Minister Y. Sathyakumar : వైసీపీ అబద్ధాలకు కొదవ లేదు
ABN , Publish Date - Feb 16 , 2025 | 04:32 AM
ఎన్నికల్లో ప్రజలు అంత స్పష్టమైన తీర్పు ఇచ్చినా వైసీపీ అబద్దాలకు కొదవ లేదన్నట్లుగా వ్యవహరిస్తోందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి వై.సత్యకుమార్ యాదవ్ విమర్శించారు.
వైద్య, ఆరోగ్య మంత్రి సత్యకుమార్ ఫైర్
నంద్యాల, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల్లో ప్రజలు అంత స్పష్టమైన తీర్పు ఇచ్చినా వైసీపీ అబద్దాలకు కొదవ లేదన్నట్లుగా వ్యవహరిస్తోందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి వై.సత్యకుమార్ యాదవ్ విమర్శించారు. ఐదేళ్ల పాటు వైసీపీ అధికారంలో ఉండి వైద్యకళాశాలలను పూర్తిగా గాలికి వదిలేసి, ఇప్పుడు పనులు జరుగుతున్నా దుష్ప్రచారం చేస్తోందంటూ మండిపడ్డారు. శనివారం నంద్యాల జిల్లాలో ఆయన మాట్లాడారు. కేంద్ర, రాష్ట్రాల్లో ఎన్టీయే ప్రభుత్వం ఉండటంతో ఒకవైపు అభివృద్ధి కార్యక్రమాలు, మరోవైపు పెట్టుబడులు ఊపందుకున్నాయన్నారు. గతంలో కేంద్రం 17 వైద్య కళాశాలలను మంజూరు చేస్తే.. గత ఐదేళ్ల పాలనలో వైసీపీ ప్రభుత్వం ఐదు మాత్రమే పూర్తి చేసిందన్నారు. నంద్యాల జిల్లాలోని వైద్యకళాశాలలో రెండో సంవత్సరం విద్యార్థులకు మౌలిక వసతులు కూడా లేకుండా చేశారని మండిపడ్డారు. 50 శాతానికి పైగా ఫ్యాకల్టీ కొరత ఉందన్నారు. మిగిలిన వైద్య కళాశాలల్లోనూ ఇదే సమస్య ఉందని పేర్కొన్నారు. గతంలో రూ.850 కోట్ల నిధులు మంజూరు చేస్తే.. కేవలం 14 శాతం నిధులు మాత్రమే ఖర్చు చేసి చేతులు దులుపుకొన్నారని ఆరోపించారు. క్షేత్ర స్థాయిలో పరిస్థితి ఇలా ఉంటే.. వైద్యకళాశాలల విషయంలో మళ్లీ అబద్దాలు చెబుతున్నారని పేర్కొన్నారు. భవనాలు లేకుండా ఆస్పత్రి, హాస్టళ్ల నిర్మాణం చేయకుండా మెడికల్ కళాశాలలను ప్రారంభించడం సాధ్యం కాదన్నారు. రాష్ట్రానికి మంజూరైన ప్రతి వైద్య కళాశాలనూ అన్ని మౌలిక సదుపాయాలతో పూర్తి చేసి విద్యార్థులకు నాణ్యమైన వైద్యవిద్యను అందించే దిశగా కృషి చేస్తున్నామన్నారు. కాగా, ప్రతి కార్యకర్త కూడా కూటమి ధర్మాన్ని పాటిస్తూ బీజేపీ బలోపేతానికి కృషి చేయాలని మంత్రి పిలుపునిచ్చారు.
కూటమిలో విభేదాలు దుష్ప్రచారమే : సత్యకుమార్
కూటమి నేతల మధ్య విభేదాలు ఉన్నాయనేది దుష్ప్రచారం మాత్రమేనని మంత్రి సత్యకుమార్ అన్నారు. ‘రాష్ట్రంలోనే కాదు... నేను ప్రాతినిధ్యం వహిస్తున్న ధర్మవరం నియోజకవర్గంలోనూ కూటమిలో విభేదాలు లేవు. మేమంతా కలిసే పనిచేస్తున్నాం. డిప్యూటీ సీఎం నేతృత్వంలో అన్ని నిర్ణయాలు తీసుకుంటున్నాం. జీబీఎస్ గురించి ఆందోళన వద్దు. రాష్ట్రంలో 7 కేసులే నమోదయ్యాయి. మరణాల నేపథ్యంలో అప్రమత్తంగానే ఉన్నాం. జీబీఎస్ నియంత్రణ కోసం వాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నాం. బర్డ్‌ఫ్లూ ఎక్కడా మనుషులకు సంక్రమించలేదు. చికెన్ విషయంలో మంత్రి అచ్చెన్నాయుడు ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. అన్ని విషయాల్లోనూ రాష్ర్టానికి, కేంద్రం పూర్తిస్థాయిలో న్యాయం చేస్తోంది’ అని మంత్రి అన్నారు.