Minister Nara Lokesh : విద్యార్థుల ఆత్మహత్యలకు అడ్డుకట్ట
ABN , Publish Date - Mar 07 , 2025 | 05:32 AM
విద్యాసంస్థల్లో పిల్లల ఆత్మహత్యలు బాధాకరమని విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేశ్ అన్నారు. విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు అందరం కలిసికట్టుగా కృషి చేయాల్సిన అవసరం ఉందని...

మన పిల్లలకు జరిగినట్టే ఆ ఘటనలను చూడాలి
మానవత్వంతో వ్యవహరించాలని అధికారులను కోరా
ర్యాగింగ్, ఫీజుల ఒత్తిడి, చదువుల భయమే కారణం
తల్లిదండ్రులు, ప్రైవేటు యాజమాన్యాలదే బాధ్యత
కౌన్సెలింగ్‌కు అమెరికా సంస్థతో సంప్రదింపులు
విద్యాలయాల్లో స్కూల్ వెల్‌నెస్ టీమ్‌ల ఏర్పాటు
ఈ ఏడాది యూనివర్సిటీల్లో ఖాళీలన్నీ భర్తీ చేస్తాం
శాసనమండలిలో మంత్రి లోకేశ్ వెల్లడి
అమరావతి, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): విద్యాసంస్థల్లో పిల్లల ఆత్మహత్యలు బాధాకరమని విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేశ్ అన్నారు. విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు అందరం కలిసికట్టుగా కృషి చేయాల్సిన అవసరం ఉందని గురువారం మండలిలో ఈ అంశంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. ఎవరైనా విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటే సొంత పిల్లలకు జరిగినట్లుగా భావించాలని, మానవత్వంతో స్పందించాలని ఇప్పటికే అధికారులకు సూచించానన్నారు. ‘‘ఆత్మహత్యలు లేవు అని ప్రభుత్వం అనడం లేదు. కానీ, ఆత్మహత్యల ఘటనల్లో పెరుగుదల ఎప్పుడూ ఒకేలాలేదు. ఒక్కో ఏడాది ఒక్కోరకంగా ఉంటోంది. ఉదాహరణకు 2016లో ఆరుగురు విద్యార్థులు, 2019లో నలుగురు, 2021లో ఏడుగురు, 2022లో 12 మంది, 2023లో 17 మంది, 2024లో ఆరుగురు చనిపోయారు. వీరంతా ఇంటరు విద్యార్థులు. సాంకేతిక విద్యను అభ్యసిస్తున్నవారిలో ఒక ఏడాది ఒకరిద్దరు, మరో ఏడాది 11 మంది, ఇంకో ఏడాది ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. యూనివర్సిటీల స్థాయిలో గత పదేళ్లలో 18 మంది ఆత్మహత్య చేసుకున్నారు. విద్యార్థుల్లో ఆత్మహత్య భావనను మొగ్గలోనే తుంచివేయడం కోసం స్కూల్ వెల్‌నెస్ టీమ్‌లను ఏర్పాటుచేసి, ప్రైవేటు,ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నాం.’’ అని లోకేశ్ వివరించారు. విద్యార్థులకు, ఉపాధ్యాయులకు కౌన్సెలింగ్ నిర్వహించడానికి అమెరికాకు చెందిన క్యూపీఆర్ ఇన్‌స్టిట్యూట్‌తో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. ఇంటర్ పిల్లల కోసం టెలీకౌన్సెలింగ్ ఏర్పాటుచేస్తామని, డిగ్రీ కాలేజీల్లో కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగుతున్నదని వివరించారు. ఎన్‌సీసీ డైరెక్టరేట్ ఇవ్వాలని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కోరానన్నారు.
ఆత్మహత్యలకు ర్యాగింగ్, చదువుల భయం, ఫీజు చెల్లింపు ఒత్తిడే ప్రధాన కారణమని తెలిపారు. ‘‘ఫీజు కట్టాం కాబట్టి అన్ని సబ్జెక్టుల్లో తమ పిల్లలకు మంచి మార్కులు రావాలని తల్లిదండ్రులు ఒత్తిడి పెడుతున్నారు. ఆవిషయంలో ప్రైవేటు యాజమాన్యంపైనా బాధ్యత ఉంది.’’ అని లోకేశ్ స్పష్టం చేశారు. పాఠశాల మైదానాల విషయంలో చక్రపాణి నివేదికను అధ్యయనం చేస్తున్నామని తెలిపారు. విద్యాసంస్థల్లో లైంగిక వేధింపుల నివారణకు 280 మంది కౌన్సెలర్లను నియమించామన్నారు. ఇంకా ఏమన్నారంటే..
పరిశ్రమల అవసరాలు తీర్చేలా..
‘‘రాష్ట్రంలోని విశ్యవిద్యాలయాలను బలోపేతం చేసేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. దీనికోసం బడ్జెట్‌లో రూ.రెండు వేల కోట్లు ప్రతిపాదించాం. వర్సిటీల్లో ఖాళీలు ఉన్న మాట వాస్తవమే. ఈ ఏడాది ఏకసభ్య కమిషన్ నివేదిక అందిన వెంటనే ఖాళీలన్నీ భర్తీ చేస్తాం. ఎన్‌ఐఆర్‌ఎ్‌ఫ ర్యాంకింగుల్లో మన వర్సిటీలు తొమ్మిదో స్థానంలో ఉన్నాయి. వాటిని మూడోస్థానంలోకి తీసుకురావడమే లక్ష్యం. పీహెచ్‌డీ విద్యార్థులు 5600 మంది ఉన్నారు. ఏపీలో జీఆర్ (గ్రాస్ ఎన్‌రోల్‌మెంట్) రేషియో 36.5 శాతం ఉంది. సాంకేతిక సంబంధ స్టెమ్ కోర్సుల్లో మహిళలు తక్కువగా ఉన్నారు. ‘ఒకే రాష్ట్రం-ఒకేరాఽజధాని’ నినాదంతో పనిచేస్తున్న ప్రభుత్వ లక్ష్యాలను అందుకోవాలంటే ఐటీఐలు, పాలిటెక్నిక్ కాలేజీల్లో పాఠ్యప్రణాళికను తదానుగుణంగా రూపుదిద్దాల్సి ఉంటుంది. మేం అధికారంలోకి వచ్చిన తర్వాత లీప్(లెర్నింగ్ ఎక్స్‌లెన్స్ ఇన్ ఏపీ) పేరుతో అంతర్జాతీయ కంపెనీలు, పరిశ్రమలకు అవసరమైన మానవ వనరులను అభివృద్ధి చేసే కృషిలో కాలేజీలు, పాలిటెక్నిక్‌లు,ఐటీఐ, యూనివర్సిటీలను భాగంచేసే పనిని మొదలుపెట్టాం. వాటి పాఠ్యప్రణాళికల్లో తదనుగుణంగా మార్పులు తీసుకువస్తున్నాం. అనేక పథకాల కింద వర్సిటీలకు కేంద్రం అందిస్తున్న నిధులను కూడా కలుపుకొని కార్యక్రమాలు నిర్వహిస్తాం.’’ అని లోకేశ్ అన్నారు.
పాత తప్పులు పునరావృతం కారాదనే..
డీఎస్సీవిషయంలో గతంలో జరిగిన తప్ప్చులు పునరావృతం కాకుండా, న్యాయపరమైన వివాదాలకు తావులేకుండా పకడ్బందీగా నోటిఫికేషన్ ఇవ్వాలనే లక్ష్యంతో పని చేస్తున్నామని లోకేశ్ తెలిపారు. ‘‘విశ్వవిద్యాలయాల్లో నియామకాల అంశం కోర్టులో ఉంది. దీనిపై అడ్వకేట్ జనరల్‌తో మాట్లాడి చర్యలు తీసుకుంటాం. విశ్వవిద్యాలయాల్లో మంజూరైన పోస్టులు 4,330. అందులో 3,282 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. క్యూఎస్ ర్యాంకింగ్‌లో టాప్100లో మన రాష్ట్రం నుంచి కనీసం ఒక విశ్వవిద్యాలయమైనా ఉండాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం.’’ అని లోకేశ్ తెలిపారు.