Heat Relief Measures: తుంపర్లతో ఉపశమనం
ABN , Publish Date - May 03 , 2025 | 04:51 AM
అమరావతిలో ప్రధాని సభకు వచ్చిన ప్రజలు ఎండ తీవ్రతకు గురికాకుండా తుంపర జల్లులను ఏర్పాటు చేశారు. పిడుగులను నివారించేందుకు ప్రత్యేకంగా నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేయడంతో పాటు ట్రాఫిక్ స్తంభించకుండా చర్యలు తీసుకున్నారు
సభ వద్ద పిడుగులను నియంత్రించే వ్యవస్థ ఏర్పాటు
ట్రాఫిక్ స్తంభించకుండా పకడ్బందీ చర్యలు
గుంటూరు, మే 2 (ఆంధ్రజ్యోతి): అమరావతిలో జరిగిన ప్రధాని సభకు హాజరైన లక్షలాది ప్రజలు వడదెబ్బకు గురికాకుండా ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంది. సభలో చల్లదనం కోసం తుంపర జల్లులను ఏర్పాటు చేసింది. శుక్రవారం మధ్యాహ్నం సభ ప్రాంతంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో లోపల ఆశీనులైన ప్రజలు ఉక్కపోతకు గురికాకుండా ఆ తుంపరల జల్లు ఎంతగానో ఉపయోగపడింది. అదే సమయంలో గాలి వీచడంతో నీటి తుంపరలు సభా ప్రాంగణమంతా విస్తరించి శీతలమయం చేశాయి. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా సభా ప్రాంగణానికి సమీపంలో పిడుగులను నిరోధించే వ్యవస్థను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అదృష్టవశాత్తు వర్షం కురవలేదు.
ప్రాంగణంలోకి ఏ పార్టీ జెండాలను పోలీసులు అనుమతించలేదు. మువ్వన్నెల జాతీయ జెండాలను మాత్రమే అనుమతించారు. రోడ్డు పొడవునా ప్రధానికి మహిళలు స్వాగతం పలికారు. సభకు రాష్ట్రం నలుమూలల నుంచీ ప్రజలు తరలి వచ్చారు. చాలామంది ఉదయం 10 గంటలకే అమరావతి చేరుకున్నారు. ఎండ తీవ్రతను ఏమాత్రం లెక్క చేయకుండా మహిళలు తరలిరావడం విశేషం. సభకు తరలి వచ్చే వారి కోసం ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలతో పాటు టీడీపీ నేతలు పలు చోట్ల ఆహారం, తాగునీరు, మజ్జిగ సరఫరా చేశారు. మొత్తం ఎనిమిది మార్గాల ద్వారా సభా వేదిక వద్దకు ప్రజలు చేరుకునేలా ఏర్పాట్లు చేశారు. ఈ మార్గాల్లో ట్రాఫిక్ స్తంభించి పోకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్నారు.