Cyber Crime: మంత్రి నారాయణ అల్లుడికి బురిడీ..
ABN , Publish Date - Aug 23 , 2025 | 03:21 AM
సామాన్యుల నుంచి వీఐపీల వరకూ సైబర్ నేరగాళ్ల వలకు చిక్కి కోట్లు పోగొట్టుకుంటున్నారు. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ పెద్ద అల్లుడు పునీత్ పేరిట సైబర్ నేరగాళ్లు..
అకౌంటెంట్‌కు మెసేజ్ పెట్టి 1.96 కోట్ల లూటీ
వెంటనే అప్రమత్తమై పోలీసులకు సమాచారం
సైబర్ నేరగాళ్ల ఖాతాలోని కోటీ 40 వేలు ఫ్రీజ్
గత నెలలో ఘటన.. ఆలస్యంగా వెలుగులోకి..
నెల్లూరు రూరల్, ఆగస్టు 22(ఆంధ్రజ్యోతి): సామాన్యుల నుంచి వీఐపీల వరకూ సైబర్ నేరగాళ్ల వలకు చిక్కి కోట్లు పోగొట్టుకుంటున్నారు. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ పెద్ద అల్లుడు పునీత్ పేరిట సైబర్ నేరగాళ్లు రూ.1.96 కోట్లు లూటీ చేసిన ఘటన కూడా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే దీనిపై వెంటనే సమాచారం అందడంతో అప్రమత్తమైన నెల్లూరు రూరల్ పోలీసులు సైబర్ నేరగాళ్ల ఖాతా నుంచి కోటీ 40 వేల రూపాయలు ఫ్రీజ్ చేశారు. ఈ కేసులో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. కొన్నిరోజుల క్రితం మంత్రి నారాయణ పెద్ద అల్లుడు పునీత్ నిర్వహిస్తున్న ఐవీ గ్రీన్ ఇన్‌ఫ్రా అకౌంటెంట్‌కు పునీత్ పేరిట సైబర్ నేరగాళ్లు వాట్సాప్ మేసేజ్ పెట్టారు. అర్జెంట్‌గా తాను పంపిన ఖాతాకి రూ.1.96 కోట్లు ట్రాన్స్‌ఫర్ చేయాలని కోరడంతో అకౌంటెంట్ వెంటనే ఆ మొత్తాన్ని ఆ మెసేజ్‌లో చూపించిన బ్యాంకు ఖాతాకు పంపించారు. తర్వాత ఈ విషయం నారాయణ అల్లుడికి తెలియజేయడంతో.. ఆయన ఇదంతా సైబర్ నేరగాళ్ల పన్నాగమని గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే స్పందించి రూ.కోటీ 40 వేలను ఫ్రీజ్ చేయించినట్టు నెల్లూరు రూరల్ సీఐ గుంజి వేణు తెలిపారు. అనంతరం వారి నుంచి అందుకున్న ఫిర్యాదుతో గత నెలలో ఉత్తరప్రదేశ్‌లో సంజీవ్ అనే వ్యక్తిని అరెస్టు చేసి కోర్టులో హజరుపరిచామని చెప్పారు. న్యాయస్థానం చొరవతో రూ.49 లక్షలు విడుదలకు అనుమతి వచ్చిందని పేర్కొన్నారు. ఈ కేసులో రెండో సూత్రధారి అయిన అరవింద్‌కుమార్ శ్రీవాత్సవ్‌ను కూడా తాజాగా ఉత్తరప్రదేశ్‌లోనే అరెస్ట్ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సైబర్ కుట్రలో ప్రధాన నిందితుడి కోసం గాలిస్తున్నామని చెప్పారు. కాగా.. భారీ మొత్తాల్లో నగదు ట్రాన్స్‌ఫర్ చేయడానికి ఉపయోగించే కరెంట్ ఖాతాదారులకు సైబర్ నేరగాళ్లు 2శాతం నగదు కమీషన్‌గా చెల్లిస్తున్నారని తమ విచారణలో తేలినట్లు సీఐ తెలిపారు.