Nara Lokesh: చంద్రబాబు టాస్క్‌మాస్టర్
ABN , Publish Date - Mar 09 , 2025 | 03:39 AM
ముఖ్యమంత్రిని తమకు టాస్క్‌మాస్టర్‌గా అభివర్ణించారు. అందరూ తనలాగే వేగంతో పనిచేయాలని ఆశిస్తుంటారని తెలిపారు. అసెంబ్లీ నిబంధనలను కాదని వైసీపీ అధ్యక్షుడు జగన్‌కు ప్రతిపక్ష హోదా ఇవ్వలేమని తేల్చిచెప్పారు.

తనలాగే అందరూ వేగంగా పనిచేయాలనుకుంటారు: లోకేశ్
మా రాష్ట్రానికి ఆయనే అడ్వాంటేజ్
జగన్‌కు ప్రతిపక్ష హోదా ఇవ్వలేం
సీఎం కొడుకును కావడం వల్ల
మరింత కష్టపడాల్సి వస్తోంది
మహిళా దినోత్సవం రోజూ జరపాలి
‘ఇండియా టుడే’ కాంక్లేవ్‌లో మంత్రి
న్యూఢిల్లీ, మార్చి 8(ఆంధ్రజ్యోతి): కర్ణాటకకు బెంగళూరు, తమిళనాడుకు చెన్నై, తెలంగాణకు హైదరాబాద్ అడ్వాంటేజ్‌గా ఉంటే.. ఆంధ్రప్రదేశ్‌కు చంద్రబాబు ఉన్నారని మంత్రి లోకేశ్ అన్నారు. ముఖ్యమంత్రిని తమకు టాస్క్‌మాస్టర్‌గా అభివర్ణించారు. అందరూ తనలాగే వేగంతో పనిచేయాలని ఆశిస్తుంటారని తెలిపారు. అసెంబ్లీ నిబంధనలను కాదని వైసీపీ అధ్యక్షుడు జగన్‌కు ప్రతిపక్ష హోదా ఇవ్వలేమని తేల్చిచెప్పారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఢిల్లీలో శనివారం ఇండియా టుడే నిర్వహించిన కాంక్లేవ్‌లో ఆయన పాల్గొన్నారు. సీనియర్ జర్నలిస్టు రాజ్‌దీప్ సర్దేశాయ్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ‘జగన్ వైసీపీ నాయకుడు. శాసనసభలో ప్రతిపక్ష హోదా ఉండాలంటే మొత్తం సభ సంఖ్యాబలంలో పదిశాతం ఉండాలని నిబంధనలు చెబుతున్నాయి. వాటిని కాదని ఆయనకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేం’ అని స్పష్టంచేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో తనపైనే అక్రమంగా 23 కేసులు నమోదు చేశారని..
ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీతోపాటు హత్యాయత్నం కేసులు సైతం పెట్టారని తెలిపారు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు రాష్ట్రంలో ఎవరికీ నిరసన తెలిపేందుకు అవకాశం లేదని, తమ ఇంటికే తాళ్లు కట్టారని చెప్పారు. ఇప్పుడు జగన్ ఎక్కడికైనా స్వేచ్ఛగా వెళ్తున్నారని అన్నారు. ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కంటే ఆయనకే అధిక భద్రత ఉందని చెప్పారు.
‘వైసీపీ పాలనలో పెద్ద ఎత్తున మద్యం అక్రమాలు, విచ్చలవిడిగా ఇసుక అక్రమ తవ్వకాలు జరిగాయి. ఇసుక అక్రమ తవ్వకాలపై సుప్రీంకోర్టులో కేసునడుస్తోంది’ అని గుర్తుచేశారు. తమిళనాట భాషా యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో.. కేంద్రం ఏ భాషనూ రాష్ట్రాలపై రుద్దదని స్పష్టం చేశారు. ‘వాస్తవానికి నేను కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను కలిసినప్పుడు.. తెలుగుకు ప్రాధాన్యమివ్వాలని నొక్కిచెప్పారు. మూడు భాషలే కాదు.. మన పిల్లలు జర్మన్, జపనీస్ కూడా నేర్చుకోవాలి. భవిష్యత్‌లో మన వాళ్లకు అటువైపే ఉద్యోగాలు రానున్నాయి. భారత్ వ్యూహాత్మక పాత్ర పోషిస్తున్నందున.. బహుళ భాషలు నేర్వాలి. ఏ భాష నేర్చుకోవాలనుకుంటున్నారో ఎంచుకునే అవకాశాన్ని పిల్లలకే ఇవ్వాలి’ అని తేల్చిచెప్పారు. నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాదికి అన్యాయం జరుగుతుందన్న ఆందోళనతో తాను ఏకీభవిస్తున్నట్లు లోకేశ్ తెలిపారు. జనాభాను నియంత్రించడం దక్షిణ రాష్ట్రాలకు ప్రతికూలం కాకూడదన్నారు. అయితే ప్రస్తుత నిష్పత్తులు కొనసాగుతాయని కేంద్రం తేల్చిచెప్పిందని గుర్తుచేశారు. కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నందున దీనిని ప్రచారాస్త్రం చేశారని.. అందుచేత ఇందులోకి ఆంధ్రప్రదేశ్ చొరబడాల్సిన అవసరం లేదని స్పష్టంచేశారు.
