Nimmala Ramanaidu: పోలవరం జాప్యంతో.. 50 వేల కోట్ల నష్టం!
ABN , Publish Date - Mar 07 , 2025 | 07:20 AM
జగన్ అసమర్థ పాలన, అసంబద్ధ నిర్ణయాల వల్ల పోలవరం ప్రాజెక్టు ఐదేళ్లు నిలిచిపోయిందని జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు.

డయాఫ్రంవాల్ విధ్వంసం మానవ తప్పిదమే
ఈ డిసెంబరుకల్లా పూర్తిచేస్తాం : నిమ్మల
అమరావతి, మార్చి 6(ఆంధ్రజ్యోతి): జగన్ అసమర్థ పాలన, అసంబద్ధ నిర్ణయాల వల్ల పోలవరం ప్రాజెక్టు ఐదేళ్లు నిలిచిపోయిందని జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. నిర్మాణంలో జాప్యం కారణంగా.. ప్రాజెక్టు పూర్తయితే రావలసిన దాదాపు రూ.50 వేల కోట్ల ఫల సాయం రాకుండా పోయిందని తెలిపారు. గురువారం శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో పోలవరం డయాఫ్రం వాల్‌పై సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాఽదానం చెప్పారు. కొత్త వాల్ నిర్మాణానికి రూ.1,000 కోట్లు ఖర్చవుతుందని, 2019లో తమ ప్రభుత్వం కొనసాగి ఉంటే ప్రాజెక్టు పూర్తవడమే కాకుండా రాయలసీమ, ఉత్తరాంధ్రకు నీటి ని అందించడం ద్వారా పంటలు పండి ఫల సాయం వచ్చేదని తెలిపారు. ‘2020లో ఆగస్టులో గోదావరికి వచ్చిన 23 లక్షల క్యూసెక్కుల వరద ఉధృతికి డయాఫ్రం వాల్ విధ్వంసానికి గురైంది. నిపుణులు పరిశీలించి ప్రకృతి వైపరీత్యం వల్ల కాదు.. మానవ తప్పిదం వల్లే అది ధ్వంసమైందని నివేదిక కూడా ఇచ్చారు. ఇప్పుడు మా ప్రభుత్వం జనవరి 18 తేదీన కొత్త వాల్ పనులు ప్రారంభించింది. డిసెంబరుకల్లా పూర్తి చేసే లక్ష్యంతో సాగుతున్నాం. 2027 డిసెంబరు నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలనే కృత నిశ్చయంతో ఉన్నాం’ అని స్పష్టం చేశారు. వంశధార లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ప్రారంభించామని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. గత ప్రభుత్వం పనులు చేసిన వారికి బిల్లులు చెల్లించలేదని, వంశధార లిఫ్ట్‌లో పెండింగ్ బిల్లులు చెల్లిస్తామన్నారు. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.176 కోట్లు కాగా.. వాస్తవ వ్యయం రూ.141.17 కోట్లని తెలిపారు. శ్రీకాకుళం జిల్లా ప్రజలకు ఎంతో ఉపకరించే నేరడి బ్యారేజీపై ఒడిశా,ఏపీ మధ్య కోర్టు వివాదాన్ని పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.