్ రెడ్డి విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయానికి చేరుకున్నారు. ఆయనను సిట్ అధికారులు దాదాపు ఐదుగంటల పాటు ప్రశ్నించారు. ముడుపులు మూటగట్టేందుకు అనుకూలంగా మద్యం విధానాన్ని రూపొందించడం మొదలుకుని...
అందుకు అనుగుణంగా ఎక్సైజ్ అధికారుల ని యామకం, ముడుపుల వసూళ్లు, అప్పట్లో గరిష్ఠ లబ్ధిపొందిన ఆదాన్ డిస్టిలరీలో అనధికార భాగస్వామ్యం, నిబంధనలకు విరుద్ధంగా ఆర్డర్లు ఇప్పించడం, ముడుపులివ్వని వారికి ఆర్డర్లు ఆపేయడం, డిస్టిలరీల నుంచి ఎంత వసూలు చేయాలో నిర్ణయించడం, ఆ సొమ్ము ఎన్నికల ఖర్చు కోసం భద్రపరచడం, పీఎల్‌ఆర్ కన్‌స్ట్రక్షన్ ద్వారా కోట్ల రూపాయల లావాదేవీలు తదితర అంశాలపై ప్రశ్నించినట్లు తెలిసింది. మద్యం తరలించే బాక్సుల కాంట్రాక్టు ఢిల్లీకి చెందిన వారికి ఇప్పించడం వెనుక జరిగిన తతంగంపైనా మిథున్‌ను ప్రశ్నించినట్లు సమాచారం.
అదే సమాధానం...
మద్యం కేసులో మిథున్ రెడ్డిని ఈ ఏడాది ఏప్రిల్‌లో ఒకసారి ‘సిట్’ అధికారులు ప్రశ్నించారు. అప్పట్లో ఆయన విచారణకు ఏమాత్రం సహకరించలేదు. ‘రాష్ట్రంలో జరిగే వ్యవహారాలతో ఎంపీగా ఉన్న నాకేం సంబంధం’ అంటూ సమాధానాలు దాటవేశారు. శనివారం విచారణలో కూడా ఆయన ఇదే తరహాలో సహాయ నిరాకరణ చేసినట్లు తెలిసింది. ‘అంతిమ లబ్ధిదారు’కు సంబంధించి అడిగిన ప్రశ్నలకు స్పందించలేదని సమాచారం. దీంతో... మిథున్‌ను అరెస్టు చేయాలని అధికారులు నిర్ణయించుకున్నారు. నిబంధనల ప్రకారం... ఆయన కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. శనివారం రాత్రి 8 గంటలకు మిథున్‌ను అరెస్టు చేసినట్లు చెప్పారు. ఆయనను ఆదివారం ఉదయం విజయవాడ ఏసీబీ కోర్టులో ప్రవేశ పెట్టనున్నారు.
ఇదీ మిథున్ పాత్ర...
‘సిట్’ విచారణలో గుర్తించిన ప్రకారం... జగన్ సర్కారు తెచ్చిన మద్యం పాలసీ రూపకల్పనలో మిథున్ రెడ్డి అత్యంత కీలకంగా వ్యవహరించారు. వినియోగదారులు అలవాటు పడ్డ, పాపులర్ మద్యం బ్రాండ్లను కాకుండా ముడుపులిచ్చిన అనామక కంపెనీలకు మాత్రమే ఆర్డర్లు ఇచ్చేలా చూశారు. లిక్కర్ లాబీని గుప్పిట్లో పెట్టుకుని అక్రమాలకు పాల్పడ్డారు. ముడుపులు చెల్లించిన వారికే తర్వాతి వారంలో ఆర్డర్లు ఇవ్వాలని, లేదంటే ఆపేయాలని మిథున్ రెడ్డి ఎక్సైజ్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చినట్లు తేలింది. ఐదు రూపాయల టీ తాగినా ఆన్‌లైన్ చెల్లింపులు జరుగుతుండగా... మద్యం వ్యాపారం మాత్రం పూర్తిగా ‘క్యాష్’లో జరగడానికి కారణం ఆయనే అని సిట్ గుర్తించింది. అప్పటి ఎక్సైజ్ అధికారులు తమ వాంగ్మూలాల్లో ఈ విషయం స్పష్టం చేసినట్లు తెలిసింది. ప్రతి రోజూ రెండు కోట్లకు తగ్గకుండా మద్యం కమీషన్లు వసూలు చేసిన లిక్కర్ గ్యాంగ్‌లో కీలకంగా వ్యవహరించిన మిథున్ రెడ్డి ఆదాన్ డిస్టిలరీస్ పేరుతో వందల కోట్ల రూపాయలు ఆర్జించినట్లు సమాచారం. లిక్కర్ వ్యాపారంలో తాము చెప్పినట్లు చేస్తే ఐఏఎస్ అధికారి హోదా ఇప్పిస్తామంటూ అప్పటి ఎక్సైజ్ అధికారి సత్య ప్రసాద్‌తో ఒప్పందం చేసుకున్నారు. ఇతర నిందితులతో తరచూ సమావేశమయ్యారు. ఈ విషయాలను మిథున్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో దర్యాప్తు అధికారి పొందుపరిచే అవకాశం ఉంది.
భారీ బందోబస్తు
మిథున్‌రెడ్డి సిట్ విచారణకు హాజరవుతున్న సందర్భంగా విజయవాడలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సీపీ కార్యాలయంముందు ఉన్న రహదారిని మొత్తం మూసివేశారు. బారికేడ్లను, రోప్‌పార్టీలను ఏర్పాటు చేశారు.
ఇది నిలబడే కేసు కాదు: మిథున్ రెడ్డి
గన్నవరం విమానాశ్రయం వద్ద, సీపీ కార్యాలయంలోకి వెళ్లే ముందు స్టేట్ గెస్ట్‌హౌస్ వద్ద మిథున్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. మద్యం కేసు కోర్టులో నిలబడదని జోస్యం చెప్పారు. ‘‘చంద్రబాబు అధికారంలో ఉన్న ప్రతిసారీ నా కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పుడు తప్పుడు కేసులు బనాయించారు. ఈ కేసు పూర్తిగా రాజకీయ కక్షలతో పెట్టింది. ప్రస్తుతానికి అరెస్టు చేసి ఆనందపడవచ్చేమో కానీ, ఇది నిలబడే కేసు కాదు’’ అని అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రభుత్వ బడుల్లో నో వేకెన్సీ పరిస్థితి తేవాలి
Read latest AP News And Telugu News