నైపుణ్యగణన సవాల్..
నైపుణ్య గణన కంటే కుల గణన చాలా సులభమని లోకేశ్ అన్నారు. రాష్ట్రంలో నైపుణ్య గణనను సవాల్‌గా తీసుకుని పనిచేస్తున్నామని చెప్పారు. విశాఖలోనే డేటా సెంటర్ ఏర్పాటు చేస్తామని, ఆ విషయంలో మరో ఆలేచనే లేదన్నారు. వై2కే విప్లవంలో హైదరాబాద్, దేశం లబ్ధి పొందితే.. ఇప్పుడు ఏపీ వంతని చెప్పారు. నైపుణ్యం కలిగిన మానవ వనరులు ఉన్నాయని.. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంతో ముందుకు వెళుతున్నామనితెలిపారు. యువగళం పాదయాత్ర ద్వారా చాలా నేర్చుకున్నానని, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను, కష్టాలను స్వయంగా తెలుసుకుని పరిపూర్ణత సాధించానని తెలిపారు. ఎంబీఏ చదవడం బిజినె్‌సకు మంచిదని, రాజకీయాలకు మాత్రం పాదయాత్ర ముఖ్యమని, అది రాజకీయాల్లో ఎంబీయే వంటిదన్నారు. ‘ప్రజలతో మమేకం కావడం, సమస్యలను దగ్గరగా చూడడం, లోతుగా అర్థం చేసుకోవడం వంటివన్నీ దానిద్వారానే నేర్చుకున్నాను. వాట్సాప్ ద్వారా ప్రభుత్వ సేవలను ప్రజలకు చేరువ చేయాలనే ఆలోచన పాదయాత్రలోనే వచ్చింది. ఈ నెలాఖరు నాటికి 350 సేవలను మనమిత్ర ద్వారా అందిస్తాం. ఇది ప్రారంభం మాత్రమే. భవిష్యత్‌లో మరిన్ని సేవలు అందుబాటులోకి తెస్తాం. ఆంధ్రప్రదేశ్ ఐటీ నుంచి ఏఐకి మారుతోంది’ అని తెలిపారు.
సామాన్య కార్యకర్తనే..
తనను తాను మూడో తరం రాజకీయ నాయకుడిగా ఎప్పుడూ భావించలేదని లోకేశ్ చెప్పారు. తానొక టీడీపీ కార్యకర్తగానే భావిస్తానన్నారు. సీఎం చంద్రబాబుకు కొడుకును కావడం వల్ల పదిరెట్లు ఎక్కువ కష్టపడాల్సి వస్తోందని.. ఆయన ప్రతిరోజూ తనను గమనిస్తూనే ఉంటారని తెలిపారు. 1985 నుంచి టీడీపీ గెలవని మంగళగిరి నుంచి పోటీచేసి 2019 ఎన్నికల్లో ఓటమి చవిచూశానని తెలిపారు. 2024 ఎన్నికల్లో పోరాడి 91వేల భారీ మెజారిటీతో గెలిచానని చెప్పారు. కష్టమైన మానవ వనరుల అభివృద్ధి శాఖను ఎంచుకున్నానన్నారు. తన భార్య బ్రాహ్మణి తన క్రెడిట్ కార్డు బిల్లు కడుతుందని చెప్పారు. మహిళా దినోత్సవం ఈ ఒక్క రోజు మాత్రమే కాదని, ప్రతిరోజూ జరుపుకోవాలని లోకేశ్ ఆకాంక్షించారు.
ఇవి కూడా చదవండి
PM Modi: ఈ ప్రపంచంలో అత్యంత సంపన్నుడను నేనే.. మహిళా దినోత్సవంలో మోదీ
PM Modi: మోడీ అకౌంట్ ఈమె చేతుల్లోనే.. ఎవరీ వైశాలి..
Israeli tourist: భారత్ పరువు తీశారు కదరా.. కర్ణాటకలో ఇజ్రాయెల్ మహిళపై సామూహిక అత్యాచారం..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